మోదీ విశ్వరూపం! కాంగ్రెస్ కు చుక్కలు.. బెంగాల్ సర్కార్ కు వార్నింగ్.. రాజ్యసభలో దద్దరిల్లిన ప్రసంగం
రాజ్యసభ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి తన వాగ్ధాటితో విపక్షాలకు చెమటలు పట్టించారు. "నాపై ద్వేషం పెంచుకుని.. దేశ ప్రగతిని అడ్డుకుంటారా?" అంటూ కాంగ్రెస్ పార్టీని నిలదీసిన తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేవలం రాజకీయ విమర్శలే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎలా దూసుకెళ్తోంది? అమెరికాతో డీల్ వల్ల మన యువతకు దక్కే లాభాలేంటి? బెంగాల్ లో అసలు ఏం జరుగుతోంది? అంటూ మోదీ చేసిన ప్రసంగం అనేక కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది.
నాపై ద్వేషం.. దేశంపై విషం!
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీకి దేశం పట్ల ఎలాంటి దూరదృష్టి గానీ, సరైన ప్రణాళిక గానీ లేదని ఎద్దేవా చేశారు. కేవలం తనపై, ఒక వర్గంపై ద్వేషాన్ని పెంచుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల లోక్‌సభలో జరిగిన పరిణామాలు, రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరగకపోవడం వంటివి అత్యున్నత పదవిని అవమానించడమేనని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. విపక్షాల తీరు తనను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు.
11 నుంచి 3కు.. ఇదీ మా రేంజ్
గత యూపీఏ హయాంతో పోల్చుతూ ఎన్డీయే సాధించిన విజయాలను మోదీ గణాంకాలతో సహా వివరించారు. యూపీఏ పాలనలో ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, ఎన్డీయే హయాంలో టాప్-3కి చేరుకోనుందని స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని, గతంలో మనతో మాట్లాడటానికి వెనకాడిన దేశాలు ఇప్పుడు క్యూ కట్టి ఒప్పందాలు చేసుకుంటున్నాయని గుర్తు చేశారు. ముఖ్యంగా ఈయూ, అమెరికాతో చేసుకున్న ట్రేడ్ డీల్స్, వికసిత్ భారత్ లక్ష్యం మన దేశ కీర్తిని పెంచుతున్నాయని తెలిపారు.
యువతే మన బలం.. రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్
ప్రపంచంలోని అనేక దేశాల్లో వృద్ధుల జనాభా పెరుగుతుంటే, భారత్ లో మాత్రం యువశక్తి ఉప్పొంగుతోందని మోదీ అన్నారు. తయారీ రంగంలో మనం సృష్టించిన బలమైన ఎకో సిస్టమ్ వల్ల విదేశీ పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని, ఇది మన యువతకు ఎంతో మేలు చేస్తుందని వివరించారు. 'రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్' అనే నినాదంతో ప్రభుత్వం దూసుకెళ్తోందని, బ్యాంకింగ్ రంగాన్ని ప్రక్షాళన చేసి పేదలకు రుణాలు అందేలా చేశామని తెలిపారు. ముద్ర యోజన కింద రూ.30 లక్షల కోట్ల రుణాలు ఇచ్చి, కోట్లాది మందికి స్వయం ఉపాధి కల్పించామని, నీతి ఆయోగ్వంటి సంస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు.
బెంగాల్ లో అక్రమార్కులకు రెడ్ కార్పెట్?
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధి చెందిన దేశాలు అక్రమ వలసదారులను తమ దేశాల నుంచి పంపించివేస్తుంటే, బెంగాల్ సర్కార్ మాత్రం అక్రమార్కులను కాపాడేందుకు కోర్టుల చుట్టూ తిరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దేశ పౌరుల హక్కులను హరించడమేనని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జాతీయ భద్రతను పణంగా పెడుతున్నారని పరోక్షంగా చురకలు అంటించారు.
విపక్షాలకు విజన్ లేదు.. మాకు విశ్రాంతి లేదు!
మోదీ ప్రసంగం సారాంశం ఒక్కటే.. విమర్శలు చేయడం కాదు, అభివృద్ధి చేసి చూపించాలి. కాంగ్రెస్ కు లేనిది, బీజేపీకి ఉన్నది ఆ 'విజన్' మాత్రమే అని మోదీ మరోసారి స్పష్టం చేశారు.

