ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర.. అన్నీ ఓడిపోయారు! ఇప్పుడు ఆ ఒక్క నేత భవిష్యత్తంతా, కేవలం ఒక్క రోజులో తేలనున్న బీహార్ ఫలితాలపైనే ఆధారపడి ఉంది!
బీహార్ ఎన్నికల మీద కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కోటానుకోట్ల ఆశలు పెట్టుకున్నారు. గాంధీల వంశంలో ఐదవ తరానికి చెందిన రాహుల్ గాంధీకి వారసత్వం దక్కినా, అందలం మాత్రం దశాబ్దాలుగా అందనంత దూరంలోనే ఉంది. 2014, 2019, 2024.. ఇలా వరుస ఓటముల తర్వాత, ఆయన నాయకత్వంపై సొంత కూటమిలోనే సందేహాలు మొదలయ్యాయి.
3 రాష్ట్రాల ఓటమి.. బీహార్‌పైనే భారం!
2024లో కేంద్రంలో ఎన్డీయే మూడవసారి అధికారంలోకి వచ్చిన తరువాత, ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయే విజయం సాధించింది. దీంతో ఇండియా కూటమి మరింత ఇబ్బందుల్లో పడింది. ఈ క్రమంలో, బీహార్ ఎన్నికలు ఇండియా కూటమికి, ప్రత్యేకించి రాహుల్ గాంధీకి అత్యంత కీలకమైన అగ్నిపరీక్షగా మారాయి.
రాహుల్ పోరాటం.. రివర్స్ అయిన ఎగ్జిట్ పోల్స్!
అందుకోసమే, రాహుల్ గాంధీ ఎన్నికలకు చాలా ముందు నుంచే బీహార్‌పై దృష్టి పెట్టారు. 'ఓటర్ అధికార్ యాత్ర'లు, ఈసీపై ఓట్ల చోరీ విమర్శలు, మోడీపై నేరుగా విమర్శలు.. ఇవన్నీ బీహార్‌లో గెలుపు కోసమే చేశారు. బీహార్‌లో 'మహా ఘట్ బంధన్' (MGB) గెలిస్తే, ఇండియా కూటమి దశ మారుతుందని ఆయన గట్టిగా భావించారు.
కానీ, ఈ ఆశలపై ఎగ్జిట్ పోల్ సర్వేలు నీళ్లు చల్లాయి. ప్రీ-పోల్ సర్వేలు MGBకి అనుకూలంగా ఉన్నా, రెండు విడతల పోలింగ్ తర్వాత సీన్ మారిందని, అన్ని ఎగ్జిట్ పోల్స్ ఏకపక్షంగా ఎన్డీయేకే పట్టం కట్టాయి. ఒక్క సర్వే కూడా MGB గెలుస్తుందని చెప్పకపోవడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది.
14న ఫలితం.. "ఇజ్జత్ కా సవాల్"!
ఎగ్జిట్ పోల్ సర్వేలను తాము నమ్మబోమని, 'ఎగ్జాక్ట్ పోల్స్'లో విజయం MGBదే అని కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలు రావడానికి కూడా ఒకే ఒక్క రోజు (నవంబర్ 14) మాత్రమే సమయం ఉంది. ఉదయం పది గంటలకల్లా ట్రెండ్ తెలిసిపోతుంది.
చాలా సందర్భాలలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే నిజమయ్యాయి. ఒకవేళ బీహార్‌లో కూడా అదే రిపీట్ అయితే, ఆర్జేడీకి నష్టం ఉన్నా, రాహుల్ గాంధీకి మాత్రం ఇది రాజకీయంగా పెను సంక్షోభం.
ఇప్పటికే రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ గెలవలేకపోతోందన్న విమర్శలు ఉన్నాయి. ఇండియా కూటమిలో పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేతగా, రాహుల్‌కు ఈ ఫలితాలు చాలా ముఖ్యం. ఒకవేళ బీహార్‌లో కూడా ఫలితం రివర్స్ అయితే, ఇండియా కూటమి నాయకత్వంలోనే మార్పులు రావొచ్చని అంటున్నారు. అందుకే ఈ బీహార్ ఎన్నికలు రాహుల్ గాంధీకి "ఇజ్జత్ కా సవాల్" గా మారాయి.

