పాకిస్తాన్ రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఈ సంచలన ఆరోపణలపై భారత్ కూడా స్పందించింది. పాకిస్తాన్‌కు ఇలాంటి చరిత్ర కొత్తేమీ కాదని ఎద్దేవా చేసింది.
పాక్‌కు ఆ చరిత్ర ఉంది: భారత్
ట్రంప్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ స్పందించారు. "పాకిస్తాన్ చరిత్రలో చట్టవ్యతిరేక, రహస్య అణు కార్యకలాపాలు కొత్తవి కావు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్ దశాబ్దాలుగా అక్రమ రవాణా, ఏక్యూ ఖాన్ నెట్‌వర్క్ ద్వారా అణు విస్తరణ చర్యలకు పాల్పడుతూనే ఉందని ఆరోపించారు. ఈ విషయాలను భారత్ ఎప్పటికప్పుడు అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్తోందని తెలిపారు.
ట్రంప్ సంచలన ఆరోపణలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కేవలం పాకిస్తాన్‌నే కాదు.. రష్యా, చైనా, ఉత్తర కొరియాలు కూడా రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది.
భూకంపాల వల్లే అనుమానాలు?
ఈ ఏడాది ఏప్రిల్ 30 నుంచి మే 12 మధ్య, ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో 4.0 నుంచి 4.7 తీవ్రత గల భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపాల నేపథ్యంలోనే, పాకిస్తాన్ రహస్యంగా అణు పరీక్షలు నిర్వహించి ఉండవచ్చన్న అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి.
1998 తర్వాత అధికారికంగా లేవు
పాకిస్తాన్ చివరిసారిగా 1998లో చాగై-I, చాగై-II అణు పరీక్షలను అధికారికంగా నిర్వహించింది. భారతదేశం అదే సంవత్సరం రాజస్థాన్‌లోని పోఖ్రన్‌లో జరిపిన అణు పరీక్షలకు ప్రతిస్పందనగా ఇస్లామాబాద్ ఈ పరీక్షలు చేపట్టింది. అప్పటి నుంచి ఆ దేశం అధికారికంగా ఎలాంటి అణు పరీక్షలు జరిపినట్లు రికార్డుల్లో లేదు.
అధికారికంగా రికార్డులు లేకపోయినా, ట్రంప్ తాజా వ్యాఖ్యలతో పాకిస్తాన్ అణు కార్యకలాపాలపై మరోసారి అంతర్జాతీయంగా అనుమానాలు బలపడ్డాయి. భారత్ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పడం గమనార్హం.
