క్రికెట్ అంటే పడిచచ్చే సగటు భారతీయ అభిమానికి నేడు అసలైన అగ్నిపరీక్ష. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో సఫారీల (సౌతాఫ్రికా) చేతిలో ఎదురైన 76 పరుగుల ఘోర పరాజయం.. టీమిండియా సెమీస్ ఆశలను తలకిందులు చేసింది. ఇప్పుడు జింబాబ్వేపై కేవలం గెలిస్తే లాభం లేదు, మైనస్‌లో ఉన్న కొండంత నెట్ రన్ రేట్ (NRR) ను కరిగించాలి. చెన్నై వేదికగా రాత్రి 7 గంటలకు జరగనున్న ఈ చావో రేవో మ్యాచ్‌పై అభిమానులు ఎందుకు కాలిక్యులేటర్లు పట్టుకుని కూర్చోవాలి? మనవాళ్లు సెమీస్ వెళ్లాలంటే సాధించాల్సిన ఆ నెట్ రన్ రేట్ 'మ్యాజిక్ ఫిగర్' ఏంటి?
సౌతాఫ్రికా దెబ్బ.. రన్ రేట్ గల్లంతు!
సూపర్-8 దశలో నెట్ రన్ రేట్ అత్యంత కీలకం. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఘోర ఓటమితో టీమిండియా రన్ రేట్ దారుణంగా పడిపోయింది. దీంతో నేడు జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ డూ ఆర్ డై (Do or Die) గా మారింది.
ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినా సరే, ఆ గెలుపు భారీ మార్జిన్‌తో ఉండాలి. లేకపోతే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది, సెమీస్ అవకాశాలు గాల్లో దీపంగా మారతాయి. అందుకే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎంత తేడాతో గెలుస్తుందన్నదే ఇప్పుడు అసలైన పాయింట్. ఇక్కడ మ్యాచ్ ఫలితాన్ని శాసించేది టాస్ మాత్రమే!
ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే లెక్కలివే..
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తే సమీకరణాలు చాలా స్పష్టంగా ఉంటాయి. నెట్ రన్ రేట్‌ను పాజిటివ్‌లోకి తీసుకురావాలంటే కచ్చితంగా 77 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేయాలి.
అంటే భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 170 పరుగులు కొడితే, జింబాబ్వేను 92 పరుగులకే ఆలౌట్ చేయాలి. ఒకవేళ 180 కొడితే 103 లోపు, 190 చేస్తే 113 లోపు, 200 పరుగులు సాధిస్తే 123 పరుగుల లోపే ప్రత్యర్థిని కట్టడి చేయాలి. భారీ స్కోర్‌తో పాటు జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తేనే ఇది సాధ్యమవుతుంది.
ఛేజింగ్ చేస్తే ఊపిరాడదు!
ఒకవేళ భారత్ టాస్ ఓడిపోయి ఛేజింగ్‌కు దిగితే మాత్రం ఆటగాళ్లతో పాటు అభిమానులకూ టెన్షన్ తప్పదు. ఎందుకంటే సాధారణంగా 16 లేదా 17 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేజ్ చేస్తే సరిపోదు. నెట్ రన్ రేట్ పూర్తిగా పాజిటివ్‌లోకి రావాలంటే టీ20ని కాస్తా టీ10 లాగా ఆడాల్సిందే.
జింబాబ్వే ముందుగా బ్యాటింగ్ చేసి 140 పరుగులు చేస్తే.. భారత్ దాన్ని కేవలం 10.4 ఓవర్లలోనే కొట్టేయాలి. 160 చేస్తే 11.2 ఓవర్లలో, 180 చేస్తే 11.4 ఓవర్లలో, ఏకంగా 200 రన్స్ చేస్తే 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాలి. పవర్ ప్లే నుంచే ఏమాత్రం వేగం తగ్గకుండా విధ్వంసం సృష్టించాల్సి ఉంటుంది.
టాస్ గెలువు.. మ్యాచ్ కుమ్ము!
ఈ రోజు మ్యాచ్‌లో సమీకరణాలు చూస్తుంటే, ఛేజింగ్ చేయడం కత్తిమీద సాము లాంటిది. ఓవర్లు కరిగిపోతుంటే బ్యాటర్లపై ఒత్తిడి పెరిగి వికెట్లు పారేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి కచ్చితంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడమే శ్రేయస్కరం. నా అంచనా ప్రకారం.. చెన్నై పిచ్‌పై భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 190+ స్కోర్ బోర్డుపై పెడితే, మన స్పిన్నర్ల ఉచ్చులో జింబాబ్వే చిత్తు కావడం ఖాయం. టీమిండియా సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవడం పక్కా!

