ఈ వారం సినీ ప్రియులకు పండగే! థియేటర్లలో పలు ఆసక్తికర చిత్రాలు విడుదలవుతుండగా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. యాక్షన్, కామెడీ, రొమాన్స్... ఇలా అన్ని జానర్ల సినిమాలు ఈ వారం విడుదలవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు, సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం.
థియేటర్లలో విడుదలవుతున్న చిత్రాలు
ఈ వారం నాలుగు ప్రముఖ చిత్రాలు థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో విజయ్ దేవరకొండ, విజయ్ సేతుపతి, అజయ్ దేవగణ్ వంటి అగ్రతారల సినిమాలు కూడా ఉన్నాయి.
కింగ్డమ్ (Kingdom)
‘వాడి కోసం అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సర్’ అంటూ విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రంలో సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 31న (Kingdom release date) ప్రేక్షకుల ముందుకు రానుంది.
సార్ మేడమ్ (Sir Madam)
విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ జంటగా నటించిన ‘సార్ మేడమ్’ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మించింది. యోగిబాబు, చెంబన్ వినోద్ జోస్ వంటి నటులు ముఖ్య పాత్రలు పోషించారు. తమిళంలో ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం తెలుగులో ఆగస్టు 1న విడుదల కానుంది. పెళ్లి తర్వాత దంపతుల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలను వినోదాత్మకంగా చూపించే కామెడీ డ్రామాగా ఈ సినిమా రూపొందింది.
ఉసురే (Usure)
టీజై అరుణాచలం, జనని కునశీలన్ జంటగా నవీన్ డి గోపాల్ తెరకెక్కించిన చిత్రం ‘ఉసురే’. మౌళి ఎం. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాలో రాశి కీలక పాత్ర పోషించారు. ఆగస్టు 1న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న గ్రామీణ ప్రేమకథ అని చిత్ర యూనిట్ చెబుతోంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సన్నాఫ్ సర్దార్ 2 (Son of Sardaar 2)
అజయ్ దేవగణ్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సన్నాఫ్ సర్దార్ 2’. గతంలో వచ్చిన ‘సన్నాఫ్ సర్దార్’కి సీక్వెల్‌గా ఈ మూవీని రూపొందించారు. వాస్తవానికి జులై 25న విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ కుమార్ అరోరా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
0 కామెంట్‌లు