అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆరోగ్యంపై మళ్ళీ గుసగుసలు మొదలయ్యాయి. "నాకు మతిమరుపు లేదు.. 40 ఏళ్ల కిందట ఎలా ఉన్నానో ఇప్పుడూ అంతే ఫిట్ గా ఉన్నా" అని గంభీరంగా చెప్పుకొచ్చిన ట్రంప్.. సీన్ కట్ చేస్తే అదే ఇంటర్వ్యూలో ఒక పదం గుర్తురాక నానా తంటాలు పడ్డారు. అది కూడా ఏ పదం? 'అల్జీమర్స్' (Alzheimer's)! తన తండ్రికి ఉన్న వ్యాధి పేరు చెప్పడానికి ఆయన పడ్డ ఇబ్బంది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అసలేం జరిగింది? ఇది వయసు ప్రభావమా లేక సామాన్యమైన తడబాటేనా?
'ఏమంటారు దాన్ని?'.. ఇంటర్వ్యూలో ఇబ్బంది
న్యూయార్క్ మ్యాగజైన్ కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తనకు అల్జీమర్స్ ఉందన్న వార్తలను ట్రంప్ కొట్టిపారేశారు. కానీ తన తండ్రి ఫ్రెడ్ ట్రంప్ (Fred Trump) ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. "ఆయనకు గుండె దడ ఉండేది, పెద్దగా సమస్యలు లేవు కానీ.. ఒక వ్యాధి మాత్రం ఉండేది. ఏమంటారు దాన్ని?" అని తడబడ్డారు. నుదుటిపై వేలు పెట్టుకుని ఆలోచిస్తూ, పక్కనే ఉన్న ప్రెస్ సెక్రటరీ కారోలిన్ లీవిట్ వైపు చూశారు. ఆమె "అల్జీమర్స్" అని గుర్తుచేయగా.. "అవును, మతిమరుపు లాంటిది. సరే, నాకైతే అది లేదు" అని కవర్ చేసుకున్నారు.
వంశపారంపర్య భయం ఉందా?
వంశపారంపర్యంగా ఈ వ్యాధి వస్తుందేమోనన్న భయం ఉందా అని విలేకరి ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని ట్రంప్ తేల్చిచెప్పారు. వాస్తవానికి ట్రంప్ తండ్రి 1990లలో అల్జీమర్స్ బారిన పడి, 1999లో తన 93వ ఏట మరణించారు. గతంలో జో బైడెన్ (Joe Biden) విషయంలోనూ ఇలాంటి మతిమరుపు సంఘటనలే జరిగాయి. ఇప్పుడు 78 ఏళ్ల వయసులో ట్రంప్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. తాను కాగ్నిటివ్ పరీక్షల్లో (Cognitive Tests) అద్భుతమైన స్కోర్ సాధించానని ("ACED") ట్రంప్ తరచుగా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు.
మా బాస్ 'సూపర్ హ్యూమన్'
ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో వైట్ హౌస్ వర్గాలు నష్ట నివారణ చర్యలకు దిగాయి. వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చెంగ్.. ట్రంప్ ను "సూపర్ హ్యూమన్ ప్రెసిడెంట్" (Super Human President) గా అభివర్ణించారు. ఆయన శారీరకంగా, మానసికగా పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టం చేశారు. ప్రెస్ సెక్రటరీ లీవిట్ మాట్లాడుతూ.. "ఆయన రాత్రులు ఆలస్యంగా పనిచేస్తారు, మా స్టాఫ్ లోని యువకుల కంటే కూడా ఎక్కువ చురుగ్గా ఉంటారు" అని కితాబిచ్చారు.
మతిమరుపా? మాటల తడబాటా?
అగ్రరాజ్య అధినేత చిన్న పదం మర్చిపోయినా ప్రపంచానికి పెద్ద వార్తే. ట్రంప్ ఆరోగ్యంపై జరుగుతున్న ఈ చర్చ ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కొత్త అస్త్రం దొరికినట్లే.

