Baby food | శిశువులకు ఘనాహారం ఎప్పుడు, ఎలా ప్రారంభించాలి? తల్లిపాల ప్రాముఖ్యత ఏమిటి? జబ్బుపడినప్పుడు ఆహారం ఎలా ఇవ్వాలి?

surya
By -
0

తల్లిదండ్రులు ప్రేమగా పెట్టే ప్రతి ముద్దలో వాత్సల్యం ఉంటుంది, కానీ బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగాలంటే ఆ ముద్ద పోషకాల గని కావాలి. మెతుకు మెతుకులో విటమిన్లు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండాలి. కొన్నిసార్లు పసివాడు తినడానికి మొహం తిప్పేసుకుంటాడు, లేదా ఉమ్మేసుకుంటాడు. అది అయిష్టత కాదు, తన బాధనూ, భయాలనూ వ్యక్తంచేసే మార్గం. ఈ భాషను అమ్మలు అర్థం చేసుకోవాలి. అన్నిటికన్నా ముందు, పసివాళ్లకు ఏం తినిపించాలి, ఎలా తినిపించాలి, ఎంత తినిపించాలి అన్న స్పష్టత ఉండాలి.

ఘనాహారం ఎప్పుడు ప్రారంభించాలి?

పసిపిల్లల ఆరోగ్యానికి, ఆహారానికి సంబంధించి అంతర్జాతీయంగా అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. చాలాకాలం వరకూ బిడ్డకు తొమ్మిది నెలలు వచ్చేదాకా ఏ ఘనాహారమూ పెట్టేవారు కాదు, తల్లిపాలే సరిపోతాయని నమ్మేవారు. ఆ తర్వాత, కొంతమంది నిపుణులు ఆరేడు నెలల వయసు నుంచి అదనపు ఆహారం ఇవ్వవచ్చని ప్రతిపాదించారు. నిజానికి ఘనాహారాన్ని ఎప్పుడు ప్రారంభించాలనే విషయంలో కచ్చితమైన సమయాన్ని ఎక్కడా నిర్ధారించలేదు. బిడ్డ పెరుగుదల, తల్లిపాల లభ్యతపైనే ఇదంతా ఆధారపడి ఉంటుంది.

ఘన పదార్థాలకు శిశువు సిద్ధంగా ఉందని తెలిపే సంకేతాలు:

మూడు నెలల వయసులో: శిశువు చొల్లు కార్చడం ప్రారంభిస్తుంది. ఇదే సమయంలో పిండి పదార్థాలను జీర్ణం చేసే అమైలేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తి మొదలవుతుంది.

తర్వాత కొన్ని రోజులకు: శిశువు తల్లి రొమ్ము మొనలను కొరకడానికి ప్రయత్నిస్తుంది. దాంతోపాటు నోట్లో ఏదైనా ఆహారం ఉంచినట్లయితే, ఇంతకు ముందులా నాలుకతో బయటికి తోసేయదు, మింగడానికి ప్రయత్నిస్తుంది.

ఆరు నెలల వయసులో: చిగుళ్లు గట్టి పడటమూ మొదలవుతుంది. అంటే, ఘన పదార్థాలను జీర్ణించుకోవడానికి సిద్ధంగా ఉందన్నమాట.

తొమ్మిది నెలలు వచ్చేసరికి: తనంతట తాను చేతితో ఆహారాన్ని నోటివద్దకు తీసుకెళ్తుంది. అప్పటికే, శిశువు బరువు ఆరేడు కిలోలకు చేరుకొని ఉంటుంది. ఇక, ఈ దశ నుంచీ తల్లిపాలు పెరిగే బిడ్డ అవసరాలను తీర్చలేవు. ఈ సమయంలోనే అనుబంధ ఆహారాన్ని ప్రారంభించవచ్చు.

ఆహారం అందించే విధానం: స్పూన్ లేదా చేతితోనే ఉత్తమం

శిశువుకు ఇచ్చే ఘనాహారాన్ని చెంచాతో లేదా చేతితో ఇవ్వాలి. ద్రవాహారానికైతే ఉగ్గు గిన్నె సరిపోతుంది. కొందరు, పాలకు కొంచెం పొడి రూపంలో ఉండే ఆహారాన్ని కలిపి సీసాతో తాగిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పని త్వరగా పూర్తవుతుందేమో కానీ, ఈ అలవాటు ప్రమాదకరం.

