Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ షాక్, యుద్ధానికి సై

naveen
By -

Iran Nuclear Warning

ప్రపంచం మరో యుద్ధం అంచున ఉందా? ఉక్రెయిన్, గాజా మంటలు చల్లారకముందే.. ఇరాన్ (Iran) అగ్గి రాజేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా (USA) హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.. "యురేనియం శుద్ధి ఆపే ప్రసక్తే లేదు" అని ఇరాన్ తేల్చి చెప్పింది. యుద్ధం వచ్చినా తగ్గేదే లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గల్ఫ్ రీజియన్ లో అలజడి రేపుతున్నాయి. అసలు ఈ గొడవ సామాన్యుడికి ఎందుకు ముఖ్యం? పెట్రోల్ ధరలు మళ్లీ భగ్గుమనే ప్రమాదం ఉందా?


యుద్ధం వచ్చినా తగ్గేదేలే!

టెహ్రాన్ వేదికగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ (Abbas Araghchi) అమెరికాకు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. "మా ప్రవర్తనను శాసించే హక్కు ఎవరికీ లేదు. మాపై యుద్ధం రుద్దినా సరే, యురేనియం శుద్ధిని వదులుకోం" అని స్పష్టం చేశారు. ఒమన్ (Oman) లో అమెరికాతో పరోక్ష చర్చలు జరుగుతున్న వేళ.. ఇరాన్ ఇలా మాట్లాడటం అంటే చర్చలు ఫెయిల్ అయినట్లేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి.


అబ్రహం లింకన్ వచ్చినా భయపడం..

తమను భయపెట్టేందుకే అమెరికా ఈ ప్రాంతంలో 'యూఎస్ఎస్ అబ్రహం లింకన్' (USS Abraham Lincoln) యుద్ధ నౌకను మోహరించిందని ఇరాన్ ఆరోపిస్తోంది. అయితే, ఇలాంటి సైనిక చర్యలకు భయపడేది లేదని అబ్బాస్ తేల్చిచెప్పారు. క్షిపణి కార్యక్రమాలపై చర్చించే ప్రసక్తే లేదని, కేవలం అణు ఒప్పందంపై తమ హక్కును గుర్తిస్తేనే ముందుకు వెళ్తామని కండిషన్ పెట్టారు.


ఫిబ్రవరి 11న కీలక భేటీ..

ఇరాన్ మొండి వైఖరితో అమెరికా, ఇజ్రాయెల్ అప్రమత్తమయ్యాయి. ఈ అంశంపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు, ఇజ్రాయెల్ ప్రధాని ఫిబ్రవరి 11న (ఎల్లుండి) సమావేశం కానున్నారు. అక్కడ వారు తీసుకునే నిర్ణయం గల్ఫ్ భవిష్యత్తును నిర్ణయించనుంది. త్వరలోనే అమెరికాతో మరో విడత చర్చలు జరిగే అవకాశం ఉందని ఇరాన్ అంచనా వేస్తోంది.


పెట్రోల్ మంట తప్పదా? 

గల్ఫ్ లో చిన్న అలజడి రేగినా.. దాని ప్రభావం మన పెట్రోల్ బంకుల్లో కనిపిస్తుంది. ఇరాన్ అణు ఉద్రిక్తతలు పెరిగితే ముడి చమురు ధరలు పెరిగి, సామాన్యుడి జేబుకి చిల్లు పడటం ఖాయం. ఫిబ్రవరి 11న జరిగే భేటీలో శాంతి దొరుకుతుందా లేక యుద్ధం మొదలవుతుందా? వెయిట్ అండ్ సీ!


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!