రేపే ఆఖరి తేదీ.. ప్రపంచం నెత్తి మీద 'అణు' బాంబు! పుతిన్ ఆఫర్ రెడీ.. ట్రంప్ ఎందుకు సైలెంట్?
ప్రపంచం ఇప్పుడు ఒక టైమ్ బాంబ్ మీద కూర్చుంది. ఆ బాంబ్ పేలడానికి ఇక మిగిలింది కేవలం కొన్ని గంటలు మాత్రమే. అమెరికా, రష్యా మధ్య అణ్వాయుధాలను నియంత్రించే 'న్యూ స్టార్ట్' (New START) ఒప్పందం ఫిబ్రవరి 5తో, అంటే రేపటితో ముగియనుంది. ఈ గడువు దాటితే.. ఇక ఎవరి దగ్గర ఎన్ని అణు బాంబులు ఉన్నాయో, ఎవరు ఎన్ని తయారు చేస్తున్నారో అడిగే నాథుడే ఉండడు. ప్రపంచాన్ని భస్మం చేయగల బాంబుల మీద ఇన్నాళ్లు ఉన్న కళ్లెం తెగిపోనుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ "మేం మరో ఏడాది పొడిగించడానికి రెడీ" అని ఆఫర్ ఇచ్చినా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం మౌనం వహిస్తున్నారు. ఈ నిశ్శబ్దం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? రాబోయే 24 గంటల్లో ఏం జరగబోతోంది?
ట్రంప్ చేతిలో ప్రపంచ భవిష్యత్తు
ఫిబ్రవరి 5 తర్వాత ప్రపంచ ముఖచిత్రం మారిపోయే ప్రమాదం ఉంది. అణ్వాయుధ నిల్వలపై పరిమితులు విధించే ఈ కీలక ఒప్పందం గడువు రేపటితో తీరిపోతుంది. అయితే ఈ డెడ్‌లైన్‌కు ముందే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక మెట్టు దిగివచ్చారు. అమెరికా గనక ముందుకు వస్తే, ఈ ఒప్పందాన్ని యథాతథంగా మరో ఏడాది పాటు కొనసాగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కానీ ట్రంప్ యంత్రాంగం నుంచి దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. సరైన సమయంలో ట్రంప్ నిర్ణయం తీసుకుంటారని వైట్‌హౌస్ వర్గాలు చెబుతున్నా, గంటలు గడుస్తున్న కొద్దీ ప్రపంచదేశాల్లో ఆందోళన పెరుగుతోంది. ఒకవేళ ట్రంప్ నో చెబితే, 35 ఏళ్లలో తొలిసారిగా అణ్వాయుధాల మీద ఎలాంటి నియంత్రణ లేని ప్రమాదకర స్థితిలోకి ప్రపంచం వెళ్తుంది.
చరిత్రలో నిలిచిపోయిన ఒప్పందం.. ఇప్పుడు డేంజర్ జోన్లో!
అసలు ఈ కథ 1972లోనే మొదలైంది. అప్పటి అమెరికా, సోవియట్ యూనియన్ అధ్యక్షులు అణ్వాయుధాల తగ్గింపు కోసం తొలిసారి చేతులు కలిపారు. ఆ తర్వాత 2010లో ఒబామా, మెద్వెదెవ్‌ల హయాంలో 'న్యూ స్టార్ట్' ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఏ దేశమూ 700కు మించి క్షిపణులను, 1550కి మించి అణ్వస్త్రాలను వినియోగానికి సిద్ధంగా ఉంచకూడదు. అంతేకాదు, ఒకరి అణు కేంద్రాలను మరొకరు తనిఖీ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. 2021లో ముగియాల్సిన ఈ ఒప్పందాన్ని అప్పట్లో ఐదేళ్లు పొడిగించారు. ఇప్పుడు ఆ గడువు కూడా తీరిపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.
ఉక్రెయిన్ యుద్ధం.. పుతిన్ హెచ్చరికలు
ప్రస్తుత పరిస్థితిని మరింత జఠిలం చేస్తున్న అంశం ఉక్రెయిన్ యుద్ధం. రష్యా తన జాతీయ ప్రయోజనాల కోసం అణ్వాయుధాలను వాడటానికి కూడా వెనుకాడబోమని పుతిన్ పదేపదే హెచ్చరిస్తున్నారు. 2024లో దీనికి సంబంధించిన ఒక ఆర్డర్ పై ఆయన సంతకం కూడా చేశారు. ఇప్పుడు నియంత్రణ ఒప్పందం కూడా లేకపోతే రష్యాను ఆపడం కష్టమని నిపుణులు భయపడుతున్నారు. పరిమితులు లేని అణు ప్రపంచం అత్యంత ప్రమాదకరంగా మారుతుందని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ హెచ్చరించగా, ఒప్పందం లేకపోతే అణ్వాయుధ విస్తరణ భారీగా పెరుగుతుందని అమెరికా ఆర్మ్స్ కంట్రోల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఇది ఆధిపత్య పోరు కాదు.. మనుగడ ప్రశ్న!
అణ్వాయుధ పోటీ (Arms Race) మొదలైతే అందులో గెలిచేవారెవరూ ఉండరు, అంతా ఓడిపోవడమే ఉంటుంది. ట్రంప్ మౌనం వ్యూహాత్మకమే కావచ్చు, కానీ అది వికటిస్తే మూల్యం చెల్లించుకోవాల్సింది మొత్తం మానవాళే. రేపటి రోజు చరిత్రలో బ్లాక్ డే గా మిగిలిపోకూడదని కోరుకుందాం.

