ప్రపంచం అంతా ఉత్కంఠగా చూస్తున్న దేశం ఉత్తర కొరియా. అక్కడ ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియదు. కానీ ఇప్పుడు ఆ నిగూఢ రాజవంశంలో ఒక అంతర్యుద్ధం మొదలవబోతోంది. ఇది సినిమా స్టోరీ కాదు, అణు బాంబులు ఉన్న దేశం కథ.
ప్రస్తుత నియంత కిమ్ జోంగ్ ఉన్ తన 13 ఏళ్ల కూతురు కిమ్ జు ఏని వారసురాలిగా ప్రకటిస్తుంటే, ఎప్పటి నుంచో ఆ సీటుపై కన్నేసిన కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ రగిలిపోతోంది. అత్తా-కోడలి మధ్య మొదలైన ఈ పోరు ఎలాంటి రక్తపాతానికి దారి తీస్తుంది? ఒక 13 ఏళ్ల బాలిక చేతికి అణుబాంబు రిమోట్ ఇస్తే ప్రపంచం పరిస్థితి ఏంటి?
ఈ నెలాఖరులో జరగనున్న ఉత్తర కొరియా 'వర్కర్స్ పార్టీ కాంగ్రెస్' సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఈ కీలక వేదికపైనే కిమ్ జోంగ్ ఉన్ తన వారసురాలిగా కిమ్ జు ఏ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దక్షిణ కొరియా నిఘా సంస్థ (NIS) నివేదిక ప్రకారం, కిమ్ జు ఏ ఇప్పటికే తండ్రి పక్కన క్షిపణి ప్రయోగాల నుంచి సైనిక పరేడ్‌ల వరకు అన్నింటిలోనూ పాల్గొంటోంది.
గత సెప్టెంబర్‌లో ఆమె బీజింగ్ పర్యటనకు వెళ్లడం, కొన్ని ప్రభుత్వ విధానాలపై తన అభిప్రాయాలను వ్యక్తపరచడం చూస్తుంటే, ఆమె కేవలం ఉత్సవ విగ్రహం కాదని, భావి పాలకురాలని స్పష్టమవుతోంది. 2022లో మొదటిసారి ప్రపంచానికి పరిచయమైన జు ఏ, ఇప్పుడు పాలనా వ్యవహారాల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నారు.
అయితే కిమ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన సోదరి, దేశంలోనే రెండో అత్యంత శక్తివంతమైన మహిళగా పేరొందిన కిమ్ యో జోంగ్‌కు ఏమాత్రం రుచించడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం 38 ఏళ్ల వయసున్న ఆమె ఇన్నాళ్లు కిమ్ జోంగ్ ఉన్‌కు నీడలా ఉంటూ, దేశ రాజకీయాలను, విదేశాంగ విధానాలను శాసిస్తున్నారు. అకస్మాత్తుగా ఒక 13 ఏళ్ల బాలిక వచ్చి తన స్థానాన్ని ఆక్రమిస్తుంటే ఆమె మౌనంగా ఉండే రకం కాదని మాజీ నిఘా అధికారి రా జోంగ్ యిల్ అభిప్రాయపడ్డారు.
సైన్యంలో, రాజకీయ వర్గాల్లో బలమైన పట్టు ఉన్న యో జోంగ్, అధికారం కోసం తనదైన శైలిలో పావులు కదిపే ప్రమాదం ఉందని, అది భవిష్యత్తులో తీవ్రమైన అధికార పోరుకు దారితీయవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఆమె తన సొంత ‘పొలిటికల్ ప్రాజెక్ట్’ను అమలు చేస్తే పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉంది.
ఉత్తర కొరియా రాజవంశంలో అధికారం కోసం సొంత రక్తసంబంధీకులనే అంతం చేసిన రక్తచరిత్ర ఉంది. 2013లో కిమ్ తన సొంత మేనమామ, గురువు అయిన జాంగ్ సాంగ్ థేక్‌ను ద్రోహిగా ముద్రవేసి అత్యంత కిరాతకంగా చంపించారు. అలాగే 2017లో మలేషియా విమానాశ్రయంలో తన సవతి అన్న కిమ్ జోంగ్ నామ్‌ను రసాయన దాడితో కిమ్ మనుషులు అంతం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పుడు దాదాపు 50 నుంచి 90 అణు వార్‌హెడ్లు ఉన్న దేశ పగ్గాలు ఒక టీనేజర్ చేతికి వెళ్తే సైన్యం ఎలా స్పందిస్తుంది? అధికారం కోసం మేనత్త కిమ్ యో జోంగ్ తిరుగుబాటు చేస్తే పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయోనని ప్రపంచం ఆందోళన చెందుతోంది. ఈ నెలాఖరులో జరిగే సమావేశం కేవలం జు ఏ భవిష్యత్తునే కాదు, ఆ దేశ స్థిరత్వాన్ని కూడా నిర్ణయించనుంది.
కిమ్ రాజ్యంలో కింగ్ ఎవరైనా.. కత్తి వేలాడుతూనే ఉంటుంది!
రక్త సంబంధాల కంటే అధికారమే ముఖ్యమని నమ్మే ఈ వంశంలో.. రాబోయే రోజుల్లో మరో రక్తపాతం తప్పకపోవచ్చు.

