మరణం ఆ పసిగుండెను ఆపేసి ఉండవచ్చు కానీ.. ఆమెలోని ప్రాణం ఇప్పుడు మరో ఐదుగురిలో చిగురించింది. కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్‌గా మారిన పది నెలల చిన్నారి అలిన్ షెరిన్ అబ్రహం (Alin Sherin Abraham) కథ ఇప్పుడు యావత్ దేశాన్ని కదిలిస్తోంది.
తన అవయవాల దానంతో అత్యంత పిన్న వయస్కురాలైన అవయవదాతగా చరిత్ర సృష్టించిన అలిన్ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం పథనంథిట్ట (Pathanamthitta) జిల్లాలోని మల్లప్పల్లిలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి. పుట్టి పట్టుమని పది నెలలు కూడా నిండకుండానే లోకాన్ని విడిచివెళ్లిన ఆ చిన్నారికి దేశం మొత్తం సెల్యూట్ చేస్తోంది.
ఫిబ్రవరి మొదటి వారంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో అలిన్ తీవ్రంగా గాయపడింది. వైద్యులు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ.. విధి చిన్నారిని బ్రెయిన్‌డెడ్ స్థితికి చేర్చింది. తమ బిడ్డ తిరిగి రాదని తెలిసినా.. ఆ తల్లిదండ్రులు గుండెలు పిండేసే విషాదాన్ని దిగమింగుకుని ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
తమ గారాల పట్టి మట్టిలో కలిసిపోవడం ఇష్టం లేక, అవయవాలను దానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అలిన్ అందించిన గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కళ్లు ఇప్పుడు ఇతరుల రూపంలో ఈ భూమిపై సజీవంగానే ఉన్నాయి. ఆ పసిపాప త్యాగం మరణాన్ని కూడా జయించింది.
ఈ ఘటన దేశ ప్రధాని నరేంద్ర మోదీని కూడా కదిలించింది. ఆయన సూచన మేరకు కేంద్ర మంత్రి సురేశ్ గోపి (Suresh Gopi) స్వయంగా అంత్యక్రియలకు హాజరయ్యారు. దేశం తరఫున చిన్నారి అలిన్‌కు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మనం ఈ చిన్నారి భౌతికకాయాన్ని ఖననం చేస్తున్నా.. అవయవ దానమనే మహోన్నతమైన చర్యతో ఆమె ఇతరుల రూపంలో చిరంజీవిగానే ఉంటుందని కొనియాడారు.
మరణంలోనూ స్ఫూర్తిని నింపిన ఈ కుటుంబానికి దేశం రుణపడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, వేలాది మంది ప్రజలు పాల్గొని బరువెక్కిన హృదయాలతో చిన్నారికి కన్నీటి వీడ్కోలు పలికారు. కేరళ ప్రభుత్వం అలిన్ త్యాగానికి గుర్తింపుగా రాష్ట్ర గౌరవ మర్యాదలను ప్రకటించింది. ఆ చిన్నారి అందించిన అవయవాలు సకాలంలో అవసరమైన వారికి చేరేలా కేరళ ఆరోగ్య శాఖ ప్రత్యేక గ్రీన్ కారిడార్‌లను ఏర్పాటు చేసి ఆపరేషన్లను విజయవంతం చేసింది.
పది నెలల వయసు.. పది కాలాల పాటు గుర్తుండిపోయే త్యాగం!
అలిన్ షెరిన్ కథ అవయవదానంపై సమాజంలో కొత్త స్ఫూర్తిని నింపుతోంది. మరణం ముగింపు కాదు.. మరో జీవితానికి ఆరంభం అని ఈ చిన్నారి నిరూపించింది.

