సాధారణంగా ఎనిమిదేళ్ల వయసున్న పిల్లాడు ఏం చేస్తాడు? స్కూల్ హోంవర్క్ చేసుకుంటూనో, మొబైల్ లో వీడియో గేమ్స్ ఆడుకుంటూనో కాలక్షేపం చేస్తాడు. కానీ న్యూఢిల్లీలో జరిగిన 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026'లో స్టేజ్ ఎక్కిన 8 ఏళ్ల రణ్‌వీర్ సింగ్ సచ్‌దేవా (Ranveer Singh Sachdeva) మాత్రం టెక్ దిగ్గజాలకే క్లాస్ ఇచ్చాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ప్రాచీన భారతీయ తత్వశాస్త్రం మధ్య ఉన్న సంబంధాన్ని అనర్గళంగా వివరిస్తుంటే అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఇంత చిన్న వయసులో ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రోగ్రామర్‌గా రికార్డు సృష్టించిన ఈ కుర్రాడి గురించి సామాన్యులు, ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రులు ఎందుకు తెలుసుకోవాలి? రాబోయే ఏఐ యుగంలో మన పిల్లలు ఎలా అప్‌డేట్ అవ్వాలో ఈ 'బాల మేధావి' స్టోరీ ఒక కనువిప్పు.
ఆపిల్ సీఈఓనే పిలిచారు.. నాసా మెచ్చుకుంది!
2017లో జన్మించిన రణ్‌వీర్ సింగ్ సచ్‌దేవాకు పుట్టుకతోనే టాలెంట్ అబ్బింది. కేవలం మూడేళ్లకే వర్గాలను, ఘనాలను నోటితో సునాయాసంగా లెక్కించేవాడు.
ఐదేళ్ల వయసులో ఆపిల్ 'స్విఫ్ట్' (Swift) ప్రోగ్రామింగ్ నేర్చుకుని ఏకంగా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) దృష్టిని ఆకర్షించాడు. ఆయన స్వయంగా ఈ చిన్నారిని కాలిఫోర్నియాలోని ఆపిల్ హెడ్ క్వార్టర్స్‌కు ఆహ్వానించారంటే ఇతని నాలెడ్జ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఆరేళ్లకే టెడ్-ఎక్స్ స్పీకర్.. యూఎన్ సదస్సుకు అతిథి!
ఆరేళ్ల వయసులో ఏషియాలోనే అత్యంత పిన్న వయస్కుడైన టెడ్-ఎక్స్ (TEDx) వక్తగా రణ్‌వీర్ రికార్డు సృష్టించాడు. అంతేకాదు "ఆర్ యూ బార్న్ విత్ ఏఐ (Are You Born With AI?)" అనే పుస్తకాన్ని కూడా రాసి అమెజాన్ లో పబ్లిష్ చేశాడు.
2024లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సదస్సుకు హాజరైన అత్యంత చిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. నాలుగేళ్లకే ఈ బుడతడు రూపొందించిన మార్స్ మిషన్ ప్రాజెక్ట్ నాసా (NASA) వెబ్‌సైట్‌లోనే ప్రదర్శితమైంది.
హార్వర్డ్‌లో చదువు.. సొంతంగా ఏఐ చాట్‌బాట్!
ఆరేళ్లకే రణ్‌వీర్ రాసిన కేంబ్రిడ్జ్ అసెస్‌మెంట్స్ పరీక్షల ఫలితాలు చూస్తే ప్రొఫెసర్లే షాకయ్యారు. అవి ఏకంగా 14 ఏళ్ల విద్యార్థి నాలెడ్జ్ కు సమానంగా వచ్చాయి.
ప్రస్తుతం ఈ చిన్నారి ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో (Harvard University) 'మెషీన్ లెర్నింగ్' కోర్సు చేస్తున్నాడు. సొంతంగా ఒక ఏఐ చాట్‌బాట్‌ను కూడా రూపొందించాడు. గ్రామీణ ప్రాంతాల్లో ఏఐ అక్షరాస్యత తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పి అందరి మనసులు గెలుచుకున్నాడు.
పిల్లలకు గేమ్స్ కాదు.. టెక్నాలజీ సృష్టించడం నేర్పండి!
రణ్‌వీర్ సింగ్ సక్సెస్ చూసి మన పిల్లలు కూడా అలా మారిపోవాలని ప్రెజర్ పెట్టడం కరెక్ట్ కాదు. కానీ, ఈ రోజుల్లో పిల్లల చేతికి ఫోన్ ఇచ్చి యూట్యూబ్, గేమ్స్ కు బానిసలను చేసేకంటే.. కోడింగ్, ఏఐ బేసిక్స్ పట్ల ఆసక్తి పెంచడం చాలా అవసరం. ఏఐ (AI) అనేది భవిష్యత్తు కాదు, వర్తమానం. ఇప్పటి నుంచే టెక్ అక్షరాస్యత పెంచితేనే రేపటి పోటీ ప్రపంచంలో మన పిల్లలు నెగ్గుకురాగలరు.