సీసాతో ఆహారం ఇవ్వడం వల్ల కలిగే నష్టాలు:

వ్యాధుల ప్రమాదం: సీసాతో ఘనాహారం తాగించడం వల్ల, అందులోనూ సీసా శుభ్రంగా లేకపోతే అనేక వ్యాధులు (విరేచనాలు, వాంతులు) చుట్టుముట్టవచ్చు.

ఇతర సమస్యలు: చెవిలో చీము పట్టడం, దంతాలు పుచ్చిపోవడం లాంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.

పోషక లోపం: సీసాకు బిగించిన పీకద్వారా ఆహారం నోట్లోకి రావాలంటే, ఆ పీక చాలా పలుచగా ఉండాలి. మరీ పలుచటి ఆహారం ఇచ్చినట్లయితే పోషక విలువలు తగ్గిపోయి, నాసిరకం ఆహారంతో కడుపు నిండిపోతుంది.

ఊపిరితిత్తుల సమస్యలు: పీక రంధ్రాలు మరీ పెద్దవిగా ఉంటే, త్వరత్వరగా నోట్లోకి వచ్చినప్పుడు శిశువు సరిగా మింగలేక ఇబ్బందిపడవచ్చు, వాంతి చేసుకోవచ్చు. పొరపాటున ఆహారం ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తే ఇంకా ప్రమాదం, అది న్యుమోనియాకు దారి తీయవచ్చు.

మాతా-శిశు అనుబంధం లోపం: చేతితోగానీ చెంచాతోగానీ తినిపించడం మాతా-శిశు అనుబంధానికి ఎంతో ముఖ్యం. ఇలా తినిపించినప్పుడు కనిపించే ఆలనా లాలనా, సంభాషణ సీసాతో తాగించినప్పుడు ఉండదు. దీంతో తల్లి ఏ ఫోన్‌లోనో మాట్లాడుకుంటుంది, వేరే పని చేసుకుంటుంది. ఫలితంగా, శిశువు మానసికాభివృద్ధికి దోహదపడే ఓ ద్వారం మూసుకుపోతుంది, అది శిశువు భవిష్యత్తుపైనా కొంత ప్రభావం చూపుతుంది.

అభివృద్ధిలో జాప్యం: సీసాతో ఆహారాన్ని తాగించడం వల్ల శిశువు పెరుగుదల, అభివృద్ధిలో ముఖ్య దశలు—చప్పరించడం, కొరకడం, నమలడం—సరైన సమయంలో అలవాటు కావు. దీనివల్ల పిల్లలు పెద్దయ్యాక కూడా, తమ వయసుకు తగిన ఆహారం తీసుకోవడానికి అయిష్టత చూపుతారు.

అలవాట్ల మార్పు కష్టం: సీసాతో కొద్దిరోజులు తాగించి, ఆ తర్వాత మాన్పించడానికి ప్రయత్నిస్తే శిశువు మార్పును ఇష్టపడదు, తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. సీసాతో పాలు తాగించడమే తప్పు. దాంట్లో ఆహారం వేసి తాగించడం ఇంకా తప్పు. కాబట్టి, సాధ్యమైనంత వరకూ చెంచాతోనే తినిపించాలి.

శిశువు ఆహారం పట్ల అయిష్టత: సహనంతో వ్యవహరించండి

కొంతమంది పిల్లలు ఆహారాన్ని నోట్లో పెట్టగానే ఆబగా తినేస్తారు. మరికొందరు అస్సలు తీసుకోరు, తిండి అనగానే ఏడుపు మొదలుపెడతారు. ఇంకా బలవంతం చేస్తే నోట్లోంచి ఉమ్మేస్తారు, వాంతి చేసుకుంటారు. ఇది ఆందోళన చెందాల్సిన విషయమేమీ కాదు. ఇలాంటి సమయంలో అమ్మలకు సహనం, నేర్పు అవసరం. తాత్కాలికంగా ఆ ప్రయత్నం ఆపేసి, తల్లిపాలు తాగించాలి. తిరిగి ఐదారు రోజుల తర్వాత మరొకసారి ప్రయత్నించి చూడాలి. 

