Vaibhav Suryavanshi U19 World Cup Final: 175 పరుగుల విధ్వంసం

naveen
By -

Vaibhav Suryavanshi U19 World Cup Final

Vaibhav Suryavanshi U19 World Cup Final: ఇంగ్లండ్‌పై వీర విహారం.. 175 రన్స్‌తో రికార్డుల మోత!


ప్రపంచకప్ ఫైనల్ అంటే ఒత్తిడి ఉంటుంది. కానీ భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మాత్రం అదొక ఆటవిడుపులా అనిపించింది. హరారే వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఏకంగా 175 పరుగులు బాది, టీమిండియాకు 411 పరుగుల భారీ స్కోరును అందించాడు. అసలు గ్రౌండ్ లో ఏం జరిగింది? వైభవ్ బ్యాట్ నుంచి వచ్చిన ఆ 15 సిక్సర్ల విధ్వంసం ఎలా సాగింది?


15 సిక్సర్లు.. 80 బంతుల్లోనే 175!

ఇంగ్లండ్ బౌలర్లకు పీడకలని మిగిల్చే ఇన్నింగ్స్ ఇది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్, ఆరంభంలోనే సెమీస్ హీరో ఆరోన్ జార్జ్ వికెట్ కోల్పోయింది. కానీ ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కేవలం 80 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, 15 భారీ సిక్సర్లతో 175 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 218.75 ఉందంటే విధ్వంసం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మైదానం నలువైపులా షాట్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.


కెప్టెన్ తోడు.. రికార్డు భాగస్వామ్యం

వైభవ్ కు కెప్టెన్ ఆయుష్ మాత్రే (Ayush Mhatre) చక్కటి సహకారం అందించాడు. ఆయుష్ 51 బంతుల్లో 53 పరుగులు చేయగా, వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు కేవలం 90 బంతుల్లోనే 142 పరుగులు జోడించారు. ఇంగ్లండ్ బౌలర్లు వికెట్ కోసం ముప్పుతిప్పలు పడ్డా.. వైభవ్ జోరు ముందు వారి ఎత్తులేవీ పారలేదు. ఆ తర్వాత వేదాంత్ త్రివేదితో కలిసి మూడో వికెట్‌కు మరో 89 పరుగులు జోడించి టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపాడు వైభవ్.


400 దాటించిన ఫినిషర్స్

వైభవ్ అవుటైన తర్వాత కూడా భారత జోరు తగ్గలేదు. వేదాంత్ త్రివేది (32), విహాన్ మల్హోత్రా (30) రాణించారు. ఇక చివర్లో వికెట్ కీపర్ అభిగ్యాన్ కుందు (40), కనిష్క్ చౌహాన్ (37 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో భారత స్కోరు 400 మార్కును దాటింది. చివరి 10 ఓవర్లలోనే టీమిండియా 100కు పైగా పరుగులు పిండుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసి ఫైనల్లో సరికొత్త రికార్డు సృష్టించింది.


బౌలర్ల విలవిల

ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ మింటో 3 వికెట్లు తీసినా 63 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యానీ లమ్స్‌డెన్ అయితే 8 ఓవర్లలోనే 81 పరుగులు ఇచ్చి అత్యంత ఖరీదైన బౌలర్ గా నిలిచాడు. ఫర్హాన్ అహ్మద్ కూడా 77 పరుగులు ఇచ్చాడు. ఏ దశలోనూ ఇంగ్లండ్ బౌలర్లు భారత బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు.


సగం కప్పు మనదే! 

ఫైనల్లో 411 పరుగులు అంటే ఆషామాషీ కాదు. ఇంగ్లండ్ ఈ కొండంత లక్ష్యాన్ని ఛేదించాలంటే అద్భుతం జరగాలి. వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోతుంది.


Tags:

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!