సంక్రాంతి రేసులో లేటుగా వచ్చినా లేటెస్ట్ గా హిట్టు కొట్టాడు యంగ్ హీరో శర్వానంద్. 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో బాక్సాఫీస్ వద్ద మళ్లీ తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. ఈ జోష్ లోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని పరుగులు పెట్టిస్తున్నాడు. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్లతో శర్వా చేయబోయే సినిమాపై ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ లో నటించబోయే లక్కీ హీరోయిన్ ఎవరు? పాన్ ఇండియా బ్యూటీనా లేక టాలీవుడ్ లో దూసుకుపోతున్న కన్నడ భామనా?
ఈ సంక్రాంతికి విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం శర్వానంద్ కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న సమయంలో వచ్చిన ఈ విజయం ఆయనలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ఊపులోనే తన తదుపరి చిత్రం ‘బైకర్’ను ఏప్రిల్ 3న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బైక్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ త్వరలోనే కిక్ స్టార్ట్ కానున్నాయి. అయితే అందరి దృష్టి మాత్రం ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో రాబోయే సినిమాపైనే ఉంది. ఈ సినిమాతో వచ్చే సంక్రాంతికి కూడా హిట్టు కొడతానని శర్వానంద్ నమ్మకంగా ఉన్నారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కాస్టింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో హీరోయిన్ ఎంపిక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ పేరు బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ నటిస్తున్న 'డ్రాగన్' సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రుక్మిణికి ఇప్పుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఆమె కనుక ఈ ప్రాజెక్ట్ లోకి వస్తే సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. మరోవైపు మరో అందాల తార ఆషికా రంగనాథ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే రవితేజ సరసన మెరిసిన ఆషికా, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర'లో కీలక పాత్ర పోషిస్తోంది. గ్లామర్, నటన రెండూ ఉన్న ఆషికా అయితే బాగుంటుందని కొందరు, కాదు రుక్మిణి వసంత్ అయితే ఫ్రెష్ గా ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. శ్రీను వైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కే ఈ సినిమాలో శర్వానంద్ సరసన ఈ ఇద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే దీనిపై నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ లో శర్వానంద్ స్పీడ్ మామూలుగా లేదు.
శర్వా స్పీడ్ పెంచాడు!
సంక్రాంతి సెంటిమెంట్ తో శ్రీను వైట్లతో జతకట్టాడు. ఇప్పుడు హీరోయిన్ ఎంపికతో ప్రాజెక్ట్ పై హైప్ పెంచేస్తున్నాడు.

