ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. కొండెక్కిన ధరలు చూసి బెంబేలెత్తిపోతున్న సామాన్యులకు శుక్రవారం (జనవరి 30, 2026) కాస్త ఉపశమనం లభించింది. అంతర్జాతీయ పరిణామాలతో రాకెట్ వేగంతో వెళ్తున్న రేట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఏకంగా తులం బంగారంపై రూ.5,000, కిలో వెండిపై రూ.30,000 తగ్గడం అంటే చిన్న విషయం కాదు. అసలు ఈ సడన్ పతనానికి కారణం ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ లో రేట్లు ఎలా ఉన్నాయి? కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమా?
హైదరాబాద్‌లో భారీగా తగ్గిన ధరలు
గత కొన్ని రోజులుగా హైబీపీ తెప్పిస్తున్న పసిడి ధరలు ఈరోజు శాంతించాయి. హైదరాబాద్ విపణిలో గురువారం రాత్రి రూ.1,79,700 పలికిన 10 గ్రాముల (24 క్యారెట్లు) బంగారం ధర.. శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయానికి రూ.1,74,700కు దిగివచ్చింది. అంటే ఒక్క పూటలో దాదాపు రూ.5,000 ఆదా అయినట్లే.
ఇక వెండి విషయం చెప్పక్కర్లేదు. మొన్నటిదాకా రూ.4 లక్షల మార్కును తాకుతుందనుకున్న వెండి (రూ.3,99,600).. ఒక్కసారిగా రూ.3,70,000కు పడిపోయింది. కిలో వెండిపై ఏకంగా రూ.30,000 తగ్గడం సామాన్యులకు పెద్ద రిలీఫ్.
లాభాల స్వీకరణ.. డాలర్ దెబ్బ!
ధరలు ఎందుకు తగ్గాయి అనేదానికి నిపుణులు రెండు ప్రధాన కారణాలు చెబుతున్నారు.
ప్రాఫిట్ బుకింగ్: బంగారం, వెండి ధరలు గరిష్ఠ స్థాయికి చేరడంతో.. మదుపర్లు (Investors) తమ వద్ద ఉన్న నిల్వలను అమ్మి లాభాలు తీసుకుంటున్నారు (Profit Booking). దీంతో మార్కెట్ లో అమ్మకాల ఒత్తిడి పెరిగి ధరలు తగ్గాయి.
డాలర్ రివరీ: అమెరికా డాలర్ విలువ మళ్ళీ పుంజుకుంటుండటం కూడా బులియన్ మార్కెట్ పై ప్రభావం చూపింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు బంగారం 5,189 డాలర్లు, వెండి 110 డాలర్లుగా ట్రేడ్ అవుతున్నాయి.
ఫ్యూచర్ మార్కెట్ లోనూ పతనం
ఎంసీఎక్స్ (MCX) లో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఒక దశలో రూ.4.20 లక్షల రికార్డు స్థాయిని తాకిన వెండి ఫ్యూచర్స్ ధర.. శుక్రవారం ఏకంగా రూ.12,169 తగ్గి రూ.3,87,724కు చేరింది. బంగారం ఫ్యూచర్స్ కూడా రూ.2,162 తగ్గి రూ.1,67,241 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రపంచ స్వర్ణమండలి (WGC) నివేదిక ప్రకారం.. విపరీతమైన ధరల వల్ల భారత్ లో బంగారం డిమాండ్ తగ్గుతోంది. ఈ ఏడాది కూడా దిగుమతులు తగ్గే అవకాశం ఉందని అంచనా.
కొనాలా? ఆగాలా?
ధరలు తగ్గాయి కదా అని మరీ అలసత్వం వద్దు. అంతర్జాతీయ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్నవారు ఈ తగ్గుదలను వినియోగించుకోవడం ఉత్తమం. రూ.5 వేలు తగ్గడం అంటే చిన్న విషయం కాదు మరి!

