పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు.. కానీ ఈ రోజుల్లో అది మూణ్ణాళ్ల ముచ్చటగా మారుతోంది. అయితే, 58 ఏళ్లు కాపురం చేశాక.. కాటికెళ్లే వయసులో "నాకు విడాకులు కావాలి" అంటే కోర్టు ఊరుకుంటుందా? రాజస్థాన్ హైకోర్టు (Rajasthan High Court) ఒక వృద్ధ జంటకు గట్టి షాక్ ఇచ్చింది. ఆస్తి కోసం గొడవపడి విడిపోతామంటే కుదరదని తేల్చి చెప్పింది. అసలు 1967లో పెళ్లి చేసుకున్న ఆ దంపతుల మధ్య ఇన్నాళ్లకు చిచ్చు పెట్టింది ఎవరు? వరకట్న కేసు పెట్టే వరకు గొడవ ఎందుకు వెళ్లింది?
46 ఏళ్లు అన్యోన్యం.. ఆస్తి కోసం రచ్చ!
ఈ దంపతుల కథ వింటే ఆశ్చర్యం వేస్తుంది. 1967 జూన్ 29న వీరికి పెళ్లయింది. దాదాపు 46 ఏళ్ల పాటు (2013 వరకు) ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉన్నారు. కానీ 2014లో 'ఆస్తి' అనే దెయ్యం వీరి మధ్య ప్రవేశించింది.
గొడవ ఏంటి?: ఉన్న ఆస్తిని మొత్తం పెద్ద కొడుకు పేరు మీదే రాయాలని భార్య పట్టుబట్టింది.
భర్త వాదన: ఇద్దరు కొడుకులకు సమానంగా పంచాలని భర్త అన్నాడు. ఈ చిన్న పాయింట్ పెద్ద రచ్చగా మారి.. ఒకరిపై ఒకరు అక్రమ సంబంధాల ఆరోపణలు చేసుకునే స్థాయికి దిగజారింది.
ఈ వయసులో వరకట్న కేసా?
భార్య తనపై కక్షతో ఏకంగా 'వరకట్న వేధింపుల' కేసు పెట్టిందని, సమాజంలో తన పరువు తీసిందని భర్త కోర్టు మెట్లెక్కారు. ఈ టార్చర్ భరించలేనని విడాకులు ఇప్పించాలని కోరారు. భరత్‌పూర్ ఫ్యామిలీ కోర్టు కుదరదు పొమ్మనడంతో.. ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
సహనం పెరగాలి.. తగ్గకూడదు!
పిటిషన్ విన్న హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది.
ఆస్తి తగాదాలు, చిన్నపాటి గొడవలను 'క్రూరత్వం' (Cruelty)గా పరిగణించలేం.
ఐదు దశాబ్దాలు కలిసి ఉన్న బంధం ఇది. వయసు పెరిగే కొద్దీ దంపతుల్లో ఒకరిపై ఒకరికి అవగాహన, సహనం పెరగాలి కానీ తగ్గకూడదు.
ఈ వయసులో విడాకులు ఇస్తే.. అది కేవలం ఆ దంపతులకే కాదు, మొత్తం కుటుంబ గౌరవానికి మచ్చ తెస్తుంది. పిల్లల ఆస్తి కోసం తల్లిదండ్రులు విడిపోవడం సరికాదని హితవు పలికింది.
పిల్లల కోసం పేరెంట్స్ బలి కావొద్దు!
కొడుకుల ఆస్తి పంపకాల కోసం.. జీవిత చరమాంకంలో తోడుగా ఉండాల్సిన భార్యాభర్తలు కోర్టుల చుట్టూ తిరగడం విషాదం. ఆస్తి ముఖ్యం కాదు.. అనుబంధం ముఖ్యం అని ఈ తీర్పు గుర్తుచేస్తోంది.

