తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. బకాయిల్లో కనీసం 50 శాతం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు సమ్మెకు దిగడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రైవేట్ విద్యాసంస్థలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
"విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దు!"
సమ్మె చేస్తున్న యాజమాన్యాల తీరుపై సీఎం మండిపడ్డారు. "సహకరించాల్సిన వారే బంద్ పెడుతున్నారు. బంద్ పెట్టారు కదా, ఫీజులు అడగరా?" అని ఆయన ప్రశ్నించారు. "మేము వచ్చిన తర్వాత బకాయి పెరిగినా, వాటిని విడతల వారీగా చెల్లిస్తాం. నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు" అని ఆయన హెచ్చరించారు.
"విద్య సేవ.. వ్యాపారం కాదు"
ఇద్దరు కాలేజీ పెద్దలు పైరవీకి వచ్చారని, కానీ ప్రభుత్వం ఇలాంటి ఒత్తిళ్లకు లోనుకాబోదని సీఎం స్పష్టం చేశారు. "విద్య సేవ.. వ్యాపారం కాదు. విద్యార్థులను వెనక్కి తిప్పడం ఎట్లనో నాకు తెలుసు. ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి ఇప్పటివరకు ఆ పని చేయలేదు. కానీ అవసరమైతే చూడాలి" అని రేవంత్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
"మీ రాజకీయాలు నాకు తెలుసు.. డొనేషన్లు చూస్తా!"
ప్రైవేట్ కాలేజీల రాజకీయ అనుబంధాలపై కూడా రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. "మీరు ఏ రాజకీయ పార్టీతో అంటకాగుతున్నారో నాకు తెలియదా? మాట్లాడుతున్న ముగ్గురి సంగతి కూడా నాకు తెలుసు" అని అన్నారు. "వచ్చే ఏడాది నుండి ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో చూద్దాం" అని హెచ్చరించారు. విద్యార్ధులపై బరువుగా మారే విధంగా డొనేషన్లు, ఫీజులు పెంచితే సహించేది లేదని తేల్చిచెప్పారు.
అధికారులపై ఒత్తిడి.. అరోరా కాలేజీ ప్రస్తావన
కాలేజ్ యాజమాన్యాలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నాయంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. "అధికారులను తిడతారట..! ఎట్లా తిడతారు?" అని మండిపడ్డారు. ఈ సందర్భంగా అరోరా కాలేజీ రమేష్‌ను ఉద్దేశిస్తూ.. "మహబూబ్ నగర్‌లో క్యాంప్ ఉంటది.. హైదరాబాద్‌లో అనుమతి ఇవ్వాలి అంట" అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టొద్దని యాజమాన్యాలకు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఫీజుల పేరుతో అడ్డగోలుగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. ప్రభుత్వ హెచ్చరికలతో ఈ సమ్మె వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

