కుప్పం ప్రాంతం రూపురేఖలు మారనున్నాయి. ఈ ప్రాంతాన్ని పరిశ్రమల హబ్‌గా మార్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక అడుగు వేశారు. ఏకంగా ఏడు పరిశ్రమలకు వర్చువల్‌గా ఏకకాలంలో శంకుస్థాపన చేసి, కుప్పం అభివృద్ధి ప్రస్థానాన్ని వేగవంతం చేశారు.
రూ. 2,203 కోట్ల పెట్టుబడులు.. 7 పరిశ్రమలు!
హిందాల్కో, శ్రీజా డైరీ, ఏస్ ఇంటర్నేషనల్, SVF సోయా, మదర్ డైరీ, E-Royce EV, ALEAP మహిళా పార్కులు.. ఈ ఏడు సంస్థల ద్వారా కుప్పంలోకి మొత్తం రూ. 2,203 కోట్ల భారీ పెట్టుబడులు రానున్నాయి.
ఈ పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం 241 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ శంకుస్థాపనతో కుప్పం ప్రాంతం పారిశ్రామిక పటంలో కీలక స్థానానికి చేరనుంది.
ప్రజలతో ముఖాముఖి.. రైతుల హర్షం
శంకుస్థాపన అనంతరం సీఎం చంద్రబాబు కుప్పం స్థానిక రైతులు, పాడి రైతులు, మహిళలు, యువతతో ముఖాముఖి నిర్వహించారు. అభివృద్ధి పట్ల ప్రజలు వ్యక్తం చేసిన ఆనందం, కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
హంద్రీ-నీవా కాల్వ ద్వారా నీటిసౌకర్యం అందడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, పాలు కొనుగోలు చేసే సంస్థలు రావడంతో, ఇకపై తమ పంటలు, పాల ఉత్పత్తులను ఇక్కడి పరిశ్రమలకే నేరుగా విక్రయించవచ్చని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
"వలసలకు చెక్.. ఇక్కడే ఉపాధి"
"తల్లికి వందనం" పథకం ద్వారా లబ్ధిపొందుతున్నామని మహిళలు తెలిపారు. "గతంలో ఉపాధి కోసం బెంగళూరుకు వలస వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఈ పరిశ్రమల రాకతో కుప్పంలోనే ఉపాధి దొరకనుండటం ఆనందంగా ఉంది" అని స్థానిక యువత పేర్కొంది.
ఇంత పెద్ద సంఖ్యలో పరిశ్రమలు తమ ప్రాంతానికి వస్తాయని కలలో కూడా అనుకోలేదని మహిళా పాడి రైతులు హర్షం వ్యక్తం చేశారు. వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించినందుకు వారు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
కుప్పాన్ని పరిశ్రమల కేంద్రంగా రూపుదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ తాజా పెట్టుబడులతో ప్రతి ఇంటికీ ఉపాధిని చేరవేసే దిశగా బలమైన పునాది పడిందని అధికారులు, స్థానిక ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

