COVID Vaccine Fertility పై క్లారిటీ.. టీకా తీసుకుంటే పిల్లలు పుట్టరా? తేల్చేసిన స్వీడన్ అధ్యయనం!
"వ్యాక్సిన్ వేసుకుంటే పిల్లలు పుట్టరట.. దాంపత్య జీవితానికి దూరమవుతారట.." గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో ఇలాంటి మెసేజ్‌లు చూసి మీరు కూడా భయపడ్డారా? కొత్త జంటలు వ్యాక్సిన్ తీసుకోవడానికి వెనకడుగు వేశారా? అయితే మీకోసం ఒక గుడ్ న్యూస్. ఈ అనుమానాలన్నింటికీ చెక్ పెడుతూ స్వీడన్‌కు చెందిన లింకోపింగ్ యూనివర్సిటీ (Linkoping University) ఒక భారీ అధ్యయనం చేసింది. కోవిడ్ టీకాకు, సంతానోత్పత్తికి అసలు లింక్ ఉందా? సైన్స్ ఏం చెబుతోంది?
60 వేల మంది మహిళలపై స్టడీ.. ఫలితం ఇదే
సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల్లో ఏమాత్రం నిజం లేదని ఈ అధ్యయనం తేల్చిచెప్పింది. స్వీడన్ పరిశోధకులు 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న దాదాపు 60,000 మంది మహిళలపై ఈ రీసెర్చ్ చేశారు. ఈ వివరాలను ప్రముఖ సైన్స్ జర్నల్ 'కమ్యూనికేషన్స్ మెడిసిన్'లో ప్రచురించారు. ఇందులో తేలిన ఆసక్తికర విషయం ఏంటంటే.. వ్యాక్సిన్ తీసుకున్న వారికి, తీసుకోని వారికి మధ్య జననాల రేటులో (Birth Rate) గానీ, గర్భస్రావాల రేటులో గానీ గణాంకపరంగా ఎటువంటి తేడా లేదు. అంటే టీకా వల్ల పిల్లలు పుట్టే అవకాశం తగ్గదన్నమాట.
వ్యాక్సిన్ వల్ల కాదు.. అది కేవలం అపోహే
"పాండమిక్ సమయంలో చాలా దేశాల్లో జననాల రేటు తగ్గింది. దానికి కారణం mRNA కోవిడ్-19 వ్యాక్సిన్లు అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. మేం చేసిన పరిశోధనలో వ్యాక్సిన్ తీసుకున్న, తీసుకోని మహిళల మధ్య సంతానోత్పత్తి సామర్థ్యంలో ఎలాంటి వ్యత్యాసం కనిపించలేదు" అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ టూమాస్ టింప్కా స్పష్టం చేశారు. వయసు, ఇతర అనారోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని విశ్లేషించినా ఇదే ఫలితం వచ్చింది.
తల్లికావాలనుకునే వారికి భయం వద్దు
గతంలో జరిగిన కొన్ని అధ్యయనాలు కేవలం ఐవీఎఫ్ (IVF) వంటి చికిత్సలు తీసుకుంటున్న వారిపైనే జరిగాయి. కానీ ఈ స్టడీ మాత్రం సాధారణ జనాభాపై జరిగింది కాబట్టి దీని ఫలితాలు చాలా కీలకం. నిజానికి గర్భవతులకు కోవిడ్ సోకితే ప్రమాదం ఎక్కువ. అదే వ్యాక్సిన్ తీసుకుంటే ఆ రిస్క్ తగ్గుతుంది. కాబట్టి కొత్తగా పెళ్లయిన వారు, పిల్లల కోసం ప్లాన్ చేసుకునే మహిళలు ఎలాంటి సంకోచం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
వదంతులను నమ్మొద్దు.. సైన్స్ ను నమ్మండి!
టీకా తీసుకుంటే పిల్లలు పుట్టరనేది కేవలం అపోహ మాత్రమే. మీ ఆరోగ్యం, మీ కుటుంబ ఆరోగ్యం ముఖ్యం. ధైర్యంగా ఉండండి.

