వాషింగ్టన్ సుంకాలతో ప్రపంచ వాణిజ్యం వణికిపోతుంటే, భారత్ మాత్రం సైలెంట్ గా ఒక భారీ వికెట్ పడగొట్టింది. యూరోపియన్ యూనియన్ (EU)తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదుర్చుకుని ఆర్థిక చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేపింది. ఇది కేవలం పెద్ద వ్యాపారుల కోసమే అని లైట్ తీసుకోకండి. ఈ ఒప్పందం విలువ అక్షరాలా రూ.64 లక్షల కోట్లు! దీనివల్ల మన వరంగల్ చేనేత కార్మికుడి నుంచి విశాఖ రొయ్యల రైతు వరకు అందరి జేబులు నిండబోతున్నాయి. అసలు ఈ డీల్ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు దక్కే వాటా ఎంత? సామాన్యుడికి కలిగే లాభమేంటి?
యూరప్ మార్కెట్ మన గుప్పిట్లో!
ఈ చారిత్రక ఒప్పందం ద్వారా దాదాపు 9,425 రకాల వస్తువులపై పన్నులు (Tariffs) మాయం కాబోతున్నాయి. మన దేశంలో తయారయ్యే వస్త్రాలు, తోలు వస్తువులు, నగలు, సుగంధ ద్రవ్యాల నుంచి హైటెక్ ఎలక్ట్రానిక్స్, మందుల వరకు అన్నీ ఇకపై యూరప్ మార్కెట్ లో రారాజుగా వెలుగొందనున్నాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (SMEs), రైతులు, వృత్తి నిపుణులకు యూరప్ రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఉత్తరప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు డజనుకు పైగా రాష్ట్రాలు లాభపడనున్నా.. మన తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఇది డబుల్ ధమాకా ఆఫర్.
తెలంగాణ: ఫార్మా కిక్.. టెక్స్‌టైల్ జోష్
హైదరాబాద్ - వరంగల్ కారిడార్ ఈ ఒప్పందంతో గోల్డెన్ జోన్ గా మారనుంది. వరంగల్ కేంద్రంగా ఉన్న వస్త్ర, దుస్తుల పరిశ్రమకు యూరప్ లో భారీ డిమాండ్ ఏర్పడనుంది. దీనివల్ల స్థానికంగా MSMEలు బలపడి, వేలాది కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఇక 'ఫార్మా హబ్'గా ఉన్న హైదరాబాద్ నుంచి మందులు, వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు జెట్ స్పీడ్ అందుకోనున్నాయి. ప్రపంచ సరఫరా గొలుసులో (Global Supply Chain) తెలంగాణ ముద్ర బలంగా పడనుంది.
ఆంధ్రప్రదేశ్: రొయ్యల రైతుకు పండగే
ఏపీలోని తీరప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఈ ఒప్పందం ఒక ఆక్సిజన్ లాంటిది. విశాఖపట్నం, కాకినాడ నుంచి ఎగుమతి అయ్యే రొయ్యలు, సముద్ర ఉత్పత్తులకు యూరప్ దేశాల్లో డిమాండ్ పెరిగి, రైతులకు మంచి రేటు దక్కనుంది. ఆక్వా ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజీ రంగాల్లో ఉపాధి అవకాశాలు వెల్లువలా రానున్నాయి. విశాఖ నుంచి ఫార్మా, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు కూడా పెరిగి రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరగనుంది.
ప్రపంచం సంక్షోభంలో ఉంటే.. భారత్ అవకాశాల్లో ఉంది!
వాషింగ్టన్ ఆంక్షల గోల ఎలా ఉన్నా, యూరప్ తో దోస్తీ మన తెలుగు రాష్ట్రాల పాలిట వరప్రదాయిని. ఇది కేవలం ఒప్పందం కాదు, ఉపాధి కల్పించే యంత్రం!

