రాజకీయాల్లో విమర్శలు, నిరసనలు సహజం. కానీ విదేశీ పెట్టుబడిదారులు, ప్రపంచ దిగ్గజాలు చూస్తున్న ఇంటర్నేషనల్ సమ్మిట్‌లో.. మన దేశ నాయకులు బట్టలు విప్పి నిరసనలు చేస్తే ఏమవుతుంది? దేశం పరువు బజారున పడుతుంది! యువతకు లక్షల ఉద్యోగాలు తీసుకురావాల్సిన ఏఐ సదస్సును రాజకీయ రచ్చకు వాడుకోవడం సామాన్యుడి భవిష్యత్తును దెబ్బతీయడమే. న్యూఢిల్లీలో జరిగిన 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'లో యూత్ కాంగ్రెస్ నాయకులు చేసిన అర్ధనగ్న నిరసనలపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు అంతర్జాతీయ వేదికపై కాంగ్రెస్ ఎందుకు ఈ ఆందోళనకు దిగింది? ప్రధాని అంత ఘాటుగా ఎందుకు స్పందించారు?
"కొత్తగా బట్టలు విప్పక్కర్లేదు.. మీ గుట్టు దేశానికి తెలుసు!"
ఢిల్లీ-మీరట్ ర్యాపిడ్ మెట్రో కారిడార్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన ప్రధాని మోదీ.. యూత్ కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతికంగా ఎంతలా దిగజారిపోయిందో చెప్పడానికి ఈ మురికి రాజకీయాలే నిదర్శనమంటూ మండిపడ్డారు.
"విదేశీ అతిథుల ఎదుట నగ్నంగా నిలబడి దేశ పరువు తీశారు. అసలు మీ నిజస్వరూపం ఏంటో దేశ ప్రజలందరికీ ఎప్పుడో తెలుసు.. దాన్ని చూపించడానికి మీరు కొత్తగా బట్టలు విప్పుకోవాల్సిన అవసరం ఏముంది?" అని మోదీ చురకలంటించారు. అభివృద్ధిని ఓర్వలేకే కాంగ్రెస్ ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
ట్రంప్ డీల్ చిచ్చు.. అరెస్టుల పర్వం
భారత మండపంలో సదస్సు జరుగుతుండగా.. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఫొటోలతో ఉన్న టీ-షర్టులు వేసుకుని యూత్ కాంగ్రెస్ నేతలు లోపలికి చొచ్చుకొచ్చారు. భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌ను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ట్రంప్ బెదిరింపులకు మోదీ భయపడ్డారని ఆరోపిస్తూ టీ-షర్టులు విప్పేసి అర్ధనగ్నంగా హల్ చల్ చేశారు.
భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగిన యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రెటరీ కృష్ణ హరి, బిహార్ సెక్రెటరీ కుందన్ యాదవ్, యూపీ ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్, జాతీయ సమన్వయకర్త నరసింహ యాదవ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇండియా కూటమిలోనే కాంగ్రెస్‌కు షాక్!
ఈ నిరసనను అడ్డుకోవాల్సింది పోయి కాంగ్రెస్ అధిష్టానం వెనకేసుకురావడం దురదృష్టకరమని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, కాంగ్రెస్ మిత్రపక్షం సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) మాత్రం ఈ ఘటనను తీవ్రంగా తప్పుబట్టారు. ఇది దేశానికే అవమానమని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా అఖిలేష్‌తో పాటు నిరసనను ఖండించిన ఇండియా కూటమి నేతలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు.
ఇంటి గుట్టు రచ్చకెక్కడం డెమోక్రసీ కాదు!
ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది. కానీ వేదిక ఏదన్నది ముఖ్యం. ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తున్నప్పుడు, టెక్నాలజీ పెట్టుబడుల కోసం సదస్సులు నిర్వహిస్తున్నప్పుడు.. అక్కడకెళ్లి బట్టలు విప్పడం వల్ల మోదీకి జరిగే నష్టం కంటే, ఇంటర్నేషనల్ బ్రాండ్‌గా ఇండియాకు జరిగే డ్యామేజ్ ఎక్కువ. ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనలకు, దేశ ప్రతిష్టను దిగజార్చే చర్యలకు మధ్య ఉన్న గీతను రాజకీయ నాయకులు చెరిపేయకూడదు.

