టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే చాలు.. నరాల తెగే ఉత్కంఠ ఉంటుందని అంతా భావిస్తారు. కానీ చరిత్ర చూస్తే సీన్ వేరేలా ఉంటుంది. 2007 నుంచి 2026 వరకు.. వేదికలు మారుతున్నాయి తప్ప ఫలితం మాత్రం మారడం లేదు. మీర్‌పూర్ నుంచి మెల్‌బోర్న్ వరకు, న్యూయార్క్ నుంచి ఇప్పుడు కొలంబో వరకు టీమిండియా ఆధిపత్యమే కొనసాగుతోంది.
తాజాగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లోనూ భారత్.. దాయాది పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. అయితే, మ్యాచ్ ముగియకముందే, ఒకానొక దశలోనే భారత్ గెలుస్తుందని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు స్పష్టత వచ్చేసిందట. అసలు సూర్యకు అంత ధీమా ఎప్పుడు వచ్చింది? గ్రౌండ్ లో జరిగిన ఆ మ్యాజిక్ ఏంటి?
కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 175 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక్కడే సగం విజయం ఖరారైపోయింది. దీనికి ప్రధాన కారణం యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఈశాన్ కిషన్. పాక్ బౌలర్లను ఉతికారేస్తూ కేవలం 40 బంతుల్లోనే 77 పరుగులు చేసి టీమిండియాకు కొండంత స్కోరును అందించాడు.
వాస్తవానికి ఈ పిచ్‌పై 155 పరుగులు చేస్తేనే గట్టి పోటీ ఉంటుందని విశ్లేషకులు భావించారు. కానీ ఈశాన్ మెరుపు ఇన్నింగ్స్ వల్ల భారత్ అదనంగా మరో 20 పరుగులు సాధించింది. ఎప్పుడైతే స్కోరు బోర్డుపై 175 పరుగులు కనిపించాయో.. అప్పుడే తనకు గెలుపుపై పూర్తి క్లారిటీ వచ్చేసిందని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించారు. పాకిస్థాన్ లాంటి ఒత్తిడికి లోనయ్యే జట్టుకు 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంటే కొండను ఎక్కడం లాంటిదేనని సూర్య అప్పుడే బలంగా నమ్మారు.
ఇక బౌలింగ్ లోనూ భారత్ ప్లాన్ పక్కాగా వర్కౌట్ అయ్యింది. హార్దిక్ పాండ్యా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తొలి ఓవర్ వేసి, మొదటి ఓవర్‌లోనే వికెట్ తీసి పాక్ పతనాన్ని శాసించాడు. ఆ వెంటనే జస్ప్రీత్ బుమ్రా రంగంలోకి దిగి తన తర్వాతి ఓవర్‌లోనే రెండు కీలక వికెట్లు పడగొట్టి పాక్ నడ్డి విరిచాడు. బుమ్రా వేసిన ఆ ఒక్క ఓవర్ మ్యాచ్ ఫలితాన్ని దాదాపు ఖరారు చేసేసింది.
బుమ్రా ఎందుకు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలరో మరోసారి నిరూపించుకున్నాడని కెప్టెన్ సూర్య కొనియాడారు. వీరికి తోడు స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కూడా క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో పాకిస్థాన్ జట్టు 18 ఓవర్లలోనే కేవలం 114 పరుగులకు కుప్పకూలిపోయింది.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మొదట బ్యాటింగ్ చేసేటప్పుడు ఎంత స్కోరు సరిపోతుందో చెప్పడం కష్టమని, కానీ తాము 175 పరుగులకు చేరుకోగానే గెలుపు ధీమా వచ్చేసిందని తెలిపారు. ఈ పిచ్‌పై అది అవసరమైన దానికంటే 15-20 పరుగులు ఎక్కువేనని, తమ బౌలర్లు ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేస్తారని తనకు తెలుసని వ్యాఖ్యానించారు.
హార్దిక్ ఇచ్చిన ఆరంభం, బుమ్రా వేసిన స్పెల్ మ్యాచ్‌ను తమ వైపు తిప్పేశాయని సూర్య సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయంతో భారత్ హ్యాట్రిక్ కొట్టి సూపర్-8 దశకు చేరుకోగా, పాకిస్థాన్ పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. ఈ విజయంతో టీమిండియా గ్రూప్ స్టేజ్‌లో వరుసగా మూడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. పాకిస్థాన్‌పై 61 పరుగుల భారీ తేడాతో గెలవడం వల్ల నెట్ రన్ రేట్ కూడా అమాంతం పెరిగింది.
పాక్ కథ కంచికే.. భారత్ సెమీస్ కే!
ఈశాన్ కిషన్ బ్యాటింగ్, బుమ్రా బౌలింగ్, సూర్య కెప్టెన్సీ.. మూడూ కలిస్తే విజయం ఖాయం. ఇదే ఊపు కొనసాగితే కప్పు కొట్టడం ఖాయం.