కొంతమంది శిశువులు మొదట్లో ఆహారం తీసుకోవడంలో ఆసక్తి చూపకపోయినా, కొద్దిసేపు తల్లిపాలు తాగిన తర్వాత మధ్యలో తేలికపాటి ఆహారం ఇస్తే ఆసక్తిగా తినే అవకాశం ఉంటుంది. ఒక రకమైన ఆహారాన్ని పదే పదే నిరాకరిస్తే, దాన్ని తాత్కాలికంగా తప్పించి వేరొక రకం ప్రయత్నించడం మంచిది. పెద్దలాగే చిన్నపిల్లలకూ రుచుల విషయంలో ఇష్టాయిష్టాలు ఉంటాయి — కొన్ని రుచులు నచ్చవు, కొన్ని బాగా నచ్చుతాయి. అయితే కాలక్రమంలో పిల్లలు ఆహారానికి అలవాటుపడతారు. 

కావున, పిల్లలకిష్టమయ్యే విధంగా, తినాలనిపించే సమయాల్లోనే ఆహారం ఇవ్వాలి. బలవంతంగా తినిపించేందుకు ముక్కు మూసి, కాళ్లూ చేతులూ పట్టుకుని గట్టిగా కడుపు నింపాలనుకొంటే శిశువులో ఆహారంపై ఆసక్తిని పూర్తిగా నాశనం చేసే ప్రమాదం ఉంది. ఓపికగా, ప్రేమతో, ఆహారాన్ని పరిచయం చేస్తూ నెమ్మదిగా అలవాటు చేయాలి.

శిశువు ఆహారంలో ఉప్పు, చక్కెర, మసాలాలు వద్దు!

ఉప్పు: శిశువుకు పెట్టే ఏ ఆహారంలోనూ ఉప్పు కలుపరాదు. ఆహారంలో ఉప్పు జోడించడం వల్ల దాహం పెరుగుతుంది. ఎక్కువగా నీరు తాగడం వల్ల ఆకలి తగ్గిపోతుంది. పసితనం నుంచే ఉప్పు ఇవ్వడం ప్రారంభిస్తే భవిష్యత్తులో అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఉప్పు బిస్కెట్లు కూడా ఏడాది వయసుకు ముందు ఇవ్వకూడదు.

చక్కెర/గ్లూకోజ్: శిశువుకు తినిపించే ఆహారంలో చక్కెర, గ్లూకోజ్ కూడా కలుపవద్దు. దీనివల్ల ప్రతి ఆహారం తీపిగా తీసుకొనే దురలవాటు మొదలవుతుంది. తీపి పదార్థాలను అధికంగా తినడం వల్ల నోట్లో ఉన్న బ్యాక్టీరియా వాటిపై చర్య చూపి ఆహారాన్ని ఆమ్లాలుగా మారుస్తుంది. ఈ ఆమ్లాలు దంతాలపై దాడి చేసి వాటిని దెబ్బతీస్తాయి. ఒకసారి మిఠాయిలకు అలవాటు పడితే, మిగతా రుచులపై ఆసక్తి చూపరు. చాక్లెట్లు, జెమ్స్, పెప్పరమెంట్లు కూడా దంత వినాశనానికి దారి తీస్తాయి. చిన్న పిల్లలకు తిన్న తర్వాత నోరు శుభ్రంగా పుక్కిలించి ఉమ్మేయడం చేతకాదు కాబట్టి, అసలు ఇవ్వకపోవడమే మంచిది. ఒకవేళ అప్పుడప్పుడూ తీపి పదార్థాలు ఇచ్చినా, తిన్న వెంటనే నీళ్లు తాగిస్తే నోరు శుభ్రంగా ఉండి దంతాలకు నష్టం కలగకుండా ఉండవచ్చు.  కాస్త పులుపుగా ఉండే పండ్ల రసాలు తాగడానికి ఇష్టపడకపోతే... వాటిలో కొంచెం నీళ్లు కానీ, పాలు కానీ కలిపి ఇవ్వాలే కానీ గ్లూకోజ్, చక్కెర జోలికి వెళ్లకూడదు.

