టెక్ ప్రపంచంలో ఒక భూకంపం వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) షేర్లు పేకమేడలా కుప్పకూలాయి. కేవలం కొన్ని గంటల్లోనే ఇన్వెస్టర్ల సంపద అక్షరాలా రూ.36 లక్షల కోట్లు (400 బిలియన్ డాలర్లు) గాలిలో కలిసిపోయింది. ఇది ఏదో చిన్న కంపెనీకి జరిగిన నష్టం కాదు.. ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్ దిగ్గజానికి తగిలిన దెబ్బ. అసలు మైక్రోసాఫ్ట్ ఎందుకు ఇంతలా పతనమైంది? అందరూ భవిష్యత్తు అని నమ్ముతున్న 'కృత్రిమ మేధ' (AI)నే ఇప్పుడు ఈ సంస్థ కొంపముంచుతోందా?
12 శాతం పతనం.. చరిత్రలో రెండోసారి!
మైక్రోసాఫ్ట్ షేరు విలువ ఒక్కసారిగా 12 శాతం కుంగిపోయింది. 1986లో ఐపీఓకు వచ్చిన తర్వాత, మళ్ళీ 2020 మార్చి తర్వాత మైక్రోసాఫ్ట్ ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఒక్క రోజులో ఇంత భారీ మొత్తం ఆవిరైపోవడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో డీప్‌సీక్ ఏఐ దెబ్బకు ఎన్విడియా (Nvidia) 593 బిలియన్ డాలర్లు కోల్పోగా, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆ జాబితాలో చేరింది.
డబ్బులు నీళ్లలా ఖర్చు.. లాభాలెక్కడ?
ఇన్వెస్టర్ల ఆగ్రహానికి ప్రధాన కారణం ఏఐ (Artificial Intelligence). మైక్రోసాఫ్ట్ తన క్లౌడ్, ఏఐ విభాగాలపై పెట్టుబడులను ఏకంగా 66 శాతం పెంచేసింది. కొత్త టెక్నాలజీ కోసం నీళ్లలా డబ్బు ఖర్చు చేస్తోంది. కానీ ఆ ఖర్చుకు తగ్గ ప్రతిఫలం రావడం లేదు. మైక్రోసాఫ్ట్ ప్రధాన ఆదాయ వనరు అయిన క్లౌడ్ ప్లాట్‌ఫామ్ 'అజ్యూర్' (Azure) వృద్ధి గతంతో పోలిస్తే మందగించింది. "ఖర్చు మాత్రం భారీగా ఉంది.. మరి లాభాలు ఎక్కడ?" అని వాటాదారులు నిలదీస్తున్న పరిస్థితి ఇది.
ఓపెన్ ఏఐ షాక్.. అప్పుల బాటలో దిగ్గజాలు!
ఇది కేవలం మైక్రోసాఫ్ట్ సమస్య మాత్రమే కాదు. గూగుల్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు కూడా డేటా సెంటర్ల కోసం వేల కోట్లు కుమ్మరిస్తున్నాయి. గూగుల్ తప్ప మిగతావన్నీ అప్పులు చేసి మరీ ఏఐపై పందెం కాస్తున్నాయి. కానీ, చాట్‌జీపీటీ మాతృసంస్థ 'ఓపెన్ ఏఐ' (OpenAI) చెప్పిన మాటలు ఇన్వెస్టర్ల గుండెల్లో రాయి పడేలా చేశాయి. తమకు 2030 వరకు లాభాలు రావని, ఇంకా 1.4 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడి కావాలని ఓపెన్ ఏఐ తేల్చి చెప్పింది. ఈ నిరవధిక నిరీక్షణే ఇప్పుడు మార్కెట్ వర్గాలను భయపెడుతోంది.

