Ola Uber Strike Today: ఆగిపోనున్న చక్రాలు.. దేశవ్యాప్త సమ్మెతో ప్రయాణికులకు తిప్పలు!
ఈ వీకెండ్ సినిమాకో, షికారుకో వెళ్దామని ప్లాన్ చేసుకున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మీ జర్నీకి బ్రేకులు పడే ఛాన్స్ ఉంది. దేశవ్యాప్తంగా ఓలా, ఉబర్, ర్యాపిడో (Ola, Uber, Rapido) డ్రైవర్లు ఇవాళ (శనివారం) సమ్మె బాట పట్టారు. స్టీరింగ్ వదిలేసి, యాప్స్ ఆపేసి నిరసన తెలుపుతున్నారు. 'ఆల్ ఇండియా బ్రేక్ డౌన్' (All India Breakdown) పేరుతో జరుగుతున్న ఈ సమ్మె వెనుక ఉన్న బలమైన కారణం ఏంటి? డ్రైవర్ల ఆవేదన ఎందుకు కట్టలు తెంచుకుంది?
'ఆల్ ఇండియా బ్రేక్ డౌన్'.. 6 గంటల నిరసన
గిగ్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) పిలుపు మేరకు ఈ సమ్మె జరుగుతోంది. నేడు (ఫిబ్రవరి 7) ఉదయం నుంచి సుమారు 6 గంటల పాటు డ్రైవర్లందరూ యాప్‌ల నుంచి లాగ్-అవుట్ (Log-out) కానున్నారు. చక్రాలు కదలవు, యాప్స్ పనిచేయవు. దీనికి జాతీయ స్థాయి కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలపడంతో దేశవ్యాప్తంగా రవాణా సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
శ్రమ దోపిడీపై యుద్ధం.. వైట్ ప్లేట్ బండ్లపై ఆంక్షలు
కార్పొరేట్ కంపెనీల దోపిడీకి వ్యతిరేకంగా ఈ పోరాటం జరుగుతోంది. డ్రైవర్ల ప్రధాన డిమాండ్లు ఇవే:
కనీస ఛార్జీలు: 'మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్-2025' వచ్చినా, ప్రభుత్వం కనీస ఛార్జీలను నిర్ణయించకపోవడంతో డ్రైవర్ల ఆదాయం దారుణంగా పడిపోయింది.
ప్రైవేట్ వాహనాలు: ప్రైవేట్ నంబర్ ప్లేట్ (White Plate) ఉన్న వాహనాలను కమర్షియల్ గా వాడటం వల్ల లైసెన్స్ ఉన్న డ్రైవర్ల ఉపాధి దెబ్బతింటోంది. దీన్ని తక్షణమే నిషేధించాలి.
కమిషన్ దోపిడీ: అగ్రిగేటర్ సంస్థలు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్న కమిషన్లను తగ్గించాలి.
నెలకు 15 వేలు కూడా రావట్లే..
తాజా 'ఎకనామిక్ సర్వే 2025-26' గిగ్ వర్కర్ల కష్టాలను కళ్లకు కట్టింది. దేశంలో 40 శాతం మంది గిగ్ వర్కర్లు నెలకు రూ.15,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారని తేల్చింది. పెట్రోల్ ధరలు, మెయింటెనెన్స్ పోను మిగిలేది అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో కేంద్రం తెచ్చిన 'భారత్ టాక్సీ' (Bharat Taxi) అనే కొత్త సహకార ప్లాట్‌ఫామ్ ఈ రంగాన్ని ఎలా మారుస్తుందో చూడాలి.
ప్రయాణం వాయిదా వేసుకోండి! క్యాబ్ దొరకడం కష్టం..
దొరికినా సర్జ్ ప్రైసింగ్ తో రేట్లు మండిపోవచ్చు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోకపోవడం లేదా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవడం ఉత్తమం.

