బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్న మెగాస్టార్ సినిమాకు ఊహించని షాక్ తగిలింది. చిరంజీవి హీరోగా వచ్చిన తాజా చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu) వెండితెరపై సంచలనం సృష్టిస్తుంటే, కోర్టులో మాత్రం చుక్కెదురైంది. సినిమా విడుదలైన మొదటి వారం రోజుల్లో వసూలు చేసిన అదనపు మొత్తంపై ఇప్పుడు న్యాయ పోరాటం మొదలైంది. ఏకంగా 45 కోట్ల రూపాయలను రికవరీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపుతోంది. అసలు ఎందుకు ఈ వివాదం? హైకోర్టు తీసుకున్న సీరియస్ డెసిషన్ ఏంటి?
టికెట్ రేట్ల పెంపు వివాదం
సినిమా విడుదలైన తొలి రోజుల్లో (జనవరి 11 నుంచి 18 వరకు) టికెట్ రేట్లు పెంచడం సర్వసాధారణం. కానీ ఈ సినిమా విషయంలో అది వివాదానికి దారి తీసింది.
సింగిల్ స్క్రీన్లలో రూ. 50 అదనంగా.
మల్టీప్లెక్స్‌లలో రూ. 100 అదనంగా. ఈ పెంపు నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ డాక్టర్ పాదూరి శ్రీనివాస రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
రూ. 45 కోట్ల రికవరీ?
పిటిషనర్ వాదన ప్రకారం, ఈ వారం రోజుల్లో పెంచిన రేట్ల ద్వారా వచ్చిన అదనపు ఆదాయం సుమారు రూ. 42 కోట్ల నుంచి రూ. 45 కోట్ల వరకు ఉంటుంది. ఈ మొత్తం సొమ్ము అక్రమంగా వసూలు చేసిందేనని, కాబట్టి దీన్ని వెంటనే రికవరీ చేసి ప్రభుత్వ సంచిత నిధికి (Government Consolidated Fund) లేదా లీగల్ సర్వీసెస్ అథారిటీకి జమ చేయాలని కోర్టును కోరారు.
హైకోర్టు సీరియస్
ఈ వ్యవహారాన్ని తెలంగాణ హైకోర్టు సీరియస్ గా పరిగణించింది. సదరు తేదీల్లో అమ్మిన టికెట్ల లెక్కలు, వసూలైన మొత్తం వివరాలను సమర్పించాలని జీఎస్టీ (GST) అధికారులను ఆదేశించింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.
మిగతా సినిమాలకూ ఎఫెక్ట్
కేవలం చిరంజీవి సినిమా మాత్రమే కాదు, ఇటీవల విడుదలైన 'పుష్ప-2', 'గేమ్ ఛేంజర్', 'అఖండ-2', 'రాజా సాబ్' వంటి భారీ చిత్రాల టికెట్ రేట్ల పెంపు వ్యవహారం కూడా కోర్టు పరిధిలో ఉంది. వీటన్నింటినీ కలిపి తదుపరి విచారణలో తేల్చనున్నారు.

