తిరుపతి జిల్లా గాజుల మండ్యం పీఎస్ పరిధిలో దారుణ హత్య కలకలం రేపింది. రేణిగుంట-తిరుపతి రోడ్డులోని లక్ష్మీపురం కాలనీలో, 15 ఏళ్ల క్రితం నిర్మాణం నిలిచిపోయిన ఓ అపార్ట్‌మెంట్‌లో గుర్తు తెలియని యువకుడి శవం లభించింది. రెండు రోజులుగా వస్తున్న భరించలేని దుర్వాసనతో స్థానికులు గాలించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
సంపులో శవం.. చేతులు, కాళ్లు కట్టేసి!
పాడుబడిన అపార్ట్‌మెంట్ నుంచే దుర్గంధం రావడంతో స్థానికులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఎప్పుడూ తెరిచి ఉండే సంపునకు బండరాయితో మూత వేసి ఉండటం చూసి, అనుమానంతో దాన్ని తెరిచి చూశారు. లోపల డెడ్ బాడీ కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గుర్తుతెలియని స్థితిలో ఉన్న శవాన్ని బయటకు తీశారు. మృతుడి రెండు కాళ్లు, చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి, రెండు పాలిథిన్ కవర్లలో చుట్టి పడేసినట్లు గుర్తించారు.
వేలిముద్రలతో వీడిన మిస్టరీ.. పాత నేరస్తుడు
మృతదేహం వద్ద పోలీసులకు టాబ్లెట్స్, ఇన్ హేలర్, గుట్కా ప్యాకెట్లు లభించాయి. నీటిలో ఉండటంతో చర్మం ఊడి వస్తున్నా, క్లూస్ టీమ్ ఎంతో శ్రమించి వేలిముద్రలు సేకరించింది.
ఈ వేలిముద్రలను క్రైమ్ రికార్డులతో పోల్చగా, మృతుడు రేణిగుంట టీబీఐడీ కాలనీకి చెందిన మనోజ్ కుమార్‌గా గుర్తించారు. మనోజ్‌పై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కరెంట్ మోటర్లు, స్టార్టర్ల దొంగతనం కేసులు ఉన్నట్లు తేలింది.
పోలీసు ఇన్ఫార్మర్ అనే అనుమానంతోనే హత్య?
దర్యాప్తులో పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. మనోజ్ (వృత్తిరీత్యా పెయింటర్) మరో నలుగురు స్నేహితులతో కలిసి రాత్రిపూట దొంగతనాలు చేసేవాడు. జైలుకు వెళ్లి వచ్చాక, పాత నేరస్తుడన్న కారణంతో పోలీసులు తరచూ మనోజ్‌ను విచారించేవారు. ఈ క్రమంలో అతను ఇచ్చిన సమాచారంతో పోలీసులు కొన్ని కేసులు ఛేదించారు.
తమను పోలీసులకు పట్టిస్తుంది మనోజ్ ఏనన్న అనుమానం స్నేహితుల్లో పెరిగింది. దీనికి తోడు, వారి మధ్య ఆర్థిక లావాదేవీల గొడవలు కూడా ఉన్నాయి. దీంతో మనోజ్‌ను టార్గెట్ చేసి, పక్కా ప్లాన్‌తో హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
"డబ్బులిస్తాం రా".. పిలిచి చంపేశారు!
హత్యకు ముందు నిందితులు పది రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. గత ఆదివారం, "నీకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తాం" అని స్నేహితులు మనోజ్‌కు ఫోన్ చేశారు. రేణిగుంటలోని నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించి, అక్కడ అతన్ని హతమార్చి, గాజుల మండ్యంలోని ఈ సంపులో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
24 గంటల్లో కేసు ఛేదన
నిన్న ఉదయం శవం బయటపడగా, 24 గంటల్లోనే పోలీసులు మృతుడి ఆచూకీ, నిందితుల వివరాలు కనిపెట్టడం విశేషం. ఈ హత్యలో మొత్తం ముగ్గురు నిందితులు ఉన్నట్లు భావిస్తున్న పోలీసులు, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. మనోజ్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
