ఈజీ జాబ్స్ ఇక రావు.. ఐఐటీ స్టూడెంట్స్‌కు చేదు వార్త! రమేశ్ దమానీ వార్నింగ్.. ఆంథ్రోపిక్ లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్!
క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో జాబ్ కొట్టేసి లైఫ్ సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పుణ్యమా అని 'ఈజీ జాబ్స్' కాలం చెల్లిపోయిందని మార్కెట్ నిపుణుడు రమేశ్ దమానీ (Ramesh Damani) బాంబ్ పేల్చారు. ఆంథ్రోపిక్ వంటి ఏఐ కంపెనీల దాటికి ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు గాల్లో దీపంలా మారాయని హెచ్చరించారు. అసలు ఐటీ రంగంలో ఏం జరుగుతోంది? 16 లక్షల మంది చేసే పనిని 2 వేల మంది ఎలా చేస్తున్నారు?
ఫ్రెషర్స్ గెట్ రెడీ.. ఆ కాలం పోయింది!
ఐఐటీలు, ఇతర టెక్ ఇన్‌స్టిట్యూట్ల నుంచి వచ్చే ఫ్రెషర్లకు ఇది నిజంగా కంటి మీద కునుకు లేకుండా చేసే వార్తే. గతంలోలాగా క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో సులభంగా ఉద్యోగాలు దొరికే రోజులు ఇక పోయాయని దమానీ స్పష్టం చేశారు. ముఖ్యంగా 'ఏజెంటిక్ ఏఐ' (Agentic AI) రాకతో ఈ మార్పు చాలా వేగంగా జరుగుతోంది. ఫ్రెషర్స్ చేసే కోడింగ్, డేటా ఎంట్రీ వంటి పనులను ఏఐ చిటికెలో చేసేస్తుంటే.. కంపెనీలు కొత్తవాళ్లను ఎందుకు తీసుకుంటాయన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న
16 లక్షల మంది vs 2 వేల మంది.. షాకింగ్ నిజం
దమానీ చెప్పిన లెక్కలు వింటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. మన దేశంలోని టాప్-7 సాఫ్ట్‌వేర్ కంపెనీల మొత్తం విలువ సుమారు 350 బిలియన్ డాలర్లు. అక్కడ పనిచేసేది ఏకంగా 16 లక్షల మంది ఉద్యోగులు. కానీ కేవలం 2 వేల మంది ఉద్యోగులు ఉన్న 'ఆంథ్రోపిక్' (Anthropic) అనే ఒక్క ఏఐ కంపెనీ విలువ కూడా 350 బిలియన్ డాలర్లే. అంటే మనుషుల సంఖ్యతో పనిలేకుండా.. టెక్నాలజీతోనే సంపద సృష్టి జరుగుతోంది. అందుకే పెద్ద కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడానికి ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. గతేడాది అమెరికాలో 55 వేల మంది ఉద్యోగాలు కోల్పోవడమే ఇందుకు నిదర్శనం.
భయం వద్దు.. కొత్త దారులు వెతుక్కోవాలి
అయితే అంత మాత్రాన భయపడిపోవాల్సిన పనిలేదని, ఐటీ రంగం అంతరించిపోదని దమానీ భరోసా ఇచ్చారు. పాత ఉద్యోగాలు పోతే.. కొత్త రకం ఉద్యోగాలు పుట్టుకొస్తాయని తెలిపారు. ఉదాహరణకు 1980ల్లో 'యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్' అనే జాబ్ ఉంటుందని ఎవరైనా ఊహించారా? ఇప్పుడు అది కోట్లు కురిపించే కెరీర్. అలాగే ఏఐ వల్ల కూడా మనకు తెలియని ఎన్నో కొత్త అవకాశాలు వస్తాయని, కాకపోతే దానికి తగ్గట్టుగా స్కిల్స్ పెంచుకోవాలని ఆయన సూచించారు.
డిగ్రీ ఉంటే సరిపోదు.. స్కిల్ ఉంటేనే జాబ్!
కాలం మారుతోంది.. మనుషులు మారాలి. ఏఐని భయంగా కాకుండా, ఒక అవకాశంగా చూస్తేనే భవిష్యత్తు ఉంటుంది. లేదంటే ఆంథ్రోపిక్ లాంటి టూల్స్ మన సీటు లాగేసుకోవడం ఖాయం.

