మనం ఉదయం లేవగానే ఫోన్ తీసి 'Gm' (Good Morning) అని మెసేజ్ చేస్తాం. రాత్రి పడుకునేటప్పుడు 'Gn' (Good Night) అంటాం. స్నేహితులతో మాట్లాడేటప్పుడు 'Btw' (By the way), నవ్వు వస్తే 'Lol' (Laugh out loud) వాడటం సర్వసాధారణం అయిపోయింది. ఇది వాట్సాప్ లోనో, ఇన్‌స్టాగ్రామ్ లోనో ఉంటే పర్లేదు. కానీ, ఇదే భాషను తీసుకొచ్చి యూనివర్సిటీ ఎగ్జామ్ పేపర్లలో రాస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే జరిగింది ఉత్తరాఖండ్ లో. అక్కడి విద్యార్థులు జవాబు పత్రాల్లో రాసిన రాతలు చూసి ప్రొఫెసర్లు తలలు పట్టుకుంటున్నారు. అసలు ఆన్సర్ షీట్లలో వారు ఏం రాశారు? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది?
పరీక్షలా? లేక వాట్సాప్ చాటింగా?
ఉత్తరాఖండ్‌లోని కుమాయూన్ విశ్వవిద్యాలయానికి చెందిన హల్ద్వానీ కళాశాలలో ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఒక విచిత్రమైన, ఆందోళనకరమైన ధోరణి బయటపడింది. అధ్యాపకులు జవాబు పత్రాలను దిద్దుతున్నప్పుడు విద్యార్థులు రాసిన భాష చూసి విస్తుపోయారు. సంప్రదాయబద్ధంగా పూర్తి వాక్యాలు రాయాల్సిన చోట, విద్యార్థులు సోషల్ మీడియాలో వాడే కోడ్ భాషను యథేచ్ఛగా వాడేశారు. ఉదాహరణకు "Because" అని రాయాల్సిన చోట "Coz" అని, "Between" అని రాయడానికి బదులుగా "B/w" అని, "Before" స్థానంలో "B4" అని రాశారు. అంతేకాదు, "And" అని రాయడానికి బదులు "&" గుర్తును వాడటం, జవాబు చివర్లో సీరియస్ గా ముగించకుండా "LOL" అని రాయడం చూసి దిద్దేవాళ్లకు మతిపోయింది.
పెన్ పవర్ తగ్గింది.. టైపింగ్ జోరు పెరిగింది
ఒకప్పుడు విద్యార్థులు రన్నింగ్ నోట్స్ రాసేవాళ్లు, ఉత్తరాలు రాసేవాళ్లు. కానీ ఇప్పుడు అంతా స్మార్ట్ యుగం. తరగతిలో చెప్పే పాఠాలను కూడా నోట్స్ యాప్ లో టైప్ చేసుకోవడం లేదా ఫోటోలు తీసుకోవడం అలవాటైపోయింది. దీంతో చేతి రాత (Handwriting) కనుమరుగైపోతోంది. వేగంగా టైప్ చేయడానికి అలవాటు పడ్డ ఈ తరం, ఆలోచించడం కూడా షార్ట్ కట్స్ లోనే చేస్తోంది. హిందీ, ఇంగ్లీష్ కలిపి రాయడం (Hinglish), కీబోర్డ్ స్టైల్ లో పదాలను తర్జుమా చేయడం వంటివి ఇప్పుడు పరీక్షల్లోనూ ప్రతిబింబిస్తున్నాయి. కొంతమంది విద్యార్థులైతే పేజీలకు పేజీలు రాయాల్సింది పోయి, చాటింగ్ లో రిప్లై ఇచ్చినట్లు రెండు మూడు లైన్లలో ఆన్సర్స్ రాసి ముగించేస్తున్నారట. పరిస్థితి తీవ్రతను గమనించిన యూనివర్సిటీ, జనవరి 3 నుంచి 6 వరకు జరిగిన పరీక్షా పత్రాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని నిర్ణయించింది.
జెన్-జీ (Gen Z) ప్రభావం
సాధారణంగా 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వారిని 'జెన్-జీ' అంటారు. వీరు పుట్టినప్పటి నుంచే ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లతో పెరిగారు. వీరికి పెన్ కంటే కీబోర్డ్ మీద గ్రిప్ ఎక్కువ. వేగంగా స్పందించడం, తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని కోడ్ భాషలో పంపడం వీరికి అలవాటు. అయితే ఈ అలవాటు సోషల్ మీడియా వరకు పరిమితం కాకుండా, అకడమిక్ కెరీర్ ను దెబ్బతీసేలా పరీక్షల్లోకి చొరబడటమే ఇప్పుడు అసలు సమస్య. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అధికారిక లేఖలు, డాక్యుమెంటేషన్ ప్రక్రియలో తీవ్రమైన ఇబ్బందులు తప్పవని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.
సాంకేతికత వాడకం తప్పు కాదు, కానీ సందర్భం ముఖ్యం. ఎగ్జామ్ హాల్ ని వాట్సాప్ గ్రూప్ లా మార్చేస్తే, మార్కులు కూడా 'షార్ట్ కట్'లోనే పడతాయని విద్యార్థులు గ్రహించాలి.

.webp)