Medaram Jatara Aftermath: జాతర ముగిసింది.. నరకం మిగిలింది! 3 వేల టన్నుల చెత్త, కార్మికుల కన్నీళ్లు
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర 'మేడారం' వైభవంగా ముగిసింది. కోట్లాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. కానీ, భక్తులు వెళ్తూ వెళ్తూ మిగిల్చిన చేదు నిజం ఇప్పుడు మేడారం అడవుల్లో కనబడుతోంది. ఎటు చూసినా టన్నుల కొద్దీ చెత్త, భరించలేని దుర్గంధం. దేవుడిని కొలిచే మనం.. ప్రకృతిని మాత్రం ఎందుకు కలుషితం చేస్తున్నాం? జాతర తర్వాత అక్కడ పారిశుద్ధ్య కార్మికులు పడుతున్న నరకం అంతా ఇంతా కాదు. అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది?
3 వేల టన్నుల చెత్త.. 6 వేల మంది సైన్యం
జాతర ముగిసిన తర్వాత మేడారం, కన్నెపల్లి, నార్లాపూర్, కొంగల గట్టు ప్రాంతాలు చెత్తతో నిండిపోయాయి. అధికారుల అంచనా ప్రకారం దాదాపు 3,000 టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి. వీటిని తొలగించడానికి ప్రభుత్వం సుమారు 6,000 మంది పారిశుద్ధ్య కార్మికులను రంగంలోకి దించింది. యుద్ధప్రాతిపదికన క్లీనింగ్ జరుగుతున్నా.. పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది.
"వాంతులు వస్తున్నాయి.. ఇంత గలీజు పనా?"
ఈ పనుల్లో నిమగ్నమైన కార్మికుల ఆవేదన గుండెలు పిండేస్తోంది. "మమ్మల్ని రోడ్లు ఊడ్చాలి, ప్లాస్టిక్ ఏరుకోవాలి అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ సీన్ వేరే ఉంది. జంతువుల తలకాయలు, కుళ్లిపోయిన తోళ్లు, కోళ్ల వ్యర్థాలు గుట్టలుగా పడి ఉన్నాయి. వాటిని చేతులతో ఎత్తుతుంటే వాంతులు వస్తున్నాయి. అమ్మవార్ల దయతోనే ఈ పని చేస్తున్నాం తప్ప.. మా జీవితంలో ఇంత గలీజు పని ఎప్పుడూ చేయలేదు" అని కార్మికులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
ప్లాస్టిక్, గాజు పెంకుల ముప్పు
మొత్తం చెత్తలో 48 శాతం ప్లాస్టిక్, గాజు సీసాలే ఉన్నాయి. దాదాపు 100 టన్నుల ఖాళీ బాటిళ్లు పగిలిపోయి ప్రమాదకరంగా మారాయి. ఇవి కార్మికులకు గాయాలు చేస్తున్నాయి. మిగిలిన 52 శాతం బియ్యం, బెల్లం వంటివి భూమిలో కలిసిపోయేవే అయినా.. వాటితో పాటే మాంసం వ్యర్థాలు కలవడమే అసలు సమస్య. పారిశుద్ధ్య సిబ్బందికి సరైన రక్షణ పరికరాలు లేకపోవడం, వారిని తప్పుదారి పట్టించి ఇలాంటి పనులు చేయించడం విమర్శలకు తావిస్తోంది.
భక్తి ఉంటే సరిపోదు.. బాధ్యత కూడా ఉండాలి!
వన దేవతలను కొలిచే మనం.. ఆ వనాన్ని కాపాడుకోవాలనే స్పృహను మర్చిపోతున్నాం. మనం చేసే తప్పుకు.. అమాయక పారిశుద్ధ్య కార్మికులు బలవుతున్నారు. వచ్చే జాతర నాటికైనా భక్తుల్లో, అధికారుల్లో మార్పు రావాలి.

