AP Local Body Elections: ఏపీలో ఎన్నికల నగారా.. మంత్రులకు కాన్ఫిడెన్షియల్ రిపోర్టులతో చంద్రబాబు షాక్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ప్రస్తుతం ఉన్న స్థానిక సంస్థల పదవీకాలం ఈ మార్చి-ఏప్రిల్ నాటికి ముగియనుండటంతో, రానున్న ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయిన ముఖ్యమంత్రి.. ఏ ఎన్నిక జరిగినా కూటమి విజయమే ఏకైక లక్ష్యంగా పనిచేయాలని, సీట్ల సర్దుబాటు బాధ్యతను తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. అలాగే మంత్రుల పనితీరుపై ఏప్రిల్ 2న సీక్రెట్ ప్రోగ్రెస్ రిపోర్టులు ఇవ్వనున్నట్లు ప్రకటించి పాలనా యంత్రాంగంలో తీవ్ర సంచలనం రేపారు.
రాబోయే ఆరు నెలల్లోనే స్థానిక సమరం
గత ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ పాలకవర్గాలు 2021 మార్చిలో జరిగిన ఎన్నికల ద్వారా కొలువుదీరాయి. వీరి ఐదేళ్ల పదవీకాలం 2026 మార్చి-ఏప్రిల్ నాటికి ముగియనుంది. ఈ గడువు ముగియకముందే కొత్త పాలకవర్గాలను ఎన్నుకునేలా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడిన చంద్రబాబు, రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యతను పూర్తిగా ఇన్‌ఛార్జ్ మంత్రులే తీసుకోవాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు, సమన్వయం వంటి అంశాలపై అధిష్ఠానం ఎప్పటికప్పుడు స్పష్టతనిస్తుందని, ప్రతి గ్రామంలోనూ కూటమి జెండా ఎగరడమే లక్ష్యంగా వ్యూహరచన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 2026-27 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలవాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు.
ఏప్రిల్ 2న మంత్రులకు ప్రోగ్రెస్ కార్డులు
పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే దిశగా ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శుల పనితీరుపై రాబోయే ఏప్రిల్ 2వ తేదీన రహస్య నివేదికలు (కాన్ఫిడెన్షియల్ రిపోర్టులు) ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. నిర్దేశించిన లక్ష్యాల సాధన, పెండింగ్ దస్త్రాల పరిష్కారం, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో ఎవరు ఎంత చొరవ చూపారనే అంశాల ఆధారంగా ఈ రిపోర్టుల రూపకల్పన ఉండనుంది. మంత్రులు కేవలం సచివాలయానికే పరిమితం కాకుండా, నిరంతరం క్షేత్రస్థాయి పర్యటనలు చేసి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవాలని, వారితో పూర్తిగా మమేకం కావాలని చంద్రబాబు గట్టిగా సూచించారు.
సోషల్ మీడియా వాడకంలో వెనుకబాటుపై అసహనం
ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో కొందరు మంత్రుల తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వం చేసిన మంచి పనులను కూడా ప్రజలకు సరిగ్గా చెప్పుకోలేకపోతే ఆశించిన ప్రయోజనం ఉండదని ఆయన మంత్రులను నేరుగా ప్రశ్నించారు. ముఖ్యంగా నేటి డిజిటల్ యుగంలో సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో మంత్రులు బాగా వెనుకబడ్డారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని పార్టీ నుంచి వచ్చే ప్రతి సమాచారాన్ని సోషల్ మీడియాలో వేగంగా, విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి నారా లోకేశ్ సైతం ఇదే సమావేశంలో తోటి మంత్రులకు సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read:
AP CM Ugadi Gifts: సొంతిల్లు, కరెంటు బిల్లుల తగ్గింపు, రైతుల ఖాతాల్లో డబ్బులు.. సామాన్యుడి రాత మార్చే చంద్రబాబు ఉగాది కానుకలివే!AP 10th Exams 2026: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా ఎగ్జామ్ సెంటర్ కు తీసుకెళ్లనున్న ఏపీఎస్ ఆర్టీసీ
TTD Annaprasadam Updates: తిరుమలలో రాబోతున్న హైటెక్ కిచెన్.. అంబానీ ఇస్తున్న రూ.120 కోట్లతో ఆటోమేషన్
Indradhanassu Scheme AP: ఏపీ దివ్యాంగులకు గుడ్ న్యూస్.. మార్చి 18 నుంచే ఉచిత బస్సు ప్రయాణం

