ఇది రికార్డ్! కేవలం 17 నెలల వ్యవధిలోనే లక్షల మంది కల నెరవేరింది. ఏపీ చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది.
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అతి పెద్ద కార్యక్రమం ఒకటి బుధవారం (నవంబర్ 12) జరుగుతుంది. లక్షల మందికి ఒకేసారి ఇంటి యజమానులుగా చేసే బృహత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీని, అధికారంలోకి వచ్చిన 17 నెలల వ్యవధిలోనే నెరవేరుస్తుండటం రికార్డుగా చూస్తున్నారు.
3 లక్షల ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు
కూటమి ప్రభుత్వం పాలనా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 'అందరికీ ఇళ్ళు' పథకంపై దృష్టి సారించింది. సొంత ఇల్లు లేని వారిని గుర్తించడమే కాకుండా, నిధులను సమకూర్చి, నిర్మాణం పనులు కాలపరిమితిలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంది.
ఆ విధంగా రాష్ట్రవ్యాప్తంగా 3,00,192 ఇళ్లు పూర్తి అయ్యాయి. బుధవారం, ఈ మూడు లక్షల ఇళ్లలో పేదలంతా ఒకే సారి గృహ ప్రవేశం చేయనున్నారు.
రాయచోటి నుంచి సీఎం ప్రారంభం
ఈ సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా, రాయచోటి మండలం, దేవగుడిపల్లి గ్రామంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. అక్కడ ఆయన లబ్ధిదారులకు స్వయంగా ఇంటి తాళాలు అందిస్తారు.
అదే సమయంలో, రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకున్న మిగిలిన ఇళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.
వివిధ పథకాల కింద నిర్మాణం..
దశాబ్దాల పేదల కలను నెరవేరుస్తున్న ఈ కార్యక్రమంలో.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) బీఎల్సీ కింద నిర్మించిన 2,28,034 ఇళ్లు, పీఎంఏవై గ్రామీణ్ కింద 65,292 ఇళ్లు, పీఎంఏవై జన్మన్ పథకం కింద మరో 6,866 ఇళ్లు ఉన్నాయి.
ఉచిత ఇసుకతో అండ
ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త ఇసుక విధానం కూడా ఈ బృహత్తర కార్యక్రమానికి దోహదపడింది. పేదల ఇళ్ల నిర్మాణానికి దాదాపు 20 టన్నుల ఇసుకను ఉచితంగా పొందేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది.
అన్ని రకాల వెసులుబాట్లు కల్పించి, ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా, లక్షలాది పేద కుటుంబాలకు సొంతింటి భరోసా దక్కిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

