ఆంథ్రోపిక్ ఏఐ దెబ్బ: కుప్పకూలిన భారత ఐటీ షేర్లు, ఉద్యోగాలకు ఎసరు?

naveen
By -

ఐటీ ఉద్యోగులకు గుండెల్లో రైళ్లు పరిగెట్టించే వార్త ఇది. కృత్రిమ మేధ (AI) కేవలం సహాయకారిగా ఉంటుందనుకుంటే పొరపాటే.. అది ఇప్పుడు ఏకంగా మన ఉద్యోగాలనే రీప్లేస్ చేసే స్థాయికి వచ్చేసింది. అమెరికాకు చెందిన 'ఆంథ్రోపిక్' అనే సంస్థ రిలీజ్ చేసిన ఒక్క ఏఐ టూల్ దెబ్బకు భారత ఐటీ దిగ్గజాలు వణికిపోయాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ కంపెనీల షేర్లు పేకమేడలా కుప్పకూలాయి. అసలు ఆ టూల్ ఏం చేస్తుంది? మన ఐటీ కంపెనీలకు ఎందుకు అంత భయం? ఫ్రెషర్స్ పరిస్థితి ఇక అగమ్యగోచరమేనా?


Anthropic's new AI tool 'Claude Cowork'


చాట్‌బాట్ కాదు.. ఇది మీ కొత్త టీమ్‌మేట్!

'క్లాడ్' (Claude) చాట్‌బాట్ సృష్టికర్త ఆంథ్రోపిక్ సంస్థ తాజాగా టెక్ ప్రపంచంలో ఒక బాంబ్ పేల్చింది. 'క్లాడ్ కోవర్క్ ఏజెంట్' పేరుతో కొన్ని ఓపెన్ సోర్స్ ప్లగ్-ఇన్లను విడుదల చేసింది. ఇప్పటివరకు మనం చూసిన చాట్‌బాట్లు కేవలం మనం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే ఇచ్చేవి. కానీ ఈ కొత్త టూల్ అలా కాదు. ఇది ఒక మనిషిలా, మీ ఆఫీసులో పక్క సీట్లో కూర్చునే కొలీగ్‌లా పని చేస్తుంది. మీ కంప్యూటర్ ని అదే ఆపరేట్ చేస్తుంది. ఫైల్స్ ఓపెన్ చేయడం, చదవడం, ఎడిట్ చేయడం, కొత్త ఫోల్డర్లు క్రియేట్ చేయడం, నోట్స్ రాసి దాన్ని రిపోర్టుగా మార్చడం.. ఇలా ఒక ఉద్యోగి చేసే పనులన్నీ చిటికెలో చేసేస్తుంది.


లీగల్ నుంచి కోడింగ్ దాకా.. అన్నింటికీ ఇదే బాస్

ఈ టూల్ సామర్థ్యం చూస్తే మతిపోవాల్సిందే. లీగల్, సేల్స్, మార్కెటింగ్, డేటా అనాలిసిస్, ఫైనాన్స్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ ఇలా అన్ని రంగాల్లోనూ ఇది దూసుకుపోనుంది. ఉదాహరణకు ఒక లాయర్ చేయాల్సిన డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఒక అనలిస్ట్ చేయాల్సిన డేటా విశ్లేషణ, ఒక టెస్టర్ చేయాల్సిన బగ్ టెస్టింగ్.. ఇవన్నీ ఈ ఏఐ టూల్ ఆటోమేటిక్ గా చేసేస్తుంది. రచయితలు, జర్నలిస్టులు, విద్యార్థులు, ఆఫీసు ఉద్యోగులు ఎవరైనా సరే.. తమ రొటీన్ పనులను దీనికి అప్పజెప్పేయొచ్చు. అంటే మనిషి అవసరం లేకుండానే పనులు జరిగిపోతాయన్నమాట.


భారత ఐటీ రంగానికి ఎందుకు దడ?

సాధారణంగా అమెరికా, యూరప్ దేశాల్లోని బడా కంపెనీలు డాక్యుమెంట్ వెరిఫికేషన్, డేటా ఎంట్రీ, డేటా అనాలిసిస్, కోడింగ్, టెస్టింగ్ వంటి పనులను భారతీయ ఐటీ కంపెనీలకు ఔట్‌సోర్సింగ్ ఇస్తుంటాయి. దీనివల్లే మన దేశంలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆంథ్రోపిక్ టూల్ రాకతో ఆ పనులన్నీ ఏఐ చేసేస్తే.. ఇక ప్రాజెక్టులు ఇండియాకు ఎందుకు వస్తాయి? ఇదే భయం ఇప్పుడు ఇన్వెస్టర్లను వెంటాడుతోంది. అందుకే ఈ వార్త రాగానే ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా షేర్లు దాదాపు 7 శాతం వరకు పతనం అయ్యాయి.


'సాస్పోకాలిప్స్' వచ్చేసింది.. ఫ్రెషర్స్ బీ అలర్ట్!

టెక్ నిపుణులు ఈ పరిస్థితిని 'సాస్పోకాలిప్స్' (SaaSpocalypse) అని పిలుస్తున్నారు. అంటే సాఫ్ట్‌వేర్ సేవల కంపెనీలకు ఇది ప్రళయం లాంటిది. ఇప్పటివరకు కంపెనీలకు ఏఐ సాయం చేస్తుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏఐనే కంపెనీలను భర్తీ చేస్తుందనే ఆందోళన మొదలైంది. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు, టెస్టింగ్, బేసిక్ కోడింగ్ జాబ్స్ ప్రమాదంలో పడే అవకాశముంది. సాఫ్ట్‌వేర్ రంగంలో పోటీతత్వం పూర్తిగా మారిపోబోతోంది. మనుషులు చేసే పనిని సాఫ్ట్‌వేరే చేస్తే.. ఇక జీతాలిచ్చి మనుషులెందుకు అనే ప్రశ్న భవిష్యత్తులో గట్టిగా వినిపించనుంది.


నిద్రలేవండి.. లేదంటే రీప్లేస్ అయిపోతారు! 

ఇది కేవలం ఒక టూల్ విడుదల మాత్రమే కాదు.. రాబోయే సునామీకి హెచ్చరిక. రొటీన్ పనులు చేసే ఉద్యోగాలకు కాలం చెల్లింది. ఏఐ చేయలేని కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటేనే ఐటీలో మనుగడ సాధ్యం.


Tags: