కార్తీక దీపం 2 జూలై 30 ఎపిసోడ్: నవ్వుల జల్లు, ఊహించని మలుపులు | Karthika Deepam 2 July 30 episode

surya
By -
0

 


స్టార్ మాలో ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్లు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. జూలై 30న ప్రసారమైన ఎపిసోడ్ కార్తీక్, పారు మధ్య జరిగిన హాస్యభరిత సన్నివేశాలతో, ఊహించని మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పారిజాతం దొంగతనం, కార్తీక్ తెలివిగా వేసిన ప్లాన్ ఈ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచాయి.

దీప, కార్తీక్ సంభాషణ: పారిజాతంపై కోపం

కార్తీక్, దీప శివనారాయణ ఇంట్లో వంటగదిలో ఉంటారు. దీప వంట చేస్తుండగా కార్తీక్ "అన్నీ నువ్వు అనుకున్నట్లే అవుతున్నాయి కదా.. హ్యాపీగా ఉండొచ్చు కదా?" అని అడుగుతాడు. దీనికి దీప "హ్యాపీగా ఎక్కడుండమంటావ్ చెప్పు.. పోనీలే పెద్దావిడ కదా అని ఊరుకుంటుంటే పారిజాతం గారు ఎన్నేసి మాటలు అంటున్నారు" అని తన అసహనాన్ని వ్యక్తం చేస్తుంది.

దీప మాటలకు కార్తీక్ స్పందిస్తూ, "ఈ మధ్య బాగా ఓవర్ యాక్షన్ చేస్తుంది కదా? ఇస్తాను తనకి.. ఒక సువర్ణ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా మరదలా.. సరే నువ్వు వంట చేస్తూ ఉండు నేను కారు పెట్రోల్ కొట్టించి వచ్చేస్తాను" అని బయటికి వస్తాడు. కారు తాళాలు తీసుకుని వెళ్తుండగా, సోఫాలో బాధగా కూర్చున్న పారును చూసి ఆగిపోతాడు.

పారు బాధ, కార్తీక్ అల్లరి

కార్తీక్ పారు దగ్గరకు వెళ్లి "ఈవిడేంటీ ఇలా కూర్చుంది? ఏంటి పారు సగం జీవితం నాశనం అయిపోయినట్లు ఇలా కూర్చున్నావేంటీ?" అని అల్లరిగా అడుగుతాడు. పారు "మనసు బాధగా ఉందిరా" అనగా, కార్తీక్ "హి..హి.. ఎవరిది?" అని తిరిగి ప్రశ్నిస్తాడు. పారు "నాదే" అనడంతో, కార్తీక్ షాక్ అయినట్లు చూస్తూ "ఏంటీ నీకు మనసు కూడా ఉందా?" అంటాడు. పారు గుర్రుగా "అదేంట్రా అలా అన్నావ్" అనగా, కార్తీక్ "అంటే నీది గుండ్రాయిలా ఉండే మనసు కదా.. అది బాధపడింది అంటే భారీ విపత్తు ఏదో జరిగి ఉండాలి" అని వెటకారం చేస్తాడు.

పారిజాతం ఫ్లాష్‌బ్యాక్: డబ్బుల కోసం ఆరాటం

కార్తీక్ మాటలకు పారు కోపంగా "అవునురా చాలా విపత్తే జరిగింది.. ఒకసారి పైకి చూడు" అంటూ శివనారాయణతో జరిగిన గొడవను ఫ్లాష్‌బ్యాక్‌లో చూపిస్తుంది. పారిజాతం శివనారాయణ గదికి వెళ్లి "నాకొక యాభై వేలు కావాలండి" అడుగుతుంది. శివనారాయణ "ఎందుకు?" అని ప్రశ్నించగా, పారు కోపంగా "ఎప్పుడు చూసినా ఎందుకు ఎందుకు అంటారేంటీ? నాకు అవసరాలు ఉండవా?" అంటుంది. దీనికి శివనారాయణ "ఏంటి గొంతు లేస్తుంది?" అని కోపంగా అంటాడు. పారు కాస్త తగ్గి, మళ్లీ డబ్బుల గురించి అడుగుతుంది. "నువ్వు మరింత వినయంగా అడిగినా నేను ఇవ్వను.. వెళ్లు ఇక్కడి నుంచి" అని శివనారాయణ కరాఖండిగా చెప్పి, మళ్లీ అడిగితే కొడతానని హెచ్చరిస్తాడు.

ఫ్లాష్‌బ్యాక్ ముగియగానే, కార్తీక్ జాలిపడినట్లుగా "కేవలం రూ.50 వేలు కోసం పెద్దసారు నిన్ను అంత మాట అన్నాడా?" అని అంటాడు. కార్తీక్ జాలి చూపిస్తున్నట్లు నటిస్తుంటే పారు అల్లాడిపోతుంది.

కార్తీక్ ప్లాన్: పారిజాతాన్ని రెచ్చగొట్టడం

కార్తీక్ "లాభం లేదు పారు.. ఈ రోజు నీ కళ్లు తెరిపించాల్సిందే" అంటూ దీపను వంటగదిలోకి వినిపించేలా పిలుస్తాడు. పారు కంగారుగా "ఒరేయ్ ఒరేయ్ ఇదంతా మళ్లీ నీ భార్యకు చెప్పి నా పరువు తీస్తావారా?" అని అంటుంది. కార్తీక్ "హే.. మాట్లాడకు పారు.. నీకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్లే" అంటూనే దీపను పిలుస్తాడు.

దీప రాగానే కార్తీక్ "ఏంటి బావా పిలిచావ్" అని అడుగుతుంది. కార్తీక్ "ఇప్పుడు నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను.. తడుముకోకుండా సమాధానం చెప్పాలి" అని చెప్పి, అవకాశం దొరికినట్లుగా కన్ను కొడతాడు. దీప "అడుగు బావా" అనగా, కార్తీక్ "మన ఇంట్లో పెత్తనం ఎవరిది?" అని అడుగుతాడు. పారిజాతాన్ని ఇరికించడానికి కార్తీక్ ఏదో ప్లాన్ చేశాడని దీప గ్రహించి "నాదే" అని సమాధానం ఇస్తుంది.

కార్తీక్ "విన్నావా పారు.. కానీ ఈ ఇంట్లో మాత్రం పెత్తనం నీది కాదు" అంటాడు. పారు "మీ తాతయ్య పులిరా" అనగా, కార్తీక్ "మగ పులులు కూడా ఆడ పులులు చెప్పిందే వింటాయి తెలుసా నీకు" అంటాడు. కార్తీక్ దీపతో "దీపా నీకు మరో ప్రశ్న.. ఇప్పుడు నీకు డబ్బులు అవసరం అయ్యాయనుకో.. అడిగి తీసుకుంటావా? అడక్కుండా తీసుకుంటావా?" అని అడుగుతాడు. దీప "అడక్కుండానే తీసుకుంటాను" అనడంతో, కార్తీక్ "గుడ్.. నువ్వు వెళ్లు దీపా మళ్లీ అవసరం అయితే పిలుస్తాను నువ్వు వెళ్లు" అని దీపను పంపించేసి, "చూశావా పారు.. భార్య అంటే అలా ఉండాలి" అని పారును బాగా రెచ్చగొడతాడు.

"భార్యను భర్తను ఏదీ అడక్కూడదు.. స్వాతంత్య్రంగా తీసుకోవాలి.. లేదంటే లాక్కోవాలి. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప" అంటూ విప్లవం గురించి చెప్పినట్లుగా పారు చుట్టూ తిరుగుతూ రెచ్చగొడతాడు. దాంతో పారిజాతం ఒక్కసారిగా కోపంతో "ఆపరా" అని కార్తీక్‌ను అరుస్తుంది.

పారిజాతం దొంగతనం, కార్తీక్ వీడియో సాక్ష్యం

కార్తీక్ ఆపగానే, పారు చీర చెంగు నడుముకు చుట్టి వీరనారిలా శివనారాయణ గదికి వెళ్తుంది. కార్తీక్ సోఫాలో కూర్చుని ఏం జరుగుతుందో చూస్తాడు. శివనారాయణ గదిలో లేకపోవడంతో, పారు లాకర్‌లో నుంచి రూ.50 వేలు దొంగలించేస్తుంది. "నేను ఇప్పుడు ఆడపులిని.. ఇన్ని కట్టల్లో ఒక రూ.50 వేలు మాయం అయితే కనిపెట్టలేడులే" అని అనుకుని బయటికి వెళ్తుంది.

ఆ డబ్బు తీసుకుని కార్తీక్ దగ్గరకు వచ్చేసరికి, కార్తీక్ కూర్చున్న చోట శివనారాయణ ఉంటాడు. ఫోన్‌లో ఏదో చూస్తూ ఉంటాడు. పారు చేతిలోని డబ్బులు వెనక్కి దాచుకుని వినయంగా మాట్లాడటం ప్రారంభిస్తుంది. వెంటనే శివనారాయణ పైకి లేచి "పారిజాతం ఇలాంటి సాహసాలను ఎప్పుడైనా చూశావా?" అంటూ పారిజాతం అప్పుడే దొంగలించిన రూ.50 వేలు దొంగలించిన వీడియోని చూపిస్తాడు. పారు బిత్తరపోతుంది. "ఈ వీడియో ఎవరు తీశారు?" అని పారు మనసులో అనుకునేలోపే, "నేనే" అని కార్తీక్ సోఫా వెనుక నుంచి పైకి లేస్తాడు. తాతకు తనే సెండ్ చేశానని సైగ చేస్తాడు.

పారు రగిలిపోతుంది. "ఇలా ఇరికించావ్ ఏంట్రా?" అని అనుకుంటూనే "కార్తీక్ గాడి ఇంట్లో పెత్తనం ఎవరిదో తెలుసా? భార్య భర్తను డబ్బులు అడిగి తీసుకోవడం ఏంటీ? అందుకే తీసుకున్నాను" అని శివనారాయణ ముందు తిక్క సమాధానాలు చెబుతుంది. వెంటనే కార్తీక్ "అమ్మా దీపా ఒకసారి వచ్చి పొమ్మా" అని పిలుస్తాడు. దీప వస్తుంది. పారు ముందు అడిగిన ప్రశ్నలే మళ్లీ అడుగుతాడు. "సమాధానాలు బాగా వినండి" అని పారు శివనారాయణతో అంటుంది. శివనారాయణ వింటాను అన్నట్లుగా చూస్తుంటాడు. అయితే, దీప సమాధానాలు అన్నీ రివర్స్‌లో చెబుతుంది.

"మన ఇంట్లో పెత్తనం నీదే బావా.. నాకు డబ్బులు అవసరం అయితే నిన్ను అడిగే తీసుకుంటాను కదా" అంటూ దీప మాట మార్చేయడంతో పారు అక్కడే సోఫాలో పడిపోతుంది. కార్తీక్ పక్కకు వెళ్లి "పారు.. పారు ఉన్నావా పోయావా" అని అంటాడు. ఆ సీన్ చాలా కామెడీగా ఉంటుంది.

బెత్తం దెబ్బ, కార్తీక్ ప్రతీకారం

"ఇక తప్పించుకోలేవు కానీ లే.. ఇంకోసారి ఇలా చెయ్యొద్దు" అని శివనారాయణ పారుపై ఫైర్ అవుతాడు. "ఈ మాత్రం చాలదు పెద్దసారు.. శిక్ష పడాల్సిందే" అంటూ షర్ట్ వెనుక నుంచి బెత్తం తీస్తాడు కార్తీక్. పారు బిత్తరపోతుంది. "ఏంట్రా ఇది?" అంటుంది బిక్కముఖం వేసి.

