FSL Fire Accident: ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు కాలిపోయాయా? అసలు నిజం ఇదే!
హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)లో శనివారం ఉదయం చెలరేగిన మంటలు రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపాయి. మంటల కంటే వేగంగా.. "ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసుల ఆధారాలు బూడిదయ్యాయి" అనే వార్త దావానలంలా వ్యాపించింది. కీలకమైన ఆధారాలను మాయం చేయడానికే ఈ ప్రమాదం జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ ప్రచారంపై ఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ (Shikha Goel) క్లారిటీ ఇచ్చారు. అసలు ల్యాబ్‌లో ఏం జరిగింది? ఆ సెన్సేషనల్ కేసుల ఫైళ్లు ఏమయ్యాయి?
వదంతులు నమ్మొద్దు.. అంతా సేఫ్!
శనివారం ఉదయం 10:08 గంటలకు ల్యాబ్‌లోని 'సీజ్డ్ ప్రాపర్టీస్' విభాగంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగగా.. అవి శిక్షణా కేంద్రానికి కూడా వ్యాపించాయి. అయితే, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని శిఖా గోయల్ ఖండించారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌లో భద్రపరిచిన కీలక కేసుల ఆధారాలన్నీ సురక్షితంగా ఉన్నాయని, ఎలాంటి డేటా లాస్ (Data Loss) జరగలేదని ఆమె స్పష్టం చేశారు. కేవలం కొన్ని అనాలసిస్ డాక్యుమెంట్ ఫైళ్లు మాత్రమే కాలిపోయాయని, వాటిని కూడా రికవరీ చేస్తున్నామని తెలిపారు.
ఓటుకు నోటు కేసు.. 2021లోనే రిటర్న్!
తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన 2015 నాటి 'ఓటుకు నోటు' (Vote for Note) కేసుకు సంబంధించిన ఆధారాలు కాలిపోయాయన్నది అవాస్తవం. ఈ కేసుకు సంబంధించిన 16 మెటీరియల్ ఆబ్జెక్టులను ల్యాబ్ 2015లోనే స్వీకరించింది. వాటిని పరీక్షించిన అనంతరం, 2021 మార్చిలోనే ఏసీబీ కోర్టుకు తిరిగి అప్పగించామని శిఖా గోయల్ వివరించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఈ కేసుకు సంబంధించిన ఒక్క కాగితం కూడా ల్యాబ్‌లో లేదని తేల్చిచెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ చిట్టా కూడా భద్రం
ఇక సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు (Phone Tapping Case) సంబంధించి కూడా ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారులు తెలిపారు. మార్చి 2024 నుంచి జనవరి 2026 మధ్య అందిన 132 వస్తువులను పూర్తిగా పరిశీలించి, డేటాను వెలికితీశారు. వాటి నివేదికలు కొన్ని కోర్టుకు వెళ్లగా, మరికొన్ని సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ డాక్యుమెంట్లు కాలిపోయినా, టెక్నాలజీ సాయంతో డేటాను తిరిగి పొందే సామర్థ్యం తమకుందని భరోసా ఇచ్చారు.
కాలిపోయింది జిరాక్స్ కాపీలే..
ప్రమాదంలో దగ్ధమైనవి కేవలం కోర్టులకు సమర్పించిన డాక్యుమెంట్ల కాపీలు మాత్రమేనని, ఒరిజినల్స్ కోర్టుల వద్ద భద్రంగా ఉంటాయని శిఖా గోయల్ పునరుద్ఘాటించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, అనవసరమైన వదంతులను నమ్మవద్దని కోరారు.
నిప్పు లేనిదే పొగ రాదు.. కానీ ఇక్కడ వచ్చింది పొగ మాత్రమే!
కీలక ఆధారాలు కాలిపోయాయని టెన్షన్ పడాల్సిన పనిలేదు. అది ప్రమాదమే తప్ప, కుట్ర కాదని అధికారుల వివరణతో స్పష్టమైంది.

