Trade War End: పన్నులు సున్నా.. అమెరికాకు రెడ్ కార్పెట్.. కానీ రైతుల విషయంలో మాత్రం కండిషన్స్ అప్లై!

naveen
By -

మీరు అమెరికా బ్రాండ్ వస్తువులు, ఎలక్ట్రానిక్స్ లేదా విదేశీ వైన్ కొనాలంటే పన్నుల మోత మోగిపోయేది కదా? ఇకపై ఆ బాధ ఉండకపోవచ్చు. భారత్, అమెరికా మధ్య కుదిరిన ఒక చారిత్రక ఒప్పందం మార్కెట్ రూపురేఖలను మార్చబోతోంది. అమెరికా నుంచి వచ్చే పారిశ్రామిక ఉత్పత్తులపై పన్నులు దాదాపు 'సున్నా' కాబోతున్నాయి. ఇది వినడానికి బాగున్నా.. దీని వెనుక ఒక భారీ రాజకీయ మలుపు ఉంది. ఇన్నాళ్లు మనకు చౌకగా ఆయిల్ ఇచ్చిన రష్యాకు భారత్ టాటా చెప్పేసింది. అసలు ఈ డీల్ వల్ల సామాన్యుడి జేబుకు లాభమా? అమెరికా ఎందుకు ఇంత పండగ చేసుకుంటోంది?


India and US sign historic trade deal eliminating tariffs on industrial goods and shifting oil imports from Russia to Venezuela


పన్నుల్లేవ్.. వస్తువులు చౌక!

ఈ ఒప్పందం అమెరికాకు భారీ విజయం అని ఆ దేశ వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్ సంబరపడుతున్నారు. ఇన్నాళ్లు అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులపై భారత్ లో సగటున 13.5 శాతం దిగుమతి సుంకం ఉండేది. తాజా డీల్ ప్రకారం ఇది దాదాపు సున్నా శాతానికి తగ్గిపోనుంది. కేవలం పారిశ్రామిక వస్తువులే కాదు.. అమెరికా నుంచి వచ్చే గింజలు, వైన్, స్పిరిట్స్ (మద్యం), పండ్లు, కూరగాయలపైన కూడా సుంకాలు జీరో కాబోతున్నాయి. అంటే ఇకపై అమెరికా ఆపిల్స్, ఆల్మండ్స్, బ్రాండెడ్ వైన్స్ మన మార్కెట్ లో చాలా తక్కువ ధరకే లభించే అవకాశముంది. వాణిజ్య లోటును తగ్గించుకోవడానికి అమెరికా వేసిన ఈ ఎత్తుగడ ఫలించింది.


రైతుల జోలికొస్తే ఒప్పుకోం

అమెరికా ఉత్పత్తులకు రెడ్ కార్పెట్ పరిచిన భారత్.. వ్యవసాయ రంగం విషయంలో మాత్రం ఆచితూచి అడుగులేస్తోంది. మన రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే ఏ ఒప్పందానికి సిద్ధంగా లేమని తేల్చిచెప్పింది. అందుకే వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై పూర్తి మినహాయింపులు ఇవ్వలేదు. కొన్ని సున్నితమైన వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ తన నియంత్రణను కొనసాగిస్తుందని, వేటిని అనుమతించాలి, వేటిని ఆపాలి అనే దానిపై ఇరు దేశాలు కలిసి నిర్ణయం తీసుకుంటాయని గ్రీర్ వెల్లడించారు. అంటే వ్యవసాయ రంగంలో అమెరికాకు ఇంకా పూర్తిగా తలుపులు తెరుచుకోలేదన్నమాట.


రష్యా అవుట్.. వెనెజువెలా ఇన్!

ఈ మొత్తం ఎపిసోడ్ లో అతిపెద్ద ట్విస్ట్ రష్యా ఆయిల్ వ్యవహారం. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి చౌకగా ఆయిల్ కొన్న భారత్.. ఇప్పుడు అమెరికాతో డీల్ కోసం మాస్కోకు షాక్ ఇచ్చింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపేస్తామని హామీ ఇచ్చింది. దానికి ప్రత్యామ్నాయంగా అమెరికా, వెనెజువెలాల నుంచి ముడిచమురు దిగుమతి చేసుకుంటామని మాటిచ్చింది. ఇది అమెరికా సాధించిన అతిపెద్ద దౌత్య విజయంగా వైట్‌హౌస్ వర్ణించింది. అంతేకాదు, అమెరికాలోని పలు రంగాల్లో భారత్ ఏకంగా 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి కూడా అంగీకరించడం విశేషం.


వినియోగదారుడికి పండగ.. వ్యూహాత్మకంగా పరీక్ష! 

అమెరికా వస్తువులు చౌకగా దొరకడం వినియోగదారులకు గుడ్ న్యూసే. కానీ ఇన్నాళ్లు నమ్మకమైన మిత్రదేశంగా ఉన్న రష్యాను కాదని, ఎనర్జీ కోసం అమెరికా, వెనెజువెలాపై ఆధారపడటం దీర్ఘకాలంలో మన విదేశాంగ విధానానికి ఒక సవాలుగా మారొచ్చు.