"దీన్నే బెత్తం అంటారు. చిన్నప్పుడు అందరికీ పరిచయమే" అంటాడు కార్తీక్ నవ్వుతూ. "నాకు పెద్దగా పరిచయం లేదురా" అంటుంది పారు వణికిపోతూ. "నువ్వు జీవితాన్నే చదివిన పెద్ద మనిషివి కదా.. పరిచయం చేసుకోవడానికి వచ్చిందిలే" అంటూ శివనారాయణ చేతిలో పెడతాడు. పారు చేతిలోని డబ్బు కట్టును తీసుకున్న శివనారాయణ, ఆ బెత్తం తీసుకుని స్కూల్లో స్టూడెంట్‌ని కొట్టినట్లు చేతి మీద గట్టిగా కొట్టి, తిరిగి ఆ బెత్తాన్ని కార్తీక్‌కి ఇస్తాడు. "ఇంకోసారి ఇలాంటి తప్పు జరిగితే రెండు దెబ్బలు పడతాయి ఇలానే.. తప్పులు పెరిగే కొద్ది దెబ్బలు పెరుగుతాయి" అంటూనే "రేయ్ డ్రైవర్.. ఆ బెత్తం జాగ్రత్త అవసరానికి ఇస్తుండు" అనేసి వెళ్లిపోతాడు.

పారు బెత్తం దెబ్బ తగిలిన చేతిని చూసుకుంటూ ఊదుకుంటూ "ఎందుకురా ఇలా చేశావ్?" అని కార్తీక్‌ను అడుగుతుంది. కార్తీక్ "రివేంజ్.. ఉదయాన్నే ఈ చెయ్యే కదా నా భార్య మీద లేచింది" అంటూ గుర్తు చేస్తాడు. అది గుర్తు చేసుకుని పారు బిత్తరపోతుంది. "వెన్నుపోటు పొడిచావ్ కదరా" అంటుంది పారు. "అది నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను.." అంటాడు కార్తీక్. "నేను ఎవరికి అన్యాయం చేశానురా" అంటుంది పారు. "గురువిందగింజ అందుబాటులో లేదు కానీ ఉంటే చేతిలో పెట్టి మరీ చెప్పేవాడ్ని" అంటాడు కార్తీక్. "ఏంటది?" అంటుంది పారు. "సామెత" అంటాడు కార్తీక్. "అర్థమైందిలే.. ఈ జాగ్రత్త పడతాను" అంటుంది పారు.

కార్తీక్ "దెబ్బలు పడతాయి రాజా" సాంగ్ పాడుకుంటూ వెళ్లిపోతుంటే దీప "బావా" అని ఆపుతుంది. "ఏంటి మరదలా"? అంటాడు కార్తీక్. "ఒకవేళ నువ్వు ఇలా కొట్టించావని పారిజాతం గారు పగబడితే?" అంటుంది దీప. "ఒసేయ్ పోయేవాడ్ని ఎందుకే కదుపుతావ్" అంటుంది పారు తల కొట్టుకుంటూ. "నువ్వు అనేది నిజమే మరదలా.. ఎందుకైనా మంచిది ఈ బెత్తం జాగ్రత్తపెడతాను.. ముందు ముందు దీనితో చాలా పని ఉన్నట్లుంది.. పదా పని అయిపోతే త్వరగా ఇంటికి వెళ్లాలి" అంటూ బెత్తాన్ని చంకలో పెట్టుకుని బిల్డప్‌గా నడిచి వెళ్తాడు కార్తీక్. దీప కూడా వెళ్ళిపోతుంది. "అమ్మో వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి" అని పారు మనసులో అనుకుంటుంది. మొత్తానికీ కార్తీక్ (నిరుపమ్ పరిటాల) యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది నేటి కథనంలో. అయితే, పారు దొంగతనానికి వెళ్లడం, వెంటనే వీడియోతో శివనారాయణ సోఫాలో కూర్చోవడం, ఆ వీడియో సీన్ సింక్ చేయడం వంటి కొన్ని సన్నివేశాలు సహజత్వాన్ని కోల్పోయాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!