Cyber Crime Targets Telangana: ప్రైవేట్ ఉద్యోగులే టార్గెట్

naveen
By -

Cyber Crime Targets Telangana

Cyber Crime Victims Report: మీకు ఇంగ్లీష్ వచ్చా? స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే మీరే ఫస్ట్ టార్గెట్!


సాధారణంగా మోసపోయేది ఎవరు? చదువురాని వారు, టెక్నాలజీ తెలియని వృద్ధులు అని మనం అనుకుంటాం. కానీ, ఈ అపోహను తెలంగాణ సైబర్ క్రైమ్ రిపోర్ట్ పటాపంచలు చేసింది. సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు టార్గెట్ చేసింది అమాయకులను కాదు.. అంతో ఇంతో ఇంగ్లీష్ వచ్చి, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండి, ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేవారినే! ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే వీరి ప్రధాన ఆహారం. చదువుకున్న వాళ్లే ఎందుకు బకరాలు అవుతున్నారు? టెక్నాలజీ తెలిసినా ఎందుకు బోల్తా పడుతున్నారు?


ప్రైవేట్ ఉద్యోగులే నంబర్ వన్.. 11 వేల మంది బాధితులు!

గత ఏడాది తెలంగాణలో నమోదైన సైబర్ కేసులను పరిశీలిస్తే ఒక షాకింగ్ నిజం బయటపడింది. అత్యధికంగా 11,252 మంది ప్రైవేట్ ఉద్యోగులే (Private Employees) సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. దీనికి ప్రధాన కారణం రెండు భావోద్వేగాలు. ఒకటి 'భయం', రెండు 'ఆశ'.

  • ఆశ: బొటాబొటీ జీతాలతో బతికే ప్రైవేట్ ఉద్యోగులు.. పార్ట్ టైమ్ జాబ్ అనో, అధిక రాబడి వస్తుందనో ఆశపడి లింకులు క్లిక్ చేస్తున్నారు.

  • భయం: "మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయ్యింది, కేవైసీ అప్డేట్ చేయకపోతే జీతం పడదు" అనగానే కంగారుపడి ఓటీపీలు చెప్పేస్తున్నారు. ఫోన్ వాడటం వచ్చినా, సైబర్ నేరాల తీరుపై అవగాహన లేకపోవడమే వీరి కొంపముంచుతోంది.


సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు కూడా టోకరా

ఇక్కడ అసలైన విచిత్రం ఏంటంటే.. టెక్నాలజీని అన్నంలా తినే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు (Software Employees) కూడా ఈ ఉచ్చులో పడుతున్నారు. వీరికి డిజిటల్ లావాదేవీలు ఎక్కువ. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఆన్‌లైన్ షాపింగ్స్ విపరీతంగా వాడతారు. ఈ 'డిజిటల్ ఫుట్‌ప్రింట్' ఎక్కవగా ఉండటమే నేరగాళ్లకు ప్లస్ పాయింట్ అవుతోంది. టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నా.. ఎమోషనల్ గా వీరు ఈజీగా ట్రాప్ అవుతున్నారు.


వ్యాపారులు, గృహిణులు, విద్యార్థులు.. అందరూ లైన్లో!

  • వ్యాపారులు: నిత్యం లక్షల లావాదేవీలు జరుపుతారు కాబట్టి, అధిక లాభాల పేరుతో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ (Investment Frauds) లో ఇరుక్కుంటున్నారు.

  • గృహిణులు: "ఇంట్లో కూర్చునే సంపాదించవచ్చు" అనే వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్స్ కు బలవుతున్నారు.

  • విద్యార్థులు: పాకెట్ మనీ కోసం, వడ్డీ లేని రుణాల కోసం క్లిక్ చేసి మోసపోతున్నారు.


ముసలి వాళ్లే సేఫ్ గురూ!

అందరూ మోసపోతుంటే.. సేఫ్ గా ఉన్నది మాత్రం వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులే. వీరికి మొబైల్ వాడకం తక్కువ. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ పెద్దగా చేయరు. పెద్దగా ఆశపడరు. అందుకే సైబర్ నేరగాళ్లు వీరి జోలికి వెళ్లడం లేదు. దోచుకోవడానికి అవకాశం ఉన్నవారిపైనే వల విసురుతున్నారు.


మీ అత్యాశే వాడి పెట్టుబడి! 

సైబర్ నేరగాడికి మీ పిన్ నంబర్ తెలియదు.. కానీ మీ 'బలహీనత' తెలుసు. అది భయం కావచ్చు, డబ్బు మీద ఆశ కావచ్చు. ఉచితంగా ఏదీ రాదు.. బ్యాంకు వాళ్ళు ఫోన్లో ఓటీపీ అడగరు. ఈ రెండు సూత్రాలు పాటిస్తే మీరు సేఫ్.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!