"వాళ్లిద్దరూ పెద్ద దెయ్యాలు, అందుకే చంపా!".. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు, తల్లిని, తమ్ముడిని అత్యంత కిరాతకంగా చంపిన ఆ హంతకుడే! ఈ దారుణ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో తీవ్ర కలకలం రేపింది.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో సొంత తల్లి, తమ్ముడిని చంపేసినట్లు గునుపూటి శ్రీనివాస్ అనే నిందితుడు సోమవారం వేకువజామున ఉదయం 3 గంటల సమయంలో పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు.
హంతకుడే 112కి కాల్ చేశాడు!
పోలీస్ టోల్ ఫ్రీ 112కి కాల్ చేసిన నిందితుడు శ్రీనివాస్, తాను చాకుతో తల్లి మహాలక్ష్మి, తమ్ముడు రవితేజను హతమార్చినట్లు సమాచారమిచ్చాడు. అంతేకాదు, తన ఇంటి అడ్రస్‌ను కూడా పోలీసులకు తెలియజేయడంతో వారు షాక్ తిన్నారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆఘమేఘాలపై అక్కడికి చేరుకున్నారు.
పోలీసులను షాక్‌కు గురిచేసిన మాటలు
"నా తల్లి మహాలక్ష్మి, నా తమ్ముడు రవితేజ పెద్ద దెయ్యాలు. నా మనసులో ఏమనుకున్నా వారికి తెలిసిపోతుంది. నన్ను పిచ్చివాడిని చేసి ఇంట్లో బంధించి బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. అందుకే వారిద్దరిని చాకుతో పొడిచేశా. వారి శరీరాలు చాలా గట్టివి, చాకు కూడా దిగడం లేదు. మళ్లీ ఇప్పుడు లేచి వస్తారేమో?" అంటూ నిందితుడు శ్రీనివాస్ చెప్పిన మాటలతో పోలీసులు షాక్ తిన్నారు.
ఒక్కొక్కరిపై 20 కత్తిపోట్లు..
పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లే సరికి, రవితేజ, మహాలక్ష్మి రక్తపు మడుగులో ఉన్నారు. ఒక్కొక్కరి శరీరంపై 20 వరకు కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే శ్రీనివాస్ మొదటి ఫ్లోర్ నుంచి కిందికి దిగి రోడ్డుపై ఉండటంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
మతిస్థిమితం లేకపోవడమే కారణమా?
భీమవరం పట్టణంలోని రెస్ట్ హౌస్ రోడ్డులో నివాసం ఉంటున్న ఈ కుటుంబం ఫైనాన్స్ వ్యాపారం, షాపులు, ఇంటి అద్దెలతో జీవనం సాగిస్తోంది. తండ్రి శ్రీరాములు కరోనాతో గతంలోనే మరణించారు. కుమార్తెకు వివాహమై బెంగళూరులో ఉంటున్నారు.
ఇటీవల పెద్దకుమారుడు శ్రీనివాస్ మతిభ్రమించినట్లు మాట్లాడుతుండటంతో, అతన్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా తల్లి, తమ్ముడు చూసుకుంటున్నారు. అప్పుడప్పుడు డబ్బుల విషయంలో కూడా అతడు వారితో తగాదా పడుతున్నాడని, సోమవారం ఎవరూ ఊహించని విధంగా ఈ దురాగతానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
బంధువులు ఎవరూ స్పందించకపోవడంతో, బెంగళూరులో ఉంటున్న హతురాలి కుమార్తెకు పోలీసులు సమాచారం ఇచ్చారు. సొంత కుటుంబ సభ్యులనే దెయ్యాలుగా భావించి, కిరాతకంగా చంపడమే కాకుండా, నిందితుడే పోలీసులకు ఫోన్ చేయడం భీమవరం పట్టణంలో తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

