టీడీపీలో సీన్ మారిపోయిందా? చంద్రబాబు మద్దతుతో ఆ యువనేతకు "ఫుల్ పవర్స్" వచ్చినట్లేనని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌కు పార్టీపై దాదాపు ఫుల్ పవర్స్ ఇచ్చారా? నాయకులు, కార్యకర్తలపై లోకేష్ నియంత్రణ ఇకపై స్పష్టంగా కనిపిస్తోందా? అంటే.. నాయకుల అంతర్గత సమావేశాల్లో ఔనన్న సమాధానమే వినిపిస్తోంది.
ఆ ఒక్క సంఘటనతో మారిన సీన్!
ఇప్పటి వరకు చంద్రబాబు అంటే భయం, భక్తి ఉన్న నాయకులు.. ఇప్పుడు ఆయనతో పాటు నారా లోకేష్ విషయంలోనూ ఈ రెండూ ప్రదర్శిస్తున్నారు. దీనికి కీలక కారణం.. గత వారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సంఘటనలేనని అంటున్నారు.
"గీత దాటితే.. బయటకు వెళ్లొచ్చు!"
దారి తప్పుతున్న నాయకులను, ముఖ్యంగా ప్రజలకు చేరువ కాని వారిని ఉద్దేశించి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. పార్టీ గీత దాటి వ్యాఖ్యలు చేసిన వారిని.. మీకు అంత నమ్మకం ఉంటే.. స్వతంత్రంగా పోటీ చేసి గెలవొచ్చు అని కుండ బద్దలు కొట్టారు. పార్టీలో ఉంటే.. సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని గట్టిగా సూచించారు. ఈ హెచ్చరికలు పార్టీలో బాగానే పనిచేశాయని అంటున్నారు.
నాయకుల్లో కొత్త చర్చ..
నిజానికి ఇప్పటి వరకు పార్టీ చంద్రబాబు సెంట్రిక్‌గానే నడిచింది. కొందరు మాత్రమే నారా లోకేష్ పరిధిలో ఉన్నారన్నది నాయకుల మాట. కానీ, తాజాగా గత వారం జరిగిన పరిణామాల నేపథ్యంలో, ఇకపై లోకేష్ కూడా పార్టీ కార్యక్రమాలు, నాయకుల వ్యవహార శైలిపై పూర్తి దృష్టి పెడుతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది.
లోకేష్ వ్యాఖ్యలకు చంద్రబాబు మద్దతు
అయితే, చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, ఎవరో ఒకరి అజమాయిషీ ఉండాల్సిన అవసరం ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే, రెండు రోజుల కిందట ఆయన వద్ద కొందరు నాయకులు లోకేష్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. లోకేష్ చేసిన హెచ్చరికలు అందరికీ వర్తిస్తాయి. పార్టీ సరిగా ఉండాలి. సిద్ధాంతాల ప్రాతిపదికన అందరూ పనిచేయాల్సిందే అని తేల్చి చెప్పడం ద్వారా.. లోకేష్‌కు పూర్తి మద్దతుగా నిలిచారు.
చంద్రబాబు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో, ఇకపై టీడీపీలో నారా లోకేష్‌కు దాదాపు ఫుల్ పవర్ ఇచ్చేసినట్టుగానే నాయకులు, కార్యకర్తలు భావిస్తుండటం గమనార్హం.

