విధి ఎంత విచిత్రమైనదో చూడండి. ఒకరికి ట్రాఫిక్ జామ్ ప్రాణగండం నుంచి తప్పిస్తే.. మరొకరిని అదే ట్రాఫిక్ జామ్ మృత్యువు ఒడిలోకి నెట్టేసింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన పైలట్ కెప్టెన్ సుమిత్ కపూర్ (Captain Sumit Kapoor) కథ వింటే గుండె బరువెక్కుతుంది. అసలు ఆ రోజు కాక్ పిట్ లో ఉండాల్సింది సుమిత్ కాదు! వేరే పైలట్ వెళ్లాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో జరిగిన ఆ ఒక్క మార్పు.. సుమిత్ రాతను ఎలా మార్చేసింది? స్నేహితులు చెబుతున్న ఆ కన్నీటి గాథ ఏంటి?
ఆ ఫోన్ కాల్ రాకపోయి ఉంటే..
వాస్తవానికి ఆ రోజు అజిత్ పవార్ ప్రయాణించాల్సిన విమానాన్ని నడపడానికి షెడ్యూల్ ప్రకారం వేరే పైలట్ ఉన్నారు. కానీ ముంబయి ట్రాఫిక్ ఆయన్ను అడ్డుకుంది. సమయానికి ఎయిర్ పోర్ట్ కు చేరుకోలేకపోవడంతో, సంస్థ ప్రత్యామ్నాయం కోసం చూసింది. సరిగ్గా టేకాఫ్ కు కొన్ని గంటల ముందు సుమిత్ కు అర్జెంట్ కాల్ వచ్చింది. "వెంటనే రావాలి, వీవీఐపీ ఫ్లైట్" అనడంతో, కాదనలేక సుమిత్ విధులకు హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు ముంబయి నుంచి టేకాఫ్ తీసుకున్నాడు.. కానీ గంటలోపే విగతజీవిగా మారాడు. ఆ ట్రాఫిక్ జామ్ లేకపోయినా, ఆ ఫోన్ కాల్ రాకపోయినా సుమిత్ ఈరోజు బతికే ఉండేవాడేమో!
అనుభవమా? తప్పిదమా?
సుమిత్ స్నేహితులు ఈ వార్త విని షాక్ లో ఉన్నారు. ఆయన కొద్ది రోజుల క్రితమే హాంకాంగ్ నుంచి వచ్చారు. విమానం నడపడంలో సుమిత్ కు అపార అనుభవం ఉందని, అలాంటి వ్యక్తి చిన్న పొరపాట్లు చేస్తాడంటే నమ్మలేకపోతున్నామని వారు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు 'పైలట్ తప్పిదం' (Pilot Error) వైపు వేలెత్తి చూపిస్తుంటే.. సుమిత్ సన్నిహితులు మాత్రం దానిని ఖండిస్తున్నారు. ఇందులో సాంకేతిక లోపం లేదా ఇతర కారణాలు ఉండి ఉంటాయని, సమగ్ర దర్యాప్తు జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.
మృత్యువు ట్రాఫిక్ రూపంలో వచ్చింది!
ఎవరి రాత ఎలా ఉందో చెప్పలేం. ఒకరిని కాపాడిన విధి, సుమిత్ ను మాత్రం కాక్ పిట్ వైపు నడిపించి కబళించింది.

.webp)