Gold Trading Scam Hyderabad: కంపెనీకే సినిమా చూపించాడు.. 10 లక్షలతో వెనక గేటు నుంచి జంప్!
సాధారణంగా ఫైనాన్స్ కంపెనీలు, గోల్డ్ లోన్ యాప్స్ జనాలను మోసం చేయడం చూస్తుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. "మీ బంగారం మేం విడిపిస్తాం" అని ప్రకటన ఇచ్చిన ఒక కంపెనీనే నిలువునా ముంచేశాడు ఓ సివిల్ కాంట్రాక్టర్. నమ్మకంగా మాట్లాడి, అకౌంట్లో రూ.10 లక్షలు వేయించుకుని.. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ను నడిరోడ్డుపై నిలబెట్టి సినిమా రేంజ్ లో ఎస్కేప్ అయ్యాడు. హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ (SR Nagar) పరిధిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు ఆ కిలాడి ఎలా స్కెచ్ వేశాడు? పోలీసులు అతన్ని ఎలా పట్టుకున్నారు?
ఫేస్‌బుక్ యాడ్.. సివిల్ కాంట్రాక్టర్ స్కెచ్
ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన గొల్ల వెంకటేశ్వరరావు (34) హైదరాబాద్ మోతీనగర్ లో ఉంటూ సివిల్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు. ఫేస్‌బుక్ లో ఒక 'గోల్డ్ ట్రేడింగ్ కంపెనీ' (Gold Trading Company) యాడ్ చూశాడు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపిస్తామన్నది ఆ యాడ్ సారాంశం. వెంటనే వారికి ఫోన్ చేసి, తాను ఐఐఎఫ్ఎల్ (IIFL)లో బంగారం తాకట్టు పెట్టానని, దాన్ని విడిపించాలని కోరాడు. కంపెనీ వారు ఎంక్వైరీ చేసి, వడ్డీతో కలిపి సుమారు రూ.10.37 లక్షలు అవుతుందని తేల్చారు.
డబ్బు పడింది.. డ్రామా మొదలైంది
వెంకటేశ్వరరావు మాటలు నమ్మిన కంపెనీ ప్రతినిధులు, ఆ మొత్తాన్ని నేరుగా అతని బ్యాంక్ ఖాతాలో వేశారు. డబ్బు పడగానే అసలు డ్రామా మొదలుపెట్టాడు. సెక్యూరిటీ చెక్కులు అడిగితే.. "నా దగ్గర ఒకటే ఉంది, మిగతావి మా ఇంట్లో ఉన్నాయి, రండి వెళ్దాం" అని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ను తన బైక్ మీద ఎక్కించుకున్నాడు. ఈఎస్‌ఐ ఆసుపత్రి వెనుక ఉన్న ఒక అపార్ట్‌మెంట్ దగ్గరికి తీసుకెళ్లాడు.
వెనుక గేటు నుంచి జంప్..
అపార్ట్‌మెంట్ ముందు ఎగ్జిక్యూటివ్‌ను ఆపి.. "ఇప్పుడే చెక్కులు తీసుకొస్తా, ఇక్కడే ఉండు" అని చెప్పి లోపలికి వెళ్లాడు. అటు వెళ్లగానే ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. ఎగ్జిక్యూటివ్ ముందు గేటు దగ్గర వెయిట్ చేస్తుండగా.. వెంకటేశ్వరరావు వెనుక గేటు నుంచి మెల్లగా జారుకున్నాడు. వెంటనే బ్యాంకుకు వెళ్లి అకౌంట్లో పడ్డ డబ్బును డ్రా చేసుకున్నాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసుల ఎంట్రీ.. కథ కంచికి
బాధితుల ఫిర్యాదుతో ఎస్ఆర్ నగర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగారు. టెక్నాలజీ సాయంతో నిందితుడిని గాలించి, శుక్రవారం అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి రూ.10.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సినిమా ఫక్కీలో మోసం చేసినా, చివరకు జైలు ఊచలు లెక్కపెట్టక తప్పలేదు.
నమ్మకం మీద బిజినెస్ నడవదు!
డిజిటల్ ట్రాన్సాక్షన్స్ రోజుల్లో కూడా ఫిజికల్ వెరిఫికేషన్ ఎంత ముఖ్యమో ఈ ఘటన రుజువు చేస్తోంది. కంపెనీలు కూడా ప్రాసెస్ పూర్తిగా జరగకుండా, సెక్యూరిటీ లేకుండా లక్షలు బదిలీ చేస్తే ఇలాగే ఉంటుంది.

