దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారిన పరిస్థితుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్కూళ్లకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
సోమవారం ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. రాజధానిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో 5వ తరగతి వరకు ఫిజికల్ క్లాసులను రద్దు చేశారు.
5వ తరగతి వరకు 'ఆన్‌లైన్' చదువులే!
కాలుష్య తీవ్రత తగ్గే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
ఆన్‌లైన్ క్లాసులు: నర్సరీ నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు క్లాసులన్నీ పూర్తిగా ఆన్‌లైన్ మోడ్‌లోనే నిర్వహించాలి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పిల్లలు బడికి రావాల్సిన అవసరం లేదు.
హైబ్రిడ్ మోడ్: ఇక 9, 11 తరగతుల విద్యార్థులకు 'హైబ్రిడ్ మోడ్' (ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్) అందుబాటులో ఉంటుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమకు నచ్చిన విధానాన్ని ఎంచుకునే వెసులుబాటు కల్పించారు.
డేంజర్ బెల్స్.. AQI 500!
ఢిల్లీలో గాలి నాణ్యత (AQI) అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. డిసెంబర్ 13న కాలుష్యం 'సివియర్ ప్లస్' (Severe+) స్థాయిని దాటడంతో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) తక్షణమే GRAP Stage-IV నిబంధనలను అమలు చేసింది.
సోమవారం వజీర్‌పూర్‌లో AQI ఏకంగా 500కు చేరుకోగా, ఆనంద్ విహార్‌లో 493గా నమోదైంది.
కర్తవ్య పథ్, అక్షరధామ్, ఎయిమ్స్ వంటి ప్రాంతాలు దట్టమైన పొగమంచులో కూరుకుపోయాయి.
ఆంక్షలు ఇవే: GRAP-IV కింద భవన నిర్మాణ పనులు, కూల్చివేతలను నిలిపివేశారు. అత్యవసరమైతే తప్ప డీజిల్ ట్రక్కులను ఢిల్లీలోకి అనుమతించడం లేదు. పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు బయట తిరగవద్దని అధికారులు హెచ్చరించారు.