మసాలాలు: చిన్న పిల్లలకు మసాలాలు దట్టించిన ఆహారం అస్సలు పెట్టకూడదు. ఆ ఘాటువల్ల కండ్లలో నీరు కారవచ్చు, వాంతి కావచ్చు. ఆ తర్వాత కడుపులో మంట ఏర్పడవచ్చు, నొప్పి, విరేచనాలు కావచ్చు. కాబట్టి, ఇంట్లో వంట చేస్తుండగా మసాలాలు వేసే ముందు, చిన్నపిల్లల కోసం కొంత భాగాన్ని ముందుగానే పక్కన పెట్టడం మంచిది.

శిశువులకు నీరు & ఆహార శుభ్రత

మన శరీరంలో 60 శాతం నీరు ఉంటుంది. శరీరంలోని మలినాలను తొలగించడం, శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడం వంటి ముఖ్యమైన ప్రక్రియలన్నీ నీటి సహాయంతోనే జరుగుతాయి.

నీరు ఎప్పుడు ఇవ్వాలి: మొదటి ఆరు నెలలు శిశువుకు ఏ విధమైన ద్రవపదార్థాలూ ఇవ్వాల్సిన పనిలేదు, తల్లిపాలే సరిపోతాయి. ఆరు నెలల తరువాత శిశువుకు అదనపు ఆహారం మొదలుపెట్టినప్పుడు, ప్రతి భోజనానంతరం 2–3 చెంచాల నీటిని ఇవ్వడం మంచిది. ఎండకాలంలో కొంత ఎక్కువ ఇవ్వడం మంచిది. నీటితోపాటు నారింజ, నిమ్మ, ద్రాక్ష, మామిడి రసాలు, కొబ్బరి నీరు, పుచ్చకాయ, ఖర్బూజా రసాలు తాగించవచ్చు.

ఆహార శుభ్రత: పిల్లలకు వచ్చే వ్యాధులలో సగానికి పైగా ఆహారం ద్వారానో, నీటి ద్వారానో శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మజీవుల వల్ల వచ్చేవే. కాబట్టి, శిశువుకు పెట్టే ఆహారం చాలా శుభ్రంగా ఉండాలి. లేదంటే, అందులో హానికర సూక్ష్మజీవులు చేరిపోయి, బిడ్డ ఆరోగ్యమూ పాడైపోతుంది. మన దేశంలో చాలామంది రోజుకు రెండుసార్లకు మించి వండుకోరు. కాబట్టి, వండిన ఆహారాన్ని శిశువు తినేవరకూ భద్రపరచాలి. వంటకాలను చల్లని ప్రదేశంలో, పరిశుభ్రంగా మూతపెట్టి ఉంచాలి. వండిన ఆహారాన్ని రెండు గంటలలోపు శిశువుకు ఇవ్వడం వల్ల బాక్టీరియా పెరుగుదల తగ్గి అనేక రకాల వ్యాధులను నివారించవచ్చు.  

జబ్బుపడినప్పుడు ఆహారం

శిశువు జబ్బు పడినప్పుడు, కొందరు తల్లిదండ్రులు ‘లంఖణం పరమౌషధం’ అన్న సాకుతో జబ్బుపడ్డవారికి ఏ ఆహారం ఇవ్వకుండా కడుపు మాడ్చుతుంటారు. నిజానికి ఆరోగ్యవంతులతో పోలిస్తే, రోగులకే బలవర్ధకమైన ఆహారం అవసరం. వ్యాధి నుంచి కోలుకుంటున్న దశలో ఆకలి బాగా వేస్తుంది. అంతకుముందు కన్నా ఎక్కువ ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించాలి. పిల్లలకు ఆహారం ఇష్టం లేకపోతే తినిపించడం కష్టం కాబట్టి, వారికిష్టమైన ఆహారాన్నే మెత్తగా చేసి కొద్దికొద్దిగా ఎక్కువసార్లు ఇవ్వాలి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!