తిరుమల లడ్డూ విషయంలో భక్తులు ఊహించని షాకింగ్ నిజం బయటపడింది! గత ఐదేళ్లలో స్వామివారికి నివేదించిన ప్రసాదంలో ఏకంగా 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితోనే తయారయ్యాయట.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విస్తుపోయే విషయాలను వెలుగులోకి తెచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో (2019-2024) తిరుమలలో లడ్డూ తయారీ ఏ స్థాయిలో దారి తప్పిందో గణాంకాలతో సహా బయటపెట్టింది. ఈ ఐదేళ్ల కాలంలో మొత్తం 48.76 కోట్ల లడ్డూలను టీటీడీ తయారు చేయగా, అందులో దాదాపు 40 శాతం లడ్డూలు స్వచ్ఛమైన నెయ్యితో కాకుండా.. పామాయిల్, పామ్‌కెర్నల్ ఆయిల్, ఇతర రసాయనాలతో కల్తీ చేసిన నెయ్యితోనే తయారయ్యాయని సిట్ నిర్ధారించింది. అంటే సుమారు 20.01 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితోనే భక్తులకు చేరాయి.
4 డెయిరీల నుంచి.. 68 లక్షల కిలోల కల్తీ!
ఆ సమయంలో టీటీడీ ధర్మకర్తల మండలి నెయ్యి సరఫరా కోసం నాలుగు ప్రైవేట్ డెయిరీలకు ఏకంగా రూ. 250 కోట్లు చెల్లించింది. మొత్తం 1.61 కోట్ల కిలోల నెయ్యిని కొనుగోలు చేయగా, అందులో 68 లక్షల కిలోలు నాణ్యత లేనిదని తేలింది.
ప్రధానంగా ఈ నాలుగు డెయిరీలే కల్తీకి కారణమని సిట్ గుర్తించింది:
భోలేబాబా డెయిరీ (ఉత్తరాఖండ్)
ఏఆర్ డెయిరీ (తమిళనాడు)
వైష్ణవి డెయిరీ (తిరుపతి)
మాల్‌గంగ డెయిరీ (ఉత్తరప్రదేశ్)
ఇది ముమ్మాటికీ భక్తులకు ద్రోహమే: టీటీడీ ఛైర్మన్
రోజుకు 3.5 లక్షల లడ్డూలకు 13 వేల కిలోల నెయ్యి అవసరం కాగా, అందులో సగభాగం కల్తీదేనని తేలడంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "తిరుమల క్షేత్రాన్ని గత పాలకులు ధనార్జన కేంద్రంగా మార్చుకున్నారు. అధికారులతో కుమ్మక్కై కల్తీ లడ్డూలను అందించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు" అని ఆయన మండిపడ్డారు. సిట్ విచారణలో ఈ పాపం రుజువైందని, త్వరలోనే మరిన్ని అక్రమాలను సాక్ష్యాలతో సహా బయటపెడతామని ఆయన స్పష్టం చేశారు.

