మహారాష్ట్ర రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలుగా చక్రం తిప్పిన 'చాణక్యుడు', పవార్ కుటుంబానికి పవర్ సెంటర్.. అజిత్ పవార్ (Ajit Pawar) ఇక లేరు. విమాన ప్రమాదం రూపంలో విధి చిన్నచూపు చూసింది. కానీ ఇక్కడ అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే.. ఏ బారామతి (Baramati) గడ్డ ఆయనకు రాజకీయ జన్మనిచ్చిందో, అదే గడ్డపై ఆయన చివరి అధ్యాయం ముగిసింది. 1991 నుంచి అజిత్ పవార్ అంటే బారామతి.. బారామతి అంటే అజిత్ పవార్. అంతలా పెనవేసుకుపోయిన ఈ బంధం ఇప్పుడు కన్నీటి సాగరమైంది. ఆయన్ను 'అజిత్ దాదా' అని పిలుచుకునే ఆ గొంతులు ఇప్పుడు మూగబోయాయి.
పవార్ కోటలో.. చెరిగిపోని ముద్ర
పవార్ కుటుంబానికి బారామతి అనేది కేవలం నియోజకవర్గం కాదు, ఒక సెంటిమెంట్. 1967 నుంచి శరద్ పవార్ కంచుకోటగా ఉన్న ఈ స్థానాన్ని, 1991 నుంచి అజిత్ పవార్ తన అడ్డాగా మార్చుకున్నారు. అహల్యానగర్ జిల్లాలో పుట్టినా, ఆయన కర్మభూమి మాత్రం బారామతినే. దాదాపు 30 ఏళ్లకు పైగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ.. పవార్ అనే పేరుకు పర్యాయపదంగా నిలిచారు. శరద్ పవార్ నీడ నుంచి బయటకు వచ్చి, తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు.
అందుకే ఆయన 'దాదా' అయ్యారు!
అజిత్ పవార్ బలం కేవలం రాజకీయాలు కాదు.. సహకార వ్యవస్థ. పాల సంఘాలు, చక్కెర ఫ్యాక్టరీలు, కో-ఆపరేటివ్ బ్యాంకులు.. ఇలా బారామతి ఆర్థిక వ్యవస్థను ఆయన శాసించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, అభివృద్ధిని పరుగులు పెట్టించారు. అందుకే ఎన్సీపీ (NCP) చీలినప్పుడు, సాక్షాత్తు శరద్ పవార్ ను కాదని, బారామతి ప్రజలు అజిత్ పవార్ వైపే నిలిచారు. "మేము దాదా మనుషులం" అని గర్వంగా చెప్పుకున్నారు. ఆ నమ్మకమే ఆయన్ను తిరుగులేని నాయకుడిగా నిలబెట్టింది.
అలకలు.. గెలుపులు.. చివరి మజిలీ
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గత లోక్‌సభ ఎన్నికల్లో తన భార్య సునేత్ర ఓడిపోవడంతో అజిత్ పవార్ మనస్తాపానికి గురయ్యారు. బారామతి ప్రజలపై అలిగి, ఇంకోసారి పోటీ చేయనని కూడా ప్రకటించారు. కానీ ప్రజల అభిమానం ఆయన్ను వదల్లేదు. మనసు మార్చుకుని 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మళ్ళీ విజయం సాధించారు. విధి ఆడిన వింత నాటకంలో.. రాజకీయంగా ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన అజిత్ పవార్, చివరకు అకాల మరణం చెందడం మహారాష్ట్ర ప్రజలను కలచివేస్తోంది.
శూన్యం.. పూడ్చలేనిది!
అజిత్ పవార్ మరణం ఎన్సీపీకి, మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు. బారామతి ప్రజలకు తమ కుటుంబ పెద్దను కోల్పోయినంత ఆవేదన. రాజకీయాల్లో ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.

