అర్ధరాత్రి ఆకలేస్తే ఫుడ్ తెచ్చే డెలివరీ బాయ్.. వానలో తడుస్తూ ఆఫీస్‌కు తీసుకెళ్లే బైక్ రైడర్.. వీళ్ళందరికీ జాబ్ గ్యారెంటీ ఏంటి? ప్రమాదం జరిగితే ఆదుకునేది ఎవరు? యాప్ బేస్డ్ కంపెనీలు కమీషన్లు లాక్కుంటున్నా, వీరికి ఎలాంటి సామాజిక భద్రత లేదు. కానీ, ఇప్పుడు ఆ కష్టాలకు చెక్ పడబోతోంది. సుమారు 4 లక్షల మంది గిగ్ వర్కర్ల (Gig Workers) జీవితాల్లో వెలుగులు నింపేలా రేవంత్ రెడ్డి సర్కార్ ఓ చరిత్రాత్మక చట్టాన్ని తీసుకురాబోతోంది. అసలు ఈ గిగ్ వర్కర్స్ బిల్లుతో వారికి ఒరిగేదేంటి? ప్రతి ఆర్డర్ పైనా ఫండ్ ఎలా కట్ అవుతుంది?
రాహుల్ గాంధీ హామీ.. ఇప్పుడు చట్టంగా!
అసెంబ్లీ ఎన్నికల ముందు గిగ్ వర్కర్లకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇచ్చిన హామీ ఇప్పుడు చట్టరూపం దాల్చుతోంది. ఈ నెలాఖరులో (ఫిబ్రవరి 2026) జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో 'తెలంగాణ ప్లాట్‌ఫాం ఆధారిత గిగ్‌వర్కర్ల బిల్లు'కు అసెంబ్లీలో ఆమోదముద్ర వేయనున్నారు.
ఇటీవల ఢిల్లీ పర్యటనలో రాహుల్ గాంధీ స్వయంగా సీఎం రేవంత్‌కు ఈ బిల్లుపై దిశానిర్దేశం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం వీలైనంత త్వరగా గిగ్ వర్కర్లకు అండగా నిలవాలని సూచించడంతో.. కార్మిక శాఖ దీనిపై కార్యాచరణ వేగవంతం చేసింది.
ప్రత్యేక బోర్డు.. ప్రతి వర్కర్‌కూ ఐడీ
ఈ చట్టం అమల్లోకి వస్తే, రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న దాదాపు 4 లక్షల మంది ప్లాట్‌ఫాం వర్కర్లకు (స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబెర్, అర్బన్ కంపెనీ తదితర) నేరుగా లబ్ధి చేకూరుతుంది. కార్మిక శాఖ మంత్రి ఛైర్మన్‌గా ఒక ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటవుతుంది.
చట్టం వచ్చిన 60 రోజుల్లోగా కంపెనీలన్నీ తమ వర్కర్ల డేటాను బోర్డుకు అందజేయాలి. ప్రతి వర్కర్‌కు బోర్డు ద్వారా ఒక విశిష్ట గుర్తింపు సంఖ్య (Unique ID) జారీ చేస్తారు. దీనివల్ల వర్కర్లందరికీ ప్రభుత్వ గుర్తింపు దక్కుతుంది.
ఆ సంక్షేమ నిధి ఎలా పనిచేస్తుందంటే?
ఈ బిల్లులో అత్యంత కీలకమైనది 'వెల్ఫేర్ ఫండ్' (Welfare Fund). అగ్రిగేటర్లు (యాప్ కంపెనీలు) గిగ్ వర్కర్‌కు చేసే ప్రతి లావాదేవీ లేదా చెల్లింపులో 1 నుంచి 2 శాతం మొత్తాన్ని ఈ సంక్షేమ నిధికి జమ చేయాల్సి ఉంటుంది.
ఈ ఫండ్ ద్వారా గిగ్ వర్కర్లకు ఇన్సూరెన్స్, ప్రసూతి సాయం, పెన్షన్లు, ఇతర సామాజిక భద్రతా పథకాలను ఆ సంక్షేమ బోర్డు అందిస్తుంది. ఉద్యోగ భద్రత లేని వర్కర్లకు ఇది ఒక కొండంత అండగా మారనుంది.
చట్టం వస్తోంది.. కానీ అమలు ఎలా?
గిగ్ వర్కర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం శుభపరిణామం. అయితే, చట్టం తెచ్చాక ఆ 1-2 శాతం కటింగ్ భారాన్ని కంపెనీలు తమ జేబులోంచి ఇస్తాయా? లేక పరోక్షంగా డెలివరీ ఛార్జీల రూపంలో కస్టమర్ల మీద, వర్కర్ల మీద వేస్తాయా? అనేది చూడాలి. అగ్రిగేటర్లు లొసుగులు వెతకకుండా ప్రభుత్వం పకడ్బందీ రూల్స్ పెడితేనే ఈ చట్టం అసలు ఉద్దేశం నెరవేరుతుంది.

