Supreme Court reprimands Prashant Kishor: జనం ఛీకొట్టినా బుద్ధి రాలేదా? పబ్లిసిటీ కోసం కోర్టును వాడుకోవద్దు!
రాజకీయ వ్యూహకర్తగా దేశంలోని బడా నేతలను గెలిపించిన ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor).. స్వయంగా పార్టీ పెట్టి బరిలోకి దిగితే మాత్రం బొక్కబోర్లా పడ్డారు. బీహార్ ఎన్నికల్లో ప్రజలు ఆయన 'జన్ సురాజ్'ను ఘోరంగా తిరస్కరించారు. అయితే, ఓటమిని అంగీకరించకుండా న్యాయపోరాటానికి దిగిన పీకేకు సుప్రీంకోర్టులో ఊహించని షాక్ తగిలింది. "ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్నారు.. అది క్లియర్ గా తెలుస్తోంది. ఇప్పుడు కోర్టును అడ్డం పెట్టుకుని పబ్లిసిటీ పొందాలనుకుంటున్నారా?" అంటూ భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పీకే కోర్టులో వేసిన పిటిషన్ ఏంటి? సీజేఐ ఎందుకంత సీరియస్ అయ్యారు?
'మీ డ్రామాలు ఇక్కడ వద్దు'.. సీజేఐ సీరియస్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలంటూ జన్ సురాజ్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పిటిషనర్ తరఫు లాయర్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. "బీహార్ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారనేది ఫలితాలు చూస్తేనే అర్థమవుతోంది. 238 సీట్లలో పోటీ చేస్తే ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ప్రజాతీర్పును గౌరవించాల్సింది పోయి.. ఈ కోర్టును మీ రాజకీయ ప్రచారం కోసం వాడుకుని లబ్ధి పొందాలని చూస్తున్నారా?" అంటూ మండిపడ్డారు.
అసలు ఆరోపణ ఏంటి? ఆ రూ.10 వేల కథేంటి?
బీహార్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్నది పీకే పార్టీ ప్రధాన ఆరోపణ. ఎన్నికల కోడ్ (Election Code) అమలులో ఉన్న సమయంలోనే.. అధికార జేడీయూ-బీజేపీ కూటమి ఓటర్లను ప్రలోభపెట్టిందని జన్ సురాజ్ ఆరోపించింది. 'సంక్షేమ పథకం' పేరుతో రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ఒక మహిళకు రూ.10 వేలు పంపిణీ చేశారని, ఈ డబ్బు ప్రభావంతోనే కూటమి ఘన విజయం సాధించిందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇది నిష్పక్షపాత ఎన్నికల సూత్రాలకు విరుద్ధమని, కాబట్టి ఆర్టికల్ 32 కింద జోక్యం చేసుకుని ఫలితాలను రద్దు చేయాలని కోరారు.
సుప్రీం కాదు.. హైకోర్టుకు వెళ్లండి!
అయితే, ఈ వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇది పబ్లిసిటీ స్టంట్ లా ఉందంటూనే.. ఈ పిటిషన్ ను బీహార్ హైకోర్టు (High Court)కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా ఉంటే అక్కడే తేల్చుకోవాలని సూచించింది. దేశమంతా తన వ్యూహాలతో చక్రం తిప్పిన పీకే.. సొంత రాష్ట్రంలో మాత్రం ప్రజల చేత, ఇప్పుడు కోర్టు చేత చీవాట్లు తినడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
వ్యూహాలు వేరు.. వాస్తవం వేరు!
రాజకీయాల్లో గెలవాలంటే ప్రజల నమ్మకం కావాలి తప్ప, కోర్టు కేసులు కాదని పీకేకు సుప్రీంకోర్టు గట్టిగానే చెప్పింది. ఈ దెబ్బతోనైనా పీకే రూట్ మారుస్తారా లేక న్యాయపోరాటం అంటూ హైకోర్టు మెట్లు ఎక్కుతారా చూడాలి.

