India vs USA T20 World Cup: అమెరికా జెర్సీలో మనోళ్లే! నంద్యాల కుర్రాడు సాయితేజ నుంచి ముంబైకర్స్ దాకా.. ఇది 'మినీ ఇండియా' టీమ్
టీ20 ప్రపంచకప్‌లో భారత్ గెలిచింది కానీ.. ఆ గెలుపు అంత ఈజీగా రాలేదు. అమెరికా గట్టి పోటీ ఇచ్చి భయపెట్టింది. ఇంతకీ ఆ టీమ్‌లో ఉన్నది ఎవరు? అచ్చమైన అమెరికన్లేనా? అంటే కానే కాదు! గ్రౌండ్లో మన జాతీయ గీతం పాడుతున్నప్పుడు అవతలి టీమ్‌లోని సగం మందికి కూడా ఆ పాట వచ్చు. ఎందుకంటే వాళ్లంతా మనోళ్లే. కర్నూలు కుర్రాడి నుంచి ఢిల్లీ డేర్‌డెవిల్స్ ప్లేయర్ దాకా.. అమెరికా జెర్సీలో ఉన్న మనోళ్ల చిట్టా చూస్తే ఆశ్చర్యపోతారు.
నంద్యాల టు న్యూయార్క్.. మన సాయితేజ!
అమెరికా టీమ్‌లో ఒక తెలుగు కుర్రాడు ఉన్నాడు. పేరు సాయితేజ ముక్కమల్ల (Saiteja Mukkamalla). చూస్తేనే మనోడని తెలిసిపోతుంది. సాయితేజ తండ్రి నాగేశ్వర్‌రెడ్డిది ఏపీలోని నంద్యాల జిల్లా, కోవెలకుంట్ల మండలం. తండ్రి ఉద్యోగం రీత్యా అమెరికా వెళ్లడంతో సాయితేజ అక్కడే పుట్టి పెరిగాడు. కానీ క్రికెట్ మాత్రం మన దగ్గరే నేర్చుకున్నాడు. ఏడాది పాటు హైదరాబాద్‌లోని వీవీఎస్ లక్ష్మణ్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. ఇప్పుడు అమెరికా టాప్ ఆర్డర్లో కీలక బ్యాటర్ ఇతనే.
రంజీ ప్లేయర్స్.. ఇప్పుడు అమెరికా స్టార్స్
మన దేశవాళీ క్రికెట్ లో పోటీ తట్టుకోలేక అమెరికా వలస వెళ్లి స్టార్లయిన వారు కూడా ఉన్నారు.
మిలింద్ కుమార్: ఢిల్లీకి చెందిన ఈ ఆల్ రౌండర్ గతంలో ఐపీఎల్ టీమ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ కు ఎంపికయ్యాడు. కానీ ఛాన్స్ రాలేదు. ఇప్పుడు అమెరికా టీమ్ లో ఉన్నాడు.
శుభమ్ రంజానే: మహారాష్ట్ర తరఫున రంజీలు ఆడిన ప్లేయర్. నాలుగేళ్ల క్రితం వరకు ఇక్కడే ఉన్నాడు.
మోనాంక్ పటేల్: ప్రస్తుత అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ ది గుజరాత్. అండర్-19 వరకు గుజరాత్ కే ఆడాడు.
ముంబైకర్స్ హవా.. కర్ణాటక రూట్స్
అమెరికా బౌలింగ్ దళం కూడా మనదే. స్పిన్ ఆల్ రౌండర్ హర్మీత్ సింగ్, ఫాస్ట్ బౌలర్ సౌరభ్ నేత్రావల్కర్ ఇద్దరూ ముంబై వాళ్లే. ఇక మిడిలార్డర్ బ్యాటర్ సంజయ్ కృష్ణమూర్తి పుట్టింది అమెరికాలోనే అయినా.. మూలాలు కర్ణాటకలో ఉన్నాయి. ఇతను కూడా అండర్-16లో కర్ణాటకకు ఆడాడు.
ఒక్కడంటే ఒక్కడు కూడా లోకల్ కాదు!
శనివారం భారత్ తో ఆడిన అమెరికా టీమ్ లో పక్కా లోకల్ అమెరికన్ ఒక్కరూ లేకపోవడం విశేషం. మిగిలిన వారిలో మోసిన్, అలీ ఖాన్ లు పాకిస్థాన్ కు చెందిన వారు కాగా.. బౌలర్ శాండ్లీ, ఆండ్రీస్ గాస్ లు దక్షిణాఫ్రికా నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయినవారే.
ప్రతిభకు హద్దులు లేవు!
అవకాశాల కోసం దేశం మారినా.. ఆటలో మనోళ్ల ముద్ర పోలేదు. ఇండియాపై ఇండియన్లే (ప్రవాసులు) పోటీ పడటం క్రికెట్ లోనే సాధ్యం.

