270 మిలియన్ల మంది ఫాలోవర్లు.. ఒక్కసారిగా 'బ్లాంక్' అయిన స్క్రీన్. కింగ్ కోహ్లీ (Virat Kohli) ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు ఏమైంది? శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో జరిగిన ఈ హైడ్రామా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విరాట్ అభిమానులను వణికించింది. ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే కోహ్లీ ఖాతా కనిపించకుండా పోవడంతో నెటిజన్లు గందరగోళానికి గురయ్యారు. అసలు ఖాతా డీయాక్టివేట్ అయ్యిందా? లేక టెక్నికల్ గ్లిచ్చా? అనుష్క శర్మ ట్విట్టర్ ఎందుకు హోరెత్తింది? ఈ మిస్టరీ వెనుక అసలు కథేంటో చూద్దాం.
స్తంభించిన ఖాతా.. 'ప్రొఫైల్ నాట్ అవెయిలబుల్'
సాధారణంగా విరాట్ కోహ్లీ ఇన్‌స్టా వాల్ ఎప్పుడూ క్రికెట్ అప్‌డేట్స్, బ్రాండ్ ప్రమోషన్లతో కళకళలాడుతూ ఉంటుంది. అతడు ఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లో లక్షల లైకులు వస్తాయి. అలాంటిది శుక్రవారం ఉదయం ఫ్యాన్స్ ఓపెన్ చేసి చూస్తే.. ‘ప్రొఫైల్ ఈజ్‌నాట్ అవెయిలబుల్’ (Profile is not available) అనే మెసేజ్ దర్శనమిచ్చింది. పాత పోస్టులేమీ కనిపించలేదు. దీంతో తమ ఫేవరెట్ స్టార్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా లేక డిలీట్ చేశారా అని ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.
అన్నదమ్ముల ఖాతాలు అవుట్.. అనుష్కకు ప్రశ్నల వర్షం
ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే.. అదే సమయంలో విరాట్ సోదరుడు వికాస్ కోహ్లీ (Vikas Kohli) ఇన్‌స్టా ఖాతా కూడా మాయమైంది. ఇద్దరి ఖాతాలు ఒకేసారి స్తంభించిపోవడంతో ఇది ఏదైనా సైబర్ దాడి ఏమోనని ఫ్యాన్స్ కంగారుపడ్డారు. ఏం జరుగుతుందో తెలియక చాలామంది నేరుగా కోహ్లీ సతీమణి అనుష్క శర్మ 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాకు వెళ్లి "విరాట్ ఎక్కడ? ఇన్‌స్టా ఏమైంది?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కొందరైతే ఈ ఘటనను ప్రస్తుతం వైరల్ అవుతున్న ‘మిస్సింగ్ పెంగ్విన్’ ట్రెండ్ తో పోల్చుతూ మీమ్స్ కూడా వేశారు.
మళ్లీ వచ్చాడు.. కానీ రీజన్ ఏంటి?
అదృష్టవశాత్తు, ఈ టెన్షన్ ఎంతో సేపు లేదు. కాసేపటికే విరాట్ కోహ్లీ ఇన్‌స్టా అకౌంట్ తిరిగి యాక్టివేట్ అయ్యింది. పోస్టులన్నీ యధావిధిగా కనిపించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇలా ఎందుకు జరిగింది? మెటా (Meta) సర్వర్ల సమస్యా లేక మరేదైనా కారణమా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అటు కోహ్లీ టీమ్ గానీ, ఇటు ఇన్‌స్టాగ్రామ్ గానీ దీనిపై అధికారికంగా స్పందించలేదు.
కింగ్ క్రేజ్ అంటే అట్లుంటది!
కొన్ని నిమిషాలు ప్రొఫైల్ కనిపించకపోతేనే వరల్డ్ వైడ్ ట్రెండింగ్ అయ్యింది. సోషల్ మీడియాలో కోహ్లీ పవర్ ఏంటో ఈ చిన్న సంఘటన మరోసారి రుజువు చేసింది.

