Dry Cleaning Shop Income: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువే!

naveen
By -
Dry Cleaning Shop Income


సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనగానే లక్షల్లో జీతం, ఏసీ ఆఫీసు, వీకెండ్ పార్టీలు గుర్తొస్తాయి. 10 ఏళ్లు కష్టపడితే గానీ సీనియర్ పొజిషన్ కి వెళ్లి రూ.2 లక్షలు చేతికి రావు. కానీ, ఓ సాధారణ ఇస్త్రీ షాప్ (Ironing Shop) యజమాని సంపాదన వింటే ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా ఆశ్చర్యపోతారు. నెలకు రూ.2 లక్షలకు పైగా సంపాదిస్తున్న ఈ డ్రై క్లీనింగ్ వాలా స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదువుకున్నోడికంటే.. చమటోడ్చినోడే ఎక్కువ సంపాదిస్తున్నాడా? అసలు ఆ లెక్కలేంటి?


నళిని పోస్ట్.. నెట్టింట రచ్చ!


నళిని ఉనగర్ (Nalini Unagar) అనే కంటెంట్ క్రియేటర్ 'ఎక్స్' (X) వేదికగా ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఆమె తన ఇంటి దగ్గర ఉన్న డ్రై క్లీనింగ్ షాప్ ఓనర్ తో మాట్లాడినప్పుడు.. అతని నెలవారీ ఆదాయం రూ.2 లక్షలకు పైనే అని తెలిసి షాక్ అయ్యారట. "నేను నమ్మలేకపోయాను.. కానీ ఇది నిజం. 10 ఏళ్ల అనుభవం ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జీతంతో ఇది సమానం" అని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


రూ.2 లక్షలు ఎలా సాధ్యం? బిజినెస్ సీక్రెట్ ఇదే..


ఆ డ్రై క్లీనింగ్ షాప్ యజమాని చెప్పిన లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆ దంపతులు, ఇద్దరు సహాయకులతో కలిసి నడుపుతున్న ఆ షాపు గణాంకాలు ఇలా ఉన్నాయి:

  • ఐరనింగ్: రోజుకు సుమారు 350 బట్టలు ఇస్త్రీ చేస్తారు. ఒక్కోదానికి సగటున రూ.10 వేసుకున్నా.. రోజుకు రూ.3,500.

  • డ్రై క్లీనింగ్: రోజుకు దాదాపు 20 సూట్లు, పట్టు చీరలు వస్తాయి. వీటి ద్వారా రోజుకు రూ.7,000 ఆదాయం.

  • మొత్తం ఆదాయం: నెలకు మూడు రోజులు సెలవు తీసుకున్నా.. దాదాపు రూ.2.83 లక్షల గ్రాస్ ఇన్కమ్ వస్తోంది.


ఖర్చులు పోనూ.. లక్షల్లో లాభం!


వ్యాపారం అన్నాక ఖర్చులు ఉంటాయి కదా? వాటిని తీసేసినా చేతికి భారీగానే మిగులుతోంది.

  • సిబ్బంది జీతాలు: రూ.40,000 (ఇద్దరికి కలిపి).

  • కరెంట్ బిల్లు & ఇతర ఖర్చులు: రూ.6,000.

  • నికర లాభం (Net Profit): రూ.2.37 లక్షలు!

  • అసలు ట్విస్ట్ ఏంటంటే.. షాపు సొంతదే కావడంతో అద్దె బాధ లేదు. అందుకే ఇంత లాభం వస్తోంది.


ఉద్యోగమా? వ్యాపారమా?


ఈ పోస్ట్ ఇప్పుడు ఆన్‌లైన్ లో పెద్ద చర్చకు దారి తీసింది. కొందరు "కష్టపడితే ఏదైనా సాధ్యమే, డిగ్రీలు అక్కర్లేదు" అని మెచ్చుకుంటుంటే.. మరికొందరు "అన్ని రోజులూ ఇంత గిరాకీ ఉంటుందా? ఈ లెక్కలు నిజమేనా?" అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఏ పనీ చిన్నది కాదు అని ఈ స్టోరీ నిరూపిస్తోంది.