Modi-US Trade Deal: 'నామ్ నరేందర్.. కామ్ సరెండర్'! షర్మిల ఫైర్.. ఇది గ్రేట్ డీల్ కాదు, బ్లాక్ డీల్
అమెరికా దెబ్బకు మోదీ సరెండర్ అయ్యారా? 'మేక్ ఇన్ ఇండియా' ఇక ప్యాకప్ చెప్పేసినట్లేనా? ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) నిప్పులు చెరిగారు. "ఇది దేశానికి గ్రేట్ డీల్ కాదు.. మన రైతుల గొంతు కోసే 'బ్లాక్ డీల్'" అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "నామ్ నరేందర్.. కామ్ సరెండర్" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హీట్ పుట్టిస్తున్నాయి. అసలు షర్మిల లేవనెత్తిన ఆ లాజిక్ ఏంటి? 50 శాతం పన్నుల మాయాజాలం ఏంటి?
అగ్రరాజ్యానికి సాగిలపడ్డారా?
ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్లాక్ మెయిల్‌కు భయపడి దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటే పన్నులు పెంచుతామని ట్రంప్ బెదిరించారని, ఆ భయంతోనే మోదీ ఈ ఒప్పందానికి తలొగ్గారని ఆమె విమర్శించారు. "ఒక దేశానికి లాభం, మన దేశానికి నష్టం చేసేదాన్ని ఒప్పందం అనరు.. లొంగిపోవడం అంటారు. మోదీ గారు అమెరికా చేతిలో కీలుబొమ్మగా మారారు" అని ఆమె ధ్వజమెత్తారు.
50 శాతం పెంచి.. 18 శాతం తగ్గిస్తే లాభమా?
ఈ ఒప్పందంలోని లోపాలను ఎత్తిచూపుతూ షర్మిల ఒక లాజిక్ బయటపెట్టారు. "మొన్నటిదాకా మన వస్తువులపై అమెరికా వేసిన పన్ను 5 శాతం లోపే. ఇప్పుడు దాన్ని 50 శాతానికి పెంచి, అందులో 18 శాతం తగ్గిస్తే మనకు వచ్చే లాభం ఏముంది? కానీ మోదీ గారు మాత్రం అమెరికా వస్తువులపై పన్నులను పూర్తిగా సున్నా (Zero Duty) చేశారు. దీనివల్ల అమెరికాకు 100 శాతం లాభం.. మనకు మాత్రం తీరని నష్టం" అని ఆమె విశ్లేషించారు.
రైతులకు ఉరి.. 'మేక్ ఇన్ ఇండియా'కు గుడ్ బై!
అమెరికా ఉత్పత్తులపై సున్నా సుంకాలు విధించడం అంటే.. భారత మార్కెట్లను వారికి అప్పగించడమేనని షర్మిల మండిపడ్డారు. దీనివల్ల మన స్వదేశీ పరిశ్రమలు దెబ్బతింటాయని, 50 కోట్ల వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు ఈ ఒప్పందం మరణశాసనం అని ఆవేదన వ్యక్తం చేశారు. 75 ఏళ్ల భారత వాణిజ్య చరిత్రను మోదీ తుంగలో తొక్కారని, ఏటా 100 బిలియన్ డాలర్ల దేశ సంపదను అమెరికాకు దోచిపెడుతున్నారని ఆరోపించారు.
ఆ 'సరెండర్ అగ్రిమెంట్' చిట్టా బయటపెట్టండి!
కేవలం రెండు మూడు వస్తువుల గురించి చెప్పి మసిపూసి మారేడుకాయ చేయొద్దని, ఒప్పందం పూర్తి వివరాలను బయటపెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు. "అమెరికా నుంచి ఏయే ఉత్పత్తులు వస్తున్నాయి? వాటిపై పన్నులు ఎంత తీసేశారు? ఈ 'సరెండర్ అగ్రిమెంట్' (Surrender Agreement) గుట్టువిప్పండి" అని ఆమె డిమాండ్ చేశారు.
వ్యాపారం అంటే ఇద్దరికీ లాభం ఉండాలి!
ఒకరి బెదిరింపులకు లొంగి, స్వదేశీ రైతులను, పరిశ్రమలను పణంగా పెట్టడం 'గ్రేట్ డీల్' అనిపించుకోదు. షర్మిల ప్రశ్నలకు కేంద్రం ఇచ్చే సమాధానం ఏంటి?

