ఒక పసిప్రాణాన్ని కాపాడేందుకు సగటు జీవి తన జేబులోంచి వంద, వెయ్యి అంటూ చందాలు వేస్తుంటే.. అదే ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించిన రూ.270 కోట్ల ప్రభుత్వ నిధులు మాత్రం ఫైళ్ల మధ్య మురిగిపోతున్నాయి. 'సేవ్ పునర్విక' (Save Punarvika) పేరుతో సోషల్ మీడియా హోరెత్తుతున్న వేళ.. ఆర్టీఐ (RTI) ద్వారా బయటపడిన ఈ పచ్చి నిజం ప్రతి పౌరుడినీ ఆలోచింపజేస్తోంది. సిస్టమ్ లోని డొల్లతనం వల్లే ఆ చిన్నారి తల్లిదండ్రులు రోడ్డెక్కి అడుక్కోవాల్సి వస్తోందా?
రూ.16 కోట్ల ఇంజెక్షన్.. జనాల చందాలు
అరుదైన 'స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ' (SMA) వ్యాధితో బాధపడుతున్న పునర్విక శ్రీ అనే చిన్నారి ప్రాణాలు నిలవాలంటే 'జోల్‌జెన్‌స్మా' (Zolgensma) అనే జన్యు చికిత్స ఇంజెక్షన్ కావాలి. దీని ధర అక్షరాలా రూ.16 కోట్లు!
ఇంత భారీ మొత్తం సామాన్యులకు అసాధ్యం కాబట్టి, పాపను బతికించుకోవడానికి ఇన్‌ఫ్లుయెన్సర్లు, ప్రజలు సోషల్ మీడియా ద్వారా, రోడ్ల మీదకు వచ్చి మరీ నిధులు సేకరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ పెద్ద మనసు చాటుకుంటూ విరాళాలు అందిస్తున్నారు.
మురిగిపోతున్న రూ.270 కోట్లు!
సరిగ్గా ఇక్కడే ఒక చేదు నిజం బయటపడింది. 'నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్' (NPRD) కింద అరుదైన వ్యాధులతో బాధపడే చిన్నారుల కోసం కేంద్రం ఏటా నిధులు కేటాయిస్తుంది. 2025-26 బడ్జెట్‌లో ఇందుకోసం రూ.300 కోట్లు కేటాయించింది.
కానీ, గతేడాది డిసెంబర్ నాటికి కేవలం రూ.30 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. మిగతా రూ.270 కోట్లు ప్రభుత్వ ఖాతాల్లోనే మూలుగుతున్నాయి. మార్చి 31లోగా ఈ నిధులను ఖర్చు చేయకపోతే, ఆర్థిక సంవత్సరం ముగిసిపోయి ఆ డబ్బు మురిగిపోయే ప్రమాదం (Lapse) పొంచి ఉందని ఓ సామాజిక కార్యకర్త వేసిన ఆర్టీఐ ద్వారా తెలిసింది.
ప్రాణాలు తీస్తున్న '50 లక్షల' రూల్
నిధులు ఉన్నా చిన్నారులకు ఎందుకు అందడం లేదంటే.. దానికి కారణం ప్రభుత్వ నిబంధనలే. అరుదైన వ్యాధికి గరిష్టంగా రూ.50 లక్షలు మాత్రమే సాయం చేయాలనే రూల్ ఉంది. 16 కోట్లు ఖర్చయ్యే జబ్బుకు 50 లక్షలు ఇస్తే ప్రాణాలు ఎలా నిలుస్తాయి?
దీనికి తోడు నిమ్స్ (NIMS) లాంటి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లో పేరు నమోదు చేసుకుని, కమిటీలు రిపోర్టులు పంపి, ఆ తర్వాత కేంద్రం డబ్బులు ఇచ్చేసరికి పుణ్యకాలం కాస్తా తీరిపోతోంది. అందుకే ఎంపీ శశిథరూర్ లాంటి నేతలు ఈ ఖర్చు పరిమితి నిబంధనలను తక్షణమే సవరించాలని కేంద్రాన్ని కోరుతున్నారు. కొందరు పేరెంట్స్ ఏకంగా కోర్టులనే ఆశ్రయించారు.
చందాలు కాదు.. చట్టాలు మారాలి!
నిధులు లేకపోవడం దౌర్భాగ్యం అయితే.. ఉండి కూడా సరైన టైమ్‌కి వాడలేకపోవడం సిస్టమ్ వైఫల్యం! పునర్విక లాంటి వందలాది చిన్నారుల ప్రాణాలు గాల్లో దీపాల్లా ఉన్నప్పుడు ఆ రూ.50 లక్షల క్యాప్ (Cap) ఎత్తివేయాలి. మురిగిపోతున్న 270 కోట్లను ఇలాంటి ఎమర్జెన్సీ కేసులకు వెంటనే మళ్లించాలి. అప్పుడే పన్నులు కడుతున్న సామాన్యుడికి ఈ వ్యవస్థపై నమ్మకం కలుగుతుంది.